రషీద్‌..అను నేను..!

Rasheed Arrest In Woman Trafficking In Hyderabad - Sakshi

నాటి ‘పాస్‌పోర్ట్‌ కేసులో’ లొంగుబాటు నేపథ్యంలో...

తనకు తానే పోలీసులకు పరిచయం చేసుకున్న వైనం

సాక్షి, సిటీబ్యూరో:  2007 ఏప్రిల్‌లో అప్పటి బీజేపీ ఎంపీ బాబూభాయ్‌ కటారా ఢిల్లీలో అరెస్టుతో దొరికిన మనుషుల అక్రమ రవాణా తీగను లాగితే రాష్ట్రంలో డొంక కదిలింది.. దేశ వ్యాప్తంగా అనేక మంది రాజకీయ నాయకులకు ఈ స్కామ్‌లో ‘దళారి’గా వ్యవహరించిన రషీద్‌ పేరు వెలుగులోకి వచ్చింది... అతడి కోసం ïనగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్‌) పోలీసులతో పాటు రాష్ట్రంలోని అన్ని నిఘా, పోలీసు విభాగాలు గాలింపు ప్రారంభించాయి... మోస్ట్‌ వాంటెడ్‌గా మారిన రషీద్‌ తనంతట తానుగా లొంగిపోవడానికి సీసీఎస్‌ మెట్లు ఎక్కాడు... అక్కడి పోలీసులు అతడిని దాదాపు గెంటేసినంత పని చేశారు...ఇదే రషీద్‌ ‘ఐటీ నోటీసులు చూపించి లూఠీ చేసిన కేసులో’ సీసీఎస్‌ పోలీసులు రెండోసారి బుధవారం అరెస్టు చేసిన విషయం విదితమే. అప్పట్లో అలా ఎందుకు జరిగింది? స్కామ్‌ వివరాలు ఇలా ఉన్నాయి..

వారికి అనుమతి లేనందునే...
టూరిస్ట్‌ సహా వివిధ వీసాలపై వచ్చి అక్రమంగా స్థిరపడిపోతున్న నేపథ్యంలో అమెరికా, లండన్‌ తదితర దేశాలు గుజరాత్‌కు చెందిన మహిళలు, యువతులకు వీసా ఇవ్వడం మానేశాయి. అయితే రాజకీయ నాయకుల సిఫార్సుతో వారి కుటుంబీకులు, సంబంధీకులకు మాత్రమే వీటిని జారీ చేసేవారు. దీంతో మనుషుల అక్రమ రవాణా కుంభకోణానికి తెరలేచింది. గుజరాత్‌కు చెందిన వారిని ఎంపీలు, ఎమ్మెల్యేల సంబంధీకులుగా చూపిస్తూ నకిలీ పాస్‌పోర్ట్స్‌ తయారు చేయడ,ం వారి సిఫార్సుతో వీసాలు సంపాదించి అక్రమ రవాణా చేయడం మొదలైంది. నగరంలోని చాదర్‌ఘాట్‌ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ రషీద్‌ అలీ, చెప్పల్‌బజార్‌ వాసి రాజుపిట్టి  స్నేహితులు. వ్యాపారి, క్రికెట్‌ బుకీగా పని చేస్తున్న రాజు రషీద్‌కు అవసరమైన సొమ్ము వడ్డీకి ఇచ్చేవాడు. ఈ నేపథ్యంలో రషీద్‌ మనుషుల అక్రమ రవాణా వ్యవహారాన్ని పిట్టికి చెప్పడంతో అతను గుజరాత్‌లోని కల్లోల్‌ ప్రాంతానికి చెందిన భరత్‌భాయ్‌ని కలుసుకున్నాడు. అనంతరం వారితో కలిసి నకిలీ పాస్‌పోర్ట్స్‌ తయారీ ప్రారంభించాడు. 

బాబుభాయ్‌ అరెస్టుతో ప్రకంపనలు...
ఈ ద్వయం అనేక మంది గుజరాతీయులను ప్రముఖ రాజకీయ నాయకుల బంధువులు, కుటుంబ సభ్యులుగా పేర్కొంటూ నకిలీ పాస్‌పోర్ట్స్‌ ఇప్పించే వారు. ఇందుకుగాను సదరు నేతలకు భారీగానే ముట్టచెప్పేవారు. 2006 నవంబర్‌లో రషీద్‌ నుంచి రాజుపిట్టికి ఓ సందేశం అందింది. నేరెళ్ల, బోథ్‌ నియోజకవర్గాలకు చెందిన అప్పటి ఎమ్మెల్యేలు కాసిపేట లింగయ్య, సోయం బాబూరావు తమకు సహకరించడానికి సమ్మతించారన్నది దాని సారాంశం. ఇక అక్కడి నుంచి ప్రారంభమైన వ్యవహారం 2007 మేలో ఢిల్లీలో బాబూభాయ్‌ కటారా, నగరంలో లింగయ్య, బాబూరావు అరెస్టుతో సంచలనం రేపింది. సిటీ సీసీఎస్‌లోనూ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో రషీద్‌ అటు ఢిల్లీ, ఇటు సిటీ పోలీసులకు రషీద్‌ మోస్ట్‌ వాంటెడ్‌గా మారాడు. ఇతడితో పాటు మహ్మద్‌ ముజఫర్‌ అలీఖాన్, భరత్‌భాయ్, షకీల్‌ల కోసం వేట ప్రారంభమైంది.

మీడియా హడావుడి నేపథ్యంలో...
సిటీ సీసీఎస్‌లో మనుషుల అక్రమ రవాణా కేసు నమోదైన రోజు నుంచి ఆ కార్యాలయం హడావుడిగా మారిపోయింది. మీడియా తాకిడితో ఉక్కిరిబిక్కిరైన సీసీఎస్‌ పోలీసులు ఎవరినీ లోపలకు అనుమతించవద్దంటూ గేటు వద్ద విధుల్లో ఉండే సెంట్రీకి స్పష్టం చేశారు. ఓ పక్క రషీద్‌ కోసం ఢిల్లీ, సీసీఎస్, టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల వేట ముమ్మరంగా సాగుతోంది. 2007 మే 3న తన న్యాయవాది, ఇద్దరు మీడియా వ్యక్తులతో కలిసి రషీద్‌ నేరుగా సీసీఎస్‌ వద్దకు వచ్చాడు. లొంగిపోవాలనే ఉద్దేశంతో లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. సెంట్రీ అడ్డుకున్నాడు. ‘నేను రషీద్‌ని... లొంగిపోతా’ అని చెబుతున్నా వినకుండా నెట్టేసినంత పని చేశాడు. ఆయన పక్కనే ఉన్న మీడియా ప్రతినిధులు ప్రత్యేక బృందాలు గాలిస్తున్న రషీద్‌ వచ్చాడంటూ కేసు దర్యాప్తు అధికారికి సమాచారం ఇచ్చారు. దీంతో వారు రషీద్‌ను తమవెంట తీసుకువెళ్లి విచారణ, అరెస్టు పూర్తి చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top