అరగంటలో కిడ్నాప్‌ కేసు ఛేదన

Rowdy Sheeter Kidnapped And Release in Hours Vijayawada - Sakshi

అప్పు తీసుకున్న యువకుడిని కిడ్నాప్‌ చేసిన రౌడీషీటర్‌  

పోలీసులను ఆశ్రయించిన తండ్రి

సెల్‌ సిగ్నల్‌ ద్వారా నిందింతుల గుర్తింపు

కిడ్నాప్‌ డ్రామాతో బయటపడిన అక్రమ మద్యం వ్యవహారం

తాడేపల్లిరూరల్‌(మంగళగిరి): యువకుడు కిడ్నాప్‌కు గురైన కేసును పోలీసులు అరగంటలో ఛేదించారు. వివరాలిలా ఉన్నాయి. కృష్ణా జిల్లా నిడమానూరు గ్రామానికి చెందిన తడపతినేని శేఖర్‌ అనే యువకుడు తన లారీలో ఇసుక అక్రమంగా తోలుతూ పట్టుబడ్డాడు. అధికారులు లారీని సీజ్‌ చేసి అపరాధ రుసుం విధించారు. ఆ మొత్తం చెల్లించేందుకు శేఖర్‌ నిడమానూరు గ్రామంలో ఒక కారును రెండు నెలల క్రితం అద్దెకు తీసుకుని దాన్ని తాడేపల్లిలోని రౌడీషీటర్‌ తొత్తుక శివకుమార్‌కు తాకట్టు పెట్టి రూ.లక్ష తీసుకున్నాడు. కారు యజమాని పలుమార్లు శేఖర్‌ను ప్రశ్నించగా తాడేపల్లిలోని ప్రాతూరు కరకట్ట వెంట ఉందని చెప్పడంతో రెండో తాళం తీసుకొని కారును తీసుకువెళ్లాడు.

విజయవాడలో బంధీ...
దీంతో రౌడీషీటర్‌ శివకుమార్‌ శేఖర్‌కు ఫోన్‌ చేసి విజయవాడకు పిలిపించి బంధించాడు. శివకుమార్‌తో పాటు అతని సోదరులైన రౌడీషీటర్లు తొత్తుక రాంబాబు, తొత్తుక సాయి, మరో రౌడీషీటర్‌ సతీష్‌ శేఖర్‌ను చిత్రహింసలు పెట్టారు.

ఆ కారులో తెలంగాణ నుంచి రూ.2.50 లక్షల విలువైన మద్యాన్ని తీసుకొచ్చామని, ఖర్చులతో కలిపి మొత్తం రూ.5 లక్షలు కట్టాలంటూ బలవంతంగా పత్రాలపై సంతకం చేయించారు. అనంతరం శేఖర్‌ తండ్రి వెంకట్రావుకు ఫోన్‌ చేసి, నీ కొడుకు రూ.5 లక్షలు ఇవ్వాలి, తెచ్చి ఇవ్వకపోతే చంపేసి కృష్ణానదిలో పూడుస్తామంటూ బెదిరించారు. వెంకట్రావు డబ్బులు తీసుకుని తాడేపల్లి వచ్చి అనుమానంతో తాడేపల్లి సీఐ అంకమ్మరావును ఆశ్రయించాడు. సెల్‌ సిగ్నల్‌ ద్వారా సీఐ కిడ్నాపర్‌లు శేఖర్‌ను ఉంచిన స్థలాన్ని కనుగొని అందరినీ అదుపులోకి తీసుకున్నారు.

అక్రమ మద్యం తరలింపు వెలుగులోకి...
రౌడీషీటర్‌ శివకుమార్‌ అతని అనుచరులు తాకట్టు పెట్టుకున్న కారులో తెలంగాణ నుంచి మద్యం తరలిస్తూ తమ జేబులు నింపుకొన్నారు. చివరకు కిడ్నాప్‌ డ్రామాతో వీరి అక్రమ మద్యం వ్యాపారం బయటపడింది. పోలీసులు మద్యాన్ని స్వాధీనం చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top