కశ్మీరీ విద్యార్థులపై సేన కార్యకర్తల దాడి

Shiva Sena Sacks Youth Activists Who Allegedly Assaulted Kashmiri Students - Sakshi

ముంబాయి: ఇద్దరు కశ్మీరీ విద్యార్థులపై శివసేన యూత్‌ వింగ్‌ కార్యకర్తలు బుధవారం రాత్రి దాడిచేశారు. అనంతరం దాడి చేసిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు. విషయం తెలిసిన పోలీసులు దాడికి పాల్పడిన 8 మంది సేన కార్యకర్తలను అరెస్ట్‌ చేసి వారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం..దాయాబాయి పటేల్‌ శారీరిక్‌ శిక్షణ్‌ మహావిద్యాలయకు చెందిన ఇద్దరు కశ్మీరీ విద్యార్థులు మార్కెట్‌ నుంచి వారు ఉంటున్న అద్దె ఇంటికి వెళ్తుండగా చింతామని నగర్‌ ప్రాంతం వద్ద సేన కార్యకర్తలు అడ్డుకున్నారు. వారిపై దాడి చేసి వందేమాతరం, భారత్‌ మాతాకీ జై అని దేశభక్తి నిరూపించుకోవాలని బలవంతంగా నినాదాలు చేయించారు.

ఆ సంఘటన నుంచి బయటపడిన అనంతరం  బాధితులు మీడియాతో మాట్లాడారు. ఉగ్రదాడి జరిగిన నాటి నుంచి తమకు ముప్పు ఉందని, మేము ఇక్కడ ఒకటిన్నర సంవత్సరం నుంచి ఉంటున్నామని, కానీ ఇప్పుడు అద్దెకు ఉంటున్న గదిని నాలుగు రోజుల్లో ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చదువుకోవడం చాలా కష్టంగా ఉందని బాధితులు వాపోయారు. శివసేన యూత్‌ వింగ్‌ యువసేన ప్రెసిడెంట్‌ ఆదిత్యా థాక్రే ఈ దాడిని ఖండించారు. అమాయకులను అనవసరంగా లక్ష్యంగా చేసుకుని దాడులు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ దాడిలో పాల్గొన్న యువసేన కార్యకర్తలను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.

దాడికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్థానిక ఎస్పీ ఎం రాజ్‌కుమార్‌ మీడియాకు తెలిపారు.  పుల్వామా జిల్లాలో  జైష్‌ ఈ మహ్మద్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాది ఓ వాహనంతో సీఆర్‌ఫీఎఫ్‌ జవాన్లు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టి తనను తాను పేల్చుకోవడంతో 40 మంది జవాన్లు మరణించిన సంగతి తెల్సిందే. అప్పటి నుంచి పలు రాష్ట్రాల్లో కశ్మీరీలపై చిన్న చిన్న దాడులు జరుగుతూనే ఉన్నాయి.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top