దోస్త్‌ ఫారిన్‌ పోవొద్దని...

Shashi Kanth who mailed bomb threats to the Shamshabad Airport - Sakshi

ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్‌ చేసిన ప్రబుద్ధుడు

స్నేహితుడిచ్చే పార్టీలు దూరమవుతాయనే ఉద్దేశంతోనే..

అదుపులోకి తీసుకున్న పోలీసులు

శంషాబాద్‌: స్నేహితుడు ఇస్తున్న విందులు, లభిస్తున్న విలాసాలు దూరమైపోతాయని అతడి విదేశీ ప్రయాణాన్ని రద్దు చేయడానికి ఓ ప్రబుద్ధుడు చేసిన నిర్వాకమిది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో బాంబు పేలుస్తానంటూ బెదిరింపు మెయిల్‌తో భద్రతాధికారులు, పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించిన ఓ వ్యక్తి జైలు పాలయ్యాడు. శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి బుధవారం తన కార్యాలయంలో ఈ కేసు వివరాలు వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చెందిన కస్టమర్‌ సపోర్ట్‌ మెయిల్‌కు కాలేరు సాయిరాం అన్న ఐడీతో ఓ సందేశం వచ్చింది. అందులో ‘ఐ వాంట్‌ బాంబ్‌ బ్లాస్ట్‌ ఇన్‌ ఎయిర్‌పోర్టు టుమారో’అని ఉంది. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

మెయిల్‌ ఐడీ మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కాలేరు సాయిరాందిగా గుర్తించారు. ప్రస్తుతం అతడు ఉప్పల్‌లోని ఫిర్జాదిగూడలో నివాసముండటంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. కెనడాలో ఉన్నత చదువుల కోసం సాయిరాం కొంతకాలంగా ప్రయత్నిస్తున్నాడు. వరంగల్‌కు చెందిన తన స్నేహితుడు శశికాంత్‌ నగరంలోనే ఎంటెక్‌ చదువుతూ అమీర్‌పేట్‌లో నివాసముంటున్నాడు. సాయిరాం మొదటిసారి వీసా రాకపోవడంతో రెండోసారి ఆగస్టు 5న తన వివరాలన్నింటిని పీడీఎఫ్‌ ఫైల్‌గా చేసి శశికాంత్‌ ఇంటికి వెళ్లి అక్కడి నుంచి కెనడా వీసాకు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ సమయంలో శశికాంత్‌ సాయిరాం వివరాలన్నింటిని తస్కరించాడు. సాయిరాం వెళ్లిన తర్వాత కెనడా ఇమిగ్రేషన్‌కు అసభ్యకరమైన సందేశాలను సాయిరాం మెయిల్‌ ఐడీ ద్వారా పంపాడు. ఈ విషయమై సాయిరాంకు అక్కడి నుంచి సమాచారం రావడంతో వెంటనే రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ జరుగుతోంది. 

మరోసారీ చెడగొట్టాలని.. 
కెనడాలో ఉన్నత చదువుల కోసం మరోసారి సాయిరాంకు అవకాశం రావడంతో సెప్టెంబర్‌ 4న కెనడా వెళ్లడానికి అంతా సిద్ధం చేసుకున్నాడు. ఈసారి సాయిరాం ప్రయాణాన్ని ఎలాగైనా చెడగొట్టాలని శశికాంత్‌ నిర్ణయించుకున్నాడు. తాజాగా సెప్టెంబర్‌ 3న మరోసారి సాయిరాం ఐడీతోనే శంషాబాద్‌ విమానాశ్రయంలోని కస్టమర్‌సపోర్ట్‌ మెయిల్‌ ఐడీకి ఎయిర్‌పోర్టులో బాంబు పేలుస్తానంటూ సందేశం పంపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సైబర్‌ క్రైమ్‌ పోలీసులను రంగంలోకి దింపారు. కాలేరు సాయిరాం ద్వారా వివరాలను సేకరించడంతో అతడి స్నేహితుడైన శశికాంత్‌ను అదుపులోకి తీసుకుని విచారించడంతో తానే తప్పుడు సందేశాలు పంపినట్లు అంగీకరించాడు. అతడి నుంచి ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్‌పోర్టు భద్రతకు భగ్నం కలిగించే విధంగా వ్యవహరించినందుకుగాను వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. విలేకరుల సమావేశంలో ఏసీపీ అశోక్‌కుమార్, సీఐ రామకృష్ణ పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top