బీచ్‌లో రెచ్చిపోయిన ఖాకీ | Sakshi
Sakshi News home page

బీచ్‌లో రెచ్చిపోయిన ఖాకీ

Published Wed, Jun 13 2018 1:02 PM

Police Constable Hulchul In Mungina Pudi Beach Krishna - Sakshi

జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఈనెల 11వ తేదీన జరిగిన ఘటన పోలీసు శాఖకే మచ్చగా మారింది. పోలీసు శాఖలోని ఓ సీఐపై సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్, అతని స్నేహితులు.. పర్యాటకుల మధ్య బాహాబాహీకి దిగారు. అధికారిపై ముష్టియుద్ధం చేçస్తూ అరుపులు కేకలతో అలజడి సృష్టించారు. దీంతో సీఐకి రక్తపు గాయాలు అయ్యాయి. సీఐ ఫిర్యాదుతో సదరు కానిస్టేబుల్, అతనికి సహకరించిన స్నేహితులను పోలీసులు పట్టుకుని కటకటాల వెనక్కు నెట్టారు. ఈ ఘటనకు మంగినపూడి బీచ్‌లో సోమవారం (ఆఖరి రోజు) జరిగిన మసులా బీచ్‌ ఫెస్టివల్‌ వేదికగా మారింది.  ఈ ఘటన పోలీసు వర్గాల్లో కలకలానికి దారి తీసింది.

కోనేరుసెంటర్‌ (మచిలీపట్నం) : అతనో సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌. పేరు దాసరి నాగప్రసాద్‌బాబు. ఊరు పామర్రు నియోజకవర్గంలోని ఎలకుర్రు శివారు మల్లేశ్వరం. టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా మంగినపూడి బీచ్‌లో నిర్వహించిన మసులా బీచ్‌ ఫెస్టివల్‌కు స్నేహితులతో ఈ నెల 11వ తేదీన వెళ్ళాడు. అంతా పూటుగా మద్యం సేవించారు. ఇంకే ముంది బీచ్‌ ఒడ్డున అల్లరి, అలజడి సృష్టించటం మొదలుపెట్టారు. పోలీసులు ఉన్నారన్న విషయాన్ని పక్కనబెట్టి పర్యాటకులను పట్టించుకోకుండా వీరంగం సృష్టించటం ప్రారంభించారు. మట్టి తీసి  పర్యాటకుల మీద చల్లటం, అరుపులు కేకలు వంటి వికృత చేష్టలతో హల్‌చల్‌కు దిగారు. ఈ వీరంగాన్ని తట్టుకోలేని పలువురు పర్యాటకులు సమీపంలో ఉన్న ఓ సీఐకి ఫిర్యాదు చేశారు. దీంతో సీఐ అక్కడకు వెళ్లారు. అప్పటికీ కానిస్టేబుల్‌ అండ్‌ ఫ్రెండ్స్‌ వీరంగం పరాకాష్ఠకు చేరింది. ఆ చేష్టలను చూసిన సీఐ ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకుని లైన్‌లో నిలబెడుతుండగా కానిస్టేబుల్‌ నాగప్రసాద్‌బాబు ఆయనతో వాదనకు దిగాడు. ఉన్నట్టుండి సీఐపై దాడికి తెగబడ్డాడు. ముఖంపై పిడిగుద్దులకు సాహసించాడు. దీంతో సీఐకి బలమైన గాయమై రక్తస్రావం జరిగింది. మెడకు బలమైన దెబ్బ తగిలింది. సమీపంలో ఉన్న కానిస్టేబుల్‌ కూడా నాగప్రసాద్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో అందరూ కలిసి అతనిపైనా దాడికి దిగారు. ఈ తతంగమంతా పర్యాటకుల సమక్షంలో జరగటం అందరినీ అవాక్కు అయ్యేలా చేసింది.

రూరల్‌ స్టేషన్‌లో కేసు నమోదు..
గాయపడిన సీఐ బందరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. జరిగిన ఘటనపై నాగప్రసాద్‌బాబుతో పాటు అతని అనుచరులపై బందరు రూరల్‌ పోలీసులకు కంప్‌లైంట్‌ చేశారు. ఫిర్యాదు అందుకున్న రూరల్‌ సీఐ బి. రవికుమార్‌ దర్యాప్తు చేయగా నాగప్రసాద్‌బాబు సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌గా జార్ఖండ్‌లో పని చేస్తున్నట్లు తేలింది. ఆయనను, స్నేహితులను సీఐ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా నాగప్రసాద్‌బాబు తరఫు బ«ం«ధువులు పామర్రు నియోజకవర్గంలోని ఓ టీడీపీ నాయకురాలి రికమండేషన్‌తో రాజీ చేసుకునేందుకు పావులు కదిపి విఫలం కావటంతో స్థానికంగా ఉన్న మరో టీడీపీ నేత తమ్ముడితో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే సదరు టీడీపీ నేత తమ్ముడు సైతం లోకల్‌ పోలీసులకు ఫేవర్‌గా మాట్లాడటంతో సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్, అతని స్నేహితుల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా మారినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఈ ఘటనపై బందరు రూరల్‌ పోలీసులు కేసు ఫైల్‌ చేశారు. దీనిపై జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ట్రతిపాఠి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement