తండ్రి, బాబాయ్‌లపై బ్లేడ్‌తో దాడి

Son Blade Attack On Father In West Godavari - Sakshi

పనిచేసుకో అన్నందుకు ఓ వ్యక్తి ఆగ్రహం

తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న బాధితులు

పశ్చిమగోదావరి ,పాలకొల్లు సెంట్రల్‌ : పనిలోకి వెళ్లకపోతే ఎలా అని? ప్రశ్నించిన పాపానికి తండ్రితో పాటు బాబాయ్‌ని బ్లేడ్‌తో గాయపరిచిన ఓ వ్యక్తి ఉదంతం ఇది. ఈ సంఘటన ఆదివారం పాలకొల్లు రూరల్‌ పంచాయతీ యాళ్లవానిగరువు డాంపేటలో(ఆమ్లెట్‌) చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం, డాంపేటకు చెందిన పుచ్చకాయల బ్రహ్మయ్య రిక్షా కార్మికుడు. ఇతనికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు రమేష్‌ మద్యంకు బానిసై ఏ పనిచేయకుండా అల్లరిచిల్లరగా తిరుగుతున్నాడు. ఇతనకు వివాహమైంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య గల్ఫ్‌లో ఉంటుంది. ఇతని బాధ భరించలేక ఆమె రావడంలేదని బందువులు తెలిపారు. కుమార్తెను హింసిస్తుండడంతో ఆ పాప తాతగారింటిలో ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం తండ్రి బ్రహ్మయ్య రమేష్‌ను ఖాళీగా తిరిగితే ఎలా అంటూ సలహా ఇచ్చాడు.

దీంతో ఆగ్రహం తెచ్చుకున్న రమేష్‌ సాయంత్రం 6 గంటల సమయంలో మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. ముందుగా తల్లి మరియమ్మపై దాడి చేయబోయాడు. భయంతో ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల జనం వచ్చారు. దీంతో అక్కడి నుంచి పారిపోయి బ్రాడీపేట బైపాస్‌ రోడ్డులో ఆదిత్య స్కూల్‌ వద్ద ఉన్న ఓ బడ్డీ కొట్టువద్ద నిలబడి ఉన్నాడు. ఇంతలో రమేష్‌ తండ్రి బ్రహ్మయ్య ఎక్సెల్‌ వాహనంపై ఇంటికి వస్తుండగా నాన్న నేను ఇంటికి వస్తానని చెప్పి బండి వెనకాల కూర్చున్నాడు. ఇంటికి సమీపంలోకి వచ్చే సరికి తన చేతిలో ఉన్న బ్లేడ్‌తో తండ్రి పీక కోసేశాడు. భయభ్రాంతులకు గురైన బ్రహ్మయ్య కేకలు వేస్తూ వాహనం వదిలేసి మెడకు తన వద్ద ఉన్న రుమాలు చుట్టుకుని ఇంటికి పరుగులు తీశాడు.

రమేష్‌ ఆ వాహనం వేసుకుని వెనక్కి వెళ్లిపోయాడు. ఇంతలో ఈ విషయం తెలిసిన ఆ పేటలో జనం గుమిగూడి విషయం తెలుసుకున్నారు. తండ్రి వాహనం వేసుకెళ్లిన రమేష్‌ ఉల్లంపర్రు గ్రామం మీదుగా చుట్టు తిరిగి డాంపేట తన ఇంటికి వస్తున్నాడు. ఇంతలో రమేష్‌ చిన్నాన్న నారాయణమూర్తి రోడ్డుపై ఎదురయ్యాడు. ‘నాన్న మెడను ఎందుకు కోసావురా?’ అని ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహానికి గురైన రమేష్‌ తన చిన్నాన్న నారాయణమూర్తిని కూడా చేతులు, మెడ దగ్గర కోశాడు. నారాయణమూర్తి సంవత్సరం క్రితం గుండె ఆపరేషన్‌ చేయించుకున్నాడని అతని కుమారుడు ఆవేదన వ్యక్తం చేశాడు. బాధితులు ఇద్దరినీ పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్‌ చేయగా చేతులు, మెడపైన కుట్టులు వేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. రమేష్‌ కోసం గ్రామంలోనే పోలీసులు గాలిస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top