బాలికపై ఘాతుకం

Rape attempt on minor girl in koraput - Sakshi

తొమ్మిదో తరగతి బాలికను అపహరించి నలుగురి అత్యాచారం

ఒడిశాలోని కొరాపుట్‌ జిల్లాలో ఘటన

బీఎస్‌ఎఫ్‌ జవాన్లే లైంగికదాడికి పాల్పడ్డారని ఆరోపణలు

జయపురం/కొరాపుట్‌: తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను నలుగురు కామాంధులు కాటేశారు. అయితే బీఎస్‌ఎఫ్‌ జవాన్లే బాలికపై లైంగికదాడికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఒడిశాలోని కొరాపుట్‌ జిల్లాను కుదిపేశాయి. జిల్లాలో మావోయిస్టుల దాడుల నుంచి ప్రజలను కాపాడేందుకు, మావోలను నియంత్రించేందుకు బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌) బెటాలియన్‌లను ఏర్పాటుచేశారు. మంగళవారం కొరాపుట్‌ జిల్లా పొట్టంగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివాసీ బాలికను నలుగురు బీఎస్‌ఎఫ్‌ జవానులు ఎత్తుకుపోయి సామూహికంగా లైంగిక దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలు సంచలనమయ్యాయి.

నడిచివెళ్తుండగా..
హటపొదర్‌ గ్రామంలో ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బాలిక పాఠశాలలో ఇచ్చేందుకు అవసరమైన ఫొటోలు తీయించుకునేందుకు మంగళవారం కుందులి సంత వద్దకు వెళ్లింది. ఫొటోలు తీసుకుని సొంత ఊరు ముషాగుడకు బయలుదేరింది. కుందులిలో ఆటోలో బయలుదేరి తమ గ్రామ జంక్షన్‌లో దిగి నడిచి వెళ్తుండగా ముసుగులు వేసుకుని జవాన్ల దుస్తులతో ఉన్న నలుగురు వ్యక్తులు ఆ బాలికను బలవంతంగా ఎత్తుకుపోయారు. సమీప అడవిలోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడి, అనంతరం అడవిలో పడేసి వెళ్లిపోయారు. కొంత సమయానికి తెలివి వచ్చిన బాలిక అతికష్టంమీద నడుచుకుంటూ ఇంటికి చేరింది. ఆమె దుస్థితిని చూసిన తల్లిదండ్రులు, బంధువులు ఆరాతీయగా తనపై జరిగిన లైంగికదాడి ఉదంతాన్ని బాలిక వెల్లడించింది. దీనిపై బాధితురాలి సోదరుడు పొట్టంగి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని బాలికను కుందులి ఆస్పత్రికి తరలించి పరీక్షలు చేయించి అక్కడి నుంచి కొరాపుట్‌ సహిద్‌ లక్ష్మణ్‌నాయక్‌ మెడికల్‌ కళాశాలకు తరలించారు.

జాతీయ రహదారిపై రాస్తారోకో
లైంగికదాడి వార్త దావానంలా వ్యాపించడంతో జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ప్రజలు భగ్గుమన్నారు. 26వ నంబర్‌ జాతీయ రహదారిలో కుందిలి సంతతోట వద్ద బుధవారం రాస్తారోకోకు దిగారు. నిందితులను శిక్షించాలని కొరాపుట్‌ ఎమ్మెల్యే కృష్ణచంద్ర సాగరియ ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నాకు చేశారు. విద్యార్థినిపై లైంగిక దాడి సమాచారం అందుకున్న ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్‌ బాధిత బాలిక వైద్యానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. ఈ ఘటనతో జవాన్లకు ఎటువంటి సంబంధం లేదని బీఎస్‌ఎఫ్‌ బెటాలియన్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ డీఎస్పీ జేసీ నాయక్‌ ఓ ప్రకటనలో తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top