పోలీసుల అదుపులో ‘శ్రీ చైతన్య’ సిబ్బంది

Shri Chaitanya staff in police custody - Sakshi

సాక్షి ప్రతినిధి, నెల్లూరు/నెల్లూరు (టౌన్‌): ర్యాంకర్లను ప్రలోభపెడుతున్నారన్న వ్యవహారం కార్పొరేట్‌ సంస్థలైన శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థల మధ్య అగ్గి రాజేసింది. విద్యార్థుల్ని కిడ్నాప్‌ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీ చైతన్య విద్యాసంస్థల సిబ్బంది లింగాల రమేష్, ఐ.పార్థసారథిని నెల్లూరు వన్‌టౌన్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

వివాదం మొదలైందిలా: నగరంలోని నారాయణ స్కూల్లో పదో తరగతి చదువుతున్న నెల్లూరు చాకలి వీధికి చెందిన రియాజ్‌ అహ్మద్, ఆరిఫా దంపతుల కుమారుడు ఎండీ ఫాజిల్‌ను తమ కళాశాలలో ఉచితంగా బోధిస్తామని చెప్పి శ్రీచైతన్య ఉద్యోగులు లింగాల రమేష్, ఐ.పార్థసారథిలు ఈ నెల 20 హైదరాబాద్‌ తీసుకెళ్లిన సంగతి విదితమే. అక్కడి అప్పయ్య సొసైటీలోని శ్రీ చైతన్య రెసిడెన్షియల్‌ క్యాంపస్‌లో ఉన్న ఫాజిల్‌ను  కలిసేందుకు అతని తల్లిదండ్రులు యత్నించినా అవకాశమివ్వని నేపథ్యంలో  విద్యార్థి తల్లి ఆరిఫా 25న నెల్లూరు వన్‌టౌన్‌లో స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు శుక్రవారం శ్రీచైతన్య సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు శుక్రవారం ఉదయం వన్‌టౌన్‌ పోలీసులు హైదరాబాద్‌ వెళ్లారు. శనివారం ఉదయానికి విద్యార్థి ఫాజిల్‌ను నెల్లూరు తీసుకురానున్నారు. 

రాజకీయ పలుకుబడితో ఇబ్బంది పెడుతున్నారు: రాజకీయ పలుకుబడితోనే మంత్రి నారాయణ తమ యాజమాన్యాన్ని ఇబ్బంది పెడుతున్నారని శ్రీ చైతన్య విద్యా సంస్థల అకడమిక్‌ డైరెక్టర్‌ సుష్మా బొప్పన ఆరోపించారు. మీడియాతో మాట్లాడుతూ నారాయణ విద్యాసంస్థలతో తమకు గల భాగస్వామ్యంపై పునరాలోచన చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తల్లిదండ్రుల అంగీకారం, పిల్లల ఇష్టంతోనే నారాయణ స్కూల్‌ నుంచి శ్రీచైతన్య స్కూల్‌కు ముగ్గురు విద్యార్థులను తీసుకెళ్లినట్లు తెలిపారు. 

నిందలు దారుణం: నెల్లూరులోని తమ విద్యార్థుల తల్లిదండ్రులను ప్రలోభపెట్టి హైదరాబాద్‌కు తరలించడమే కాకుండా.. శ్రీ చైతన్య విద్యాసంస్థల నిర్వాహకులు తమ సంస్థపై నిందలు వేయడం దారుణమని నారాయణ విద్యాసంస్థల జనరల్‌ మేనేజర్‌ విజయభాస్కర్‌రెడ్డి  ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top