నన్ను వదిలేస్తే మరికొందరిని చంపుతా..!

Serial killer Said To Mumbai Police If Let Off Then He Will Kill Again - Sakshi

ముంబై : మొక్క మహావృక్షంగా ఎదగాలంటే మూలాలు బాగుండాలి. అలానే మనిషి ఉన్నతంగా ఎదగాలంటే పెంపకం బాగుండాలి. మరీ ముఖ్యంగా బాల్యం. అమ్మనాన్నల ప్రేమ, ఆప్యాయత, ఆదరణ కరువైతే.. ఎదిగాక మనిషి ఎలా మారతాడనే దానికి ఉదాహరణగా నిలిచాడు విఠల్‌ భజంత్రి(26). కర్ణాటక రాష్ట్రం, గుల్బర్గా జిల్లా అఫ్జల్‌పూర్‌ గ్రామానికి చెందిన భజంత్రి 12 ఏళ్ల వయసులో ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్‌లో కూలీగా చేరాడు. ఆ సమయంలో వయసులో ఇతనికంటే పెద్దవారైన లేబర్స్‌ భజంత్రికి డ్రగ్స్‌ ఇచ్చి అతని మీద లైంగిక దాడి  చేశారు. ఈ భయంకరమైన అనుభవాలు అతని మనసులో అలానే గూడుకట్టుకుపోయాయి. వీటి నుంచి దూరంగా పారిపోవాలని ప్రయత్నించాడు.. కుదరలేదు.

గట్టిగా మాట్లాడ్డానికి కూడా ఇష్టపడని భజంత్రి.. ఎవరైనా తనను తిడిడే మాత్రం తట్టుకోలేకపోయేవాడు. అంత సేపు ప్రశాంతంగా ఉన్న అతనిలో మృగం మేల్కోనేది. ఆ కోపంతో తనను హేళన చేసిన వారిని చంపేసేవాడు. ఇలా ఇప్పటికి 5గుర్ని అంతమొందించాడు. అయితే చంపడానికి ఆయుధాలు కాకుండా.. బండరాయిని వాడేవాడు. మొదటి హత్య 2017, అక్టోబర్‌లో చేశాడు. తనను, తన స్నేహితున్ని తిట్టిన ఓ లేబర్‌ని బండరాయితో కొట్టి చంపాడు. ఓ నెల తిరక్కముందే మరో హత్య చేశాడు. బలహీనంగా ఉన్నావంటూ హేళన చేసిన మరో లేబర్‌ని నవంబర్‌ 7, 2017న హత్య చేశాడు. ఇతన్ని కూడా బండరాయితోనే కొట్టి చంపాడు భజంత్రి. మూడోసారి ఏకంగా తన సోదరి భర్తనే చంపేశాడు. ఒక రోజు తన సోదరి, ఆమె భర్త గొడవపడుతుండటం చూశాడు భజంత్రి. ఆ కోపంలో తన బావను నవంబర్‌ 12, 2017న అతన్ని చంపేశాడు.

కానీ ఈ సారి పోలీసులకు చిక్కాడు భజంత్రి. డిసెంబర్‌ 6, 2017న పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేసి జైలుకు పంపించారు. ఒక సంవత్సరం పాటు జైలులో గడిపిన తరువాత 2018, డిసెంబరులో బెయిల్‌ మీద జైలు నుంచి బయటకు వచ్చాడు. అయితే పోలీసులకు కేవలం మూడో హత్య గురించే తెలుసు. మొదటి రెండింటి గురించి తెలియదు. దాంతో త్వరగానే బెయిల్‌ దొరికింది. కానీ మొదటి రెండు హత్యల గురించి భజంత్రి స్నేహితుడు సూరజ్‌కు తెలుసు. దాంతో అతన్ని చంపాలని పథకం పన్నాడు భజంత్రి. అందులో భాగంగా పని ఉందని చెప్పి స్నేహితున్ని వెంటపెట్టుకుని వెళ్లాడు. అక్కడ మరో వ్యక్తితో కలిసి సూరజ్‌ని చంపేశాడు. ఈ హత్య జనవరి 4, 2019న జరిగింది. ఈ హత్య కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు సూరజ్‌ను చంపిన వ్యక్తి కర్ణాటకలో ఉంటున్నట్లు తెలిసింది. దాంతో అతన్ని అరెస్ట్‌ చేయడానికి గుల్బర్గా వెళ్లారు పోలీసులు.

అతన్ని విచారించగా భజంత్రి గురించి తెలిసింది. ఇతను ఇంతకు ముందే ఓ మర్డర్‌ కేసులో జైలుకు వెళ్లి వాచ్చడని నిర్ధారించుకున్న పోలీసులు భజంత్రి గురించి వెతకడం ప్రాంరభించారు. ఈ క్రమంలో గత నెల 19న ఓ హైవే మీద నడుచుకుంటూ వెళ్లున్న భజంత్రిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. విచారణలో భాగంగా భజంత్రి తాను చేసిన ఐదు హత్యల గురించి పోలీసులకు తెలియజేశాడు. అంతేకాక కామ్‌గా ఉండే తనని ఎవరైనా హేళన చేస్తే మృగంగా మారతానని.. వారిని చంపేవరకూ ఊరుకోనని తెలిపాడు. చిన్నతనంలో తాను ఎదుర్కొన్న పరిస్థితులే తనను ఇలా మార్చాయని వెల్లడించాడు. మద్యం తాగితే తాను కంట్రోల్‌లో ఉండనన్నాడు. మంచిగా మారడానికి ప్రయత్నించానని.. సాధ్యం కాలేదని తెలిపాడు. తనను జైలు నుంచి బయటకు పంపిస్తే మరింత మందిని చంపుతానని పేర్కొన్నాడు. ప్రస్తుతం భజంత్రి పోలీసుల కస్టడీలో ఉన్నాడు. అతను చేసిన ఐదు హత్యల్లో నలుగురి మృతదేహాలు పోలీసులకు లభించాయి. మరోక హత్య గురించి ఎటువంటి వివరాలు తెలియలేదు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top