పాత డ్రైవర్‌ పనే..!

police chased jewellery robbery case - Sakshi

కారులో బంగారం చోరీ కేసును ఛేదించిన పోలీసులు

పాత డ్రైవర్‌దే పన్నాగం

నిందితుడిని నెల్లూరులో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం

చోరీకి గురైన రెండు కేజీల బంగారం, రూ.2 లక్షల నగదు స్వాధీనం

ఒంగోలు క్రైం: ఒంగోలు నగరంలో ఆదివారం మిట్ట మధ్యాహ్నం జరిగిన భారీ చోరీని పోలీసులు ఛేదించారు. నెల్లూరుకు చెందిన బంగారం వ్యాపారి రాహుల్‌ జైన్‌ కారులో నుంచి ఒంగోలులో రెండు కేజీల బంగారు ఆభరణాలు, రూ.2 లక్షల నగదు అపహరణకు గురవడం సంచలనం సృష్టించింది. రాహుల్‌ జైన్‌ నెల్లూరు నుంచి కందుకూరు, సింగరాయకొండ, టంగుటూరు వ్యాపారులను కలిసి పాత బకాయిల వసూలుతో పాటు కొత్తగా ఇచ్చిన ఆర్డర్ల మేరకు బంగారాన్ని సరఫరా చేసేందుకు జిల్లాలో పలు ప్రాంతాలు తిరిగి ఆదివారం మధ్యాహ్నం ఒంగోలుకు చేరుకున్నారు. ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని అజంతా హోటల్‌లో భోజనానికి వెళ్లి వచ్చే సరికి కారులోని బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగు, రూ.2 లక్షలు నగదు ఉన్న బ్యాగులు అపహరణకు గురయ్యాయి. దీంతో ఖంగుతిన్న  వ్యాపారి ఒంగోలు వన్‌టౌన్‌ పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై ఒంగోలు డీఎస్పీ బి.శ్రీనివాసరావు దర్యాప్తు చేపట్టారు. సమాచారం తెలుసుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకోవటంతో పాటు బాధితుడు రాహుల్‌ జైన్‌ని, అతని తాత్కాలిక డ్రైవర్‌ వెంకట స్వామిని డీఎస్పీ విచారించారు.

రిమోట్‌ లాక్‌ ఉన్నా చోరీ
కారుకు రిమోట్‌ ఆటో మేటిక్‌ లాక్‌ ఉంది. అయినా కారు అద్దాలు పగులగొట్టకుండా డోర్‌ తీసి చోరీకి పాల్పడటంపై పోలీసులు కారు నడిపిన డ్రైవర్‌ను తొలుత అనుమానించారు.   గుర్తు తెలియని వ్యక్తులు కారు డోర్‌ లాక్‌ తీసేపనైతే రిమోట్‌ ఉన్నందున కారు శబ్దం చేయాలి. అయితే అంతకు ముందే కారు రిమోట్‌ సెన్సార్లు పని చేయకుండా ఉన్నట్లు స్వయంగా ఎస్పీకి డ్రైవర్‌తో పాటు రాహుల్‌ జైన్‌ వివరించారు. దీంతో సోమవారం వరకు డ్రైవర్‌ వెంకటస్వామిని అనుమానించిన పోలీసులు గతంలో పని చేసిన డ్రైవర్లు ఎవరన్న దానిపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే ఇది పాత డ్రైవర్‌ పన్నాగంగా అనుమానించారు. ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు పాత డ్రైవర్‌ పనేనని నిగ్గుతేలింది. అయితే రెండు నెలల క్రితం పాత డ్రైవర్‌గా రాహుల్‌జైన్‌ దగ్గర పని చేసిన వ్యక్తి కారుకు సంబంధించిన రెండో తాళాన్ని ముందుగానే తయారు చేయించుకొని అతని వద్ద ఉంచుకున్నాడు.

ఈ రెండు నెలల కాలంలో పలు దఫాలుగా కారు డోర్‌ తీసి అపహరణకు ప్రయత్నించాడు. అయితే డోర్‌ రాకపోవడంతో ఆ తాళాన్ని మరింత పదునుగా తయారు చేయించి ఆదివారం ఒంగోలులో భారీ చోరీకి పాల్పడినట్లు తేలింది. దీంతో నెల్లూరులో ఆ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారించడంతో అసలు విషయం తెలిసింది. కారులో అపహరించిన బంగారు ఆభరణాలు, నగదును అతని పాత డ్రైవర్‌ బంధువుల ఇంట్లో పూడ్చిపెట్టాడు. దీంతో బంగారు ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకొని చోరీకి పాల్పడిన పాత డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఉదయానికల్లా సొత్తుతో సహా నిందితులను ఒంగోలు వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top