కి‘లేడీ’కి మళ్లీ కటకటాలు

Rachakonda Police Arrest Cheating Women in Hyderabad - Sakshi

పెళ్లి పేరుతో ఎన్‌ఆర్‌ఐలకు టోకరా  

రాచకొండలో కేసు నమోదు

అరెస్టు చేసిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు

సాక్షి, సిటీబ్యూరో: తెలుగు యువతులను వివాహం చేసుకునేందుకు ఆసక్తి చూపుతూ మ్యాట్రి మోనీ వెబ్‌సైట్‌లలో వివరాలు అప్‌లోడ్‌ చేసే విదేశీ వరులను పెళ్లి పేరుతో నమ్మించి రూ. లక్షల్లో డబ్బులు తీసుకొని మోసం చేస్తున్న కిలాడీ లేడీని రాచకొండ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వివరాలిలా ఉన్నాయి.

అందమైన యువతుల ఫొటోలతో టోకరా..
నెల్లూరు జిల్లా, ఇనమడుగుకు చెందిన అర్చన ఎస్‌వీ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేసింది. 2016లో నెల్లూరులోని  ఓ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్న కొరమ్‌ దుర్గా ప్రవీణ్‌ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. అయితే అప్పటికే జల్సాలకు అలవాటు పడిన అర్చన సులువుగా డబ్బులు సంపాదించేందుకు మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌ను వేదికగా చేసుకుంది. గూగుల్‌ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసిన అందమైన యువతుల ఫొటోలను డౌన్‌లోడ్‌ చేసుకుని ‘తెలుగు మ్యాట్రిమోనీ’ వెబ్‌సైట్‌లో ఫుష్‌తాయి పేరుతో ప్రొఫైల్‌  నిక్షిప్తం చేసింది. కేవలం విదేశీ వరులను మాత్రమే పెళ్లి చేసుకుంటానన్న అప్షన్‌ కూడా పొందుపరిచింది. అర్చన ఇచ్చిన ఫోన్‌నంబర్‌లో సంప్రదించిన వరుడి తల్లిదండ్రులతో గూగుల్‌ యాప్‌లలో అందుబాటులో ఉన్న మొబైల్‌ అప్లికేషన్ల ద్వారా పలు రకాల వాయిస్‌లతో మాట్లాడేది. తన మాటలను వరుడు, లేదా వారి తల్లిదండ్రులు నమ్మినట్లు గుర్తిస్తే పెళ్లి చేసుకునేందుకు అభ్యంతరం లేదని చెప్పేది.

కొన్నిరోజులు మాట్లాడిన అనంతరం వరుడికి ఫొటోలు పంపించేది. ఆ తర్వాత ఎంగేంజ్‌మెంట్‌ రింగ్‌లు, బంగారు నగలు, బహుమతుల పేరుతో లక్షల్లో దండుకునేది.  ఇదే తరహాలో అమెరికాలో ఉంటున్న సింహద్రి పవన్‌కుమార్‌ అనే యువకుడిని భారత్‌ మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌ ద్వారా ఫుష్‌తాయి పేరుతో పరిచయం చేసుకుంది. వెస్ట్‌పామ్‌ బీచ్, సీస్కో క్లెయింట్‌ ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్న తాను ఇల్లు మారేందుకు  రూ.నాలుగు లక్షలు అవసరమని చెప్పడంతో పవన్‌కుమార్‌ ఆమె ఇచ్చిన బ్యాంక్‌ ఖాతాకు నగదు బదిలీ చేశాడు. అనంతరం అతడితో సంబంధాలు కట్‌ చేయడంతో ఆనుమానం వచ్చిన పవన్‌కుమార్‌ తాను మోసపోయినట్లు గుర్తించి, ఈ విషయాన్ని తన సోదరుడైన  కొత్తపేటకు చెందిన మధుమోహన్‌ దృష్టికి తెచ్చాడు. దీంతో ఈ నెల 12న మధుమోహన్‌ రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఇటీవల ఇదే తరహా కేసులో సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు నిందితురాలు పుష్‌తాయి పేరుతో చలామణి అవుతున్న అర్చనను అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. మంగళవారం ఆమె బెయిల్‌పై బయటికి రాగానే రాచకొండ పోలీసులు మళ్లీ అరెస్టు చేసి కోర్టులో హజరుపరిచారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు.  గతంలోనే ఇదే తరహా కేసుల్లో నగర సైబర్‌క్రైమ్‌ పోలీసులు నిందితురాలిని అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించగా, 2018 డిసెంబర్‌లో ఓ అడ్వకేట్‌ సహాయంతో బయటకు వచ్చిందని రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసులు తెలిపారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top