అయూబ్‌ గ్యాంగ్‌ను పట్టించిన‘క్వాలిస్‌’

Qualis Help in Robbery Gang Arrest Hyderabad - Sakshi

సైబరాబాద్‌లోని తొమ్మిది చోరీల్లో కీలకంగా మారిన అద్దె వాహనం

పాతబస్తీ వాహన యజమాని వివరాల వెల్లడితో నలుగురి అరెస్టు

చదివింది తక్కువే అయినా చోరీల్లో మాత్రం హస్తలాఘవం

రూ.30 లక్షల విలువైన బంగారం, వెండి స్వాధీనం

సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌

సాక్షి, సిటీబ్యూరో: రాజేంద్రనగర్‌ ఠాణా పరిధిలో మూడు ఇళ్లల్లో చోరీలు జరిగినా ప్రాంతానికి కూతవేటు దూరంలో జంక్షన్‌ వద్ద ఉన్న క్వాలిస్‌ వాహనం ముగ్గురు ఘరానా దొంగలతో పాటు వీరి బంగారం, వెండి ఆభరణాలను విక్రయించేందుకు సహకరిస్తున్న మరొకరిని సైబరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌(సీసీఎస్‌) పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.30 లక్షల విలువైన 753 గ్రాముల బంగారం, మూడు కిలోల 550 గ్రాముల వెండి ఆభరణాలు, మూడు ఎల్‌ఈడీ టీవీలు, ఒక క్వాలిస్‌ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను సైబరాబాద్‌ క్రైమ్స్‌ డీసీపీ జానకి షర్మిలా, శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డిలతో కలిసి పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ మంగళవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో మీడియాకు తెలిపారు. ఈ చోరీల ముఠాకు నేతృత్వం వహిస్తున్న మోయినాబాద్‌కు చెందిన మహమ్మద్‌ అయూబ్‌ తన పదోవ ఏటానే కుటుంబంతో కలిసి హైదరాబాద్‌కు మకాం మార్చారు.

తెలుగు, ఉర్దూలో అనర్గళంగా మాట్లాడే అయూబ్‌ తొలినాళ్‌లలో పండ్లవ్యాపారంలో నాన్నకు సహకారంగా ఉండి ఆ తర్వాత ఆటోడ్రైవర్‌గా పనిచేశాడు. ఈ సమయంలోనే శివారు ప్రాంతాల్లో ఉన్న పశువులను చోరీ చేసిన కేసులో చందానగర్‌ పోలీసులు 2008లో అరెస్టు చేశారు. జైలుకు వెళ్లొచ్చిన అయూబ్‌ పంథా మార్చకుండా సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్, మెదక్‌ జిల్లాల్లో 70 పశువుల దొంగతనాలు, 78 లారీల చోరీలు చేసి జైలుకెళ్లి వచ్చాడు. చివరిసారిగా ఈ ఏడాది జూన్‌లో చిలకలగూడ పోలీసులకు చిక్కిన అయూబ్‌ ఆగస్టు నెలలో జైలు నుంచి బయటకు వచ్చాడు. అయితే ఐదో తరగతి వరకు చదివిన మెహదీపట్నంకు చెందిన గుంజపోగు సుధాకర్‌ చిన్నతనంలోనే చెడు అలవాట్లకు బానిసై బైక్‌లు దొంగనతాలు చేస్తూ జైలుకెళ్లిన సమయంలో యాదగిరితో ఏర్పడిన పరిచయంతో రాత్రి సమయంలో ఇళ్లల్లో చోరీలు చేయడం మొదలెట్టాడు. ఇలా సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్‌ కమిషనరేట్లలో 62 చోరీలు చేసినా సుధాకర్‌పై అసిఫ్‌నగర్‌ పోలీసులు 2015లో పీడీయాక్ట్‌ నమోదుచేసినా మళ్లీ చోరీ కేసులో మీర్‌పేట పోలీసులకు చిక్కాడు. గతంలోనే జైల్లో ఏర్పడిన పరిచయంతో అయూబ్‌ సుధాకర్‌తో కలిసి చోరీలు చేయాలని ప్రణాళిక రచించాడు. తనకు పరిచయమున్న నవీన్‌కుమార్, మహేందర్‌లతో కలిసి ఆగస్టు నుంచి రాత్రి వేళ్లలో ఇళ్లలో చోరీలు చేయడం మొదలెట్టారు.

క్వాలిస్‌లోనే వచ్చి రెక్కీ...చోరీ..
పాతబస్తీలో క్వాలిస్‌ అద్దెకు క్వాలిస్‌ తీసుకొని తాము ఎంచుకున్న ప్రాంతంలో రెక్కీ నిర్వహిస్తారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్‌గా చేసుకుంటారు. అయూబ్‌ వాహనాన్ని చోరీ చేసే ప్రాంతానికి కూతవేటు దూరంలో నిలిపేవాడు. ఆయన క్వాలిస్‌లోనే ఉండగా  సుధాకర్, నవీన్‌కుమార్, మహేందర్‌ ఇళ్లలో చోరీలకు వెళ్లేవారు. తాళాలు పగులగొట్టడంలో దిట్ట అయిన సుధాకర్‌ చకచక పనిచేయగా మిగిలిన వారు ఇంట్లోకెళ్లి బీరువాలో నగదు, నగలు ఎత్తుకెళ్లేవారు. ఇలా సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో అయూబ్‌ గ్యాంగ్‌ తొమ్మిది దొంగతనాలు చేసింది. అయితే వరుస చోరీలు జరుగుతుండటంతో అప్రమత్తమైన క్రైమ్స్‌ డీసీపీ జానకి షర్మిలా మార్గదర్శనంలో శంషాబాద్‌ సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ చంద్రబాబు, బాలానగర్‌ సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ నేతృత్వంలోని బృందం క్వాలిస్‌ కదలికలపై అనుమానం రావడంతో వాహన యజమానితో మాట్లాడారు. అయూబ్‌ అద్దెకు తీసుకెళ్లాడని చెప్పడంతో వీరి చోరీలకు చెక్‌పడింది. అయూబ్, సుధాకర్, మహేందర్‌లతో పాటు నగలు తీసుకొని నగదుకు మార్చి ఇచ్చే మహమ్మద్‌ బాబాను కూడా అరెస్టు చేశారు. నవీన్‌ కుమార్‌ పరారీలో ఉన్నాడు.  దొంగలను పట్టుకున్న  సిబ్బందిని సజ్జనార్‌ అభినందించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top