ఆ మూడు గంటలు యమ ఘడియలు !

Road Accidents in Karnataka - Sakshi

బెంగళూరు నగరంలో గత ఏడాది 4,611 రోడ్డు      ప్రమాదాలు

రాష్ట్ర వ్యాప్తంగా 684 మంది మృతి

మృతుల్లో ద్విచక్ర వాహనదారులే అధికం

ఉడుకు నెత్తురు, ఉరకలెత్తే ఉత్సాహం, గాల్లో తేలిపోయే బైక్‌లు, కార్లు.. ఇవి చాలు నిండు నూరేళ్ల జీవితం అర్ధాంతంగా ముగిసిపోవడానికి, ఇంత జరుగుతున్నా యువతలో మాత్రం చైతన్యం రావడం లేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రమాదాలు పెరిగిపోతున్నాయి

కర్ణాటక ,బనశంకరి :  ఏడాదికేడాది బెంగళూరు నగరంలో వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడంతో నగరంలో రోడ్డు ప్రమాదాలు కూడా అంతేస్థాయిలో జరుగుతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల గత ఏడాది కూడా బెంగళూరు నగరంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య ఎక్కువగానే నమోదైనట్లు పోలీసుశాఖ వెల్లడించిన గణాంకాల ద్వారా తెలిసింది. గత ఏడాది బెంగళూరు నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా సోమవారం రోజునే జరిగాయని అందులోనూ మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలోనే ప్రమాదాలు జరిగినట్లు తెలిసింది. ఈ మూడు గంటల వ్యవధిలో మొత్తం 768 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోగా సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల మధ్య 766 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.

ఈ ఆరు గంటల వ్యవధిలో కార్యాలయాల నుంచి ఇళ్లకు బైక్‌లపై వెళ్లే ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో పాటు ఈ సమయంలో ద్విచక్రవాహనాల లైట్లు కూడా సరిగా పనిచేయకపోవడం ప్రమాదాలకు కారణాలుగా తెలుస్తోంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం వరకు 720 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. రాత్రి తొమ్మిది గంటల నుంచి 12 గంటల మధ్య 536 రోడ్డు ప్రమాదాలు జరుగగా అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ఉదయం ఆరు గంటల మధ్య 474 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. గత ఏడాది బెంగళూరు నగరంలో మొత్తం 4,611 ప్రమాదాలు చోటు చేసుకోగా అందులో 1,473 కారు ప్రమాదాలు ఉండగా 1,337 ద్విచక్ర వాహనాలు, 482 ట్రక్కులు, 392 బస్సులు ప్రమాదాలకు గురైనట్లు తెలిసింది. 

ద్విచక్ర వాహనదారులే అధికం : గత ఏడాది చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో కూడా ఎక్కువగా ద్విచక్రవాహనదారులు, పాదచారులే మృతి చెందినట్లు తెలుపుతున్నారు. బెంగళూరు నగరంలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో 317 మంది ద్విచక్ర వాహనదారులు మృతి చెందగా 276 మంది పాదచారులు మృతి చెందినట్లు తెలిసింది. మొత్తంగా గత ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 684 మంది మృతి చెందారు.

నిర్లక్ష్యమే ముఖ్యకారణం : ట్రాఫిక్‌ నిబంధనల అతిక్రమణ, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ రోడ్డు ప్రమాదాలకు కారణాలుగా ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ హరిశేఖరన్‌ తెలిపారు. ముఖ్యంగా కార్లు,జీపు డ్రైవర్లు మద్యం మత్తులో  వాహనాలు నడపడంతో ప్రమాదాలు సంభవిస్తున్నట్లు తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top