కూలీలపై ఘాతుకం | Owner Killed Brother in Chittoor | Sakshi
Sakshi News home page

కూలీలపై ఘాతుకం

Jun 3 2019 12:27 PM | Updated on Jun 3 2019 12:27 PM

Owner Killed Brother in Chittoor - Sakshi

సంఘటన స్థలంలో అన్నదమ్ముల మృతదేహాలు

రెక్కలు ముక్కలు చేసుకున్నాడు.. అన్నపానీయాలు మాని ఒళ్లు కూడా హూనం చేసుకున్నాడు.. నిద్రాహారాలు మాని యజమాని చెప్పిన పనులన్నీ చేశాడు.. జబ్బు చేయడంతో ట్రాక్టర్‌ తోలడానికి వెళ్లలేకపోయాడు.. డబ్బులిస్తే జబ్బు నయం చేసుకుంటానని యజమానిని అభ్యర్థించాడు.. తన పని కాలేదని అతనుకోపం పెంచుకున్నాడు.. డబ్బులడుగుతావా..? అంటూ ఆగ్రహంతో రగిలిపోయాడు.. అంతటితో ఆగక బైక్‌పైవెళ్తున్న అన్నదమ్ములను అతి కిరాతకంగా ట్రాక్టర్‌తో గుద్ది చంపేశాడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ దాష్టీకంమదనపల్లె మండలంలో ఆదివారం తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుల కుటుంబాలను స్థానిక ఎమ్మెల్యేనవాజ్‌బాషా పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

మదనపల్లె టౌన్‌ : కూలి డబ్బు ఇవ్వాలని అడిగితే కనికరించకపోగా కూలీలను నిర్దాక్షిణ్యంగా ట్రాక్టర్‌తో గుద్ది చంపేసిన సంఘటన మదనపల్లె మండలంలో జరిగింది. ఈ ఘటనతో బిడ్డల రెక్కల కష్టంతో బతుకుతున్న రెండు పేద కుటుంబాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. ఆదివారం తీవ్ర కలకలం రేపిన ఈ విషాదకర సంఘటనపై రూరల్‌ ఎస్‌ఐ దిలీప్‌ కుమార్, మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మదనపల్లె మండలం మొలకలదిన్నెకు చెందిన దంపతులు గంగులప్ప, పార్వతమ్మలది రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేద కుటుంబం. వీరికి ఇద్దరు కుమారులు. చిన్న కొడుకు హరికుమార్‌(32) బసినికొండ చంద్రానాయక్‌ వద్ద ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ తల్లిదండ్రులతో పాటు భార్య రెడ్డెమ్మ పిల్లలు స్వర్ణలత(9), సుదర్శన్‌(5), యశ్వంత్‌ సాయి(3)లను పోషించుకుంటున్నాడు. పక్కనే నివాసం ఉంటున్న హరికుమార్‌ పినతండ్రి గంగులప్ప రెండో కుమారుడు నాగభూషణం(18)ది కూడా నిరుపేద కుటుంబం.

ఇతన్ని కూడా హరికుమార్‌ తనవెంట కూలి పనులకు చంద్రానాయక్‌ వద్దకే తీసుకుపోయేవాడు. అయితే రెండు వారాలక్రితం మరో బండికి వెళ్లిన హరికుమార్, నాగభూషణంలకు ట్రాక్టర్‌ యజమాని చంద్రానాయక్‌ డబ్బులు ఇవ్వకుండా మొండిచేయి చూపాడు. ఇంట్లో అనారోగ్యంతో ఉన్న వారికి చికిత్సల నిమిత్తం డబ్బు అవసరమై, అన్నదమ్ములు ట్రాక్టర్‌ యజమాని వద్దకు వెళ్లిడబ్బులు అడిగారు. అతడు ఇవ్వకపోగా, కూలీలపైనే గొడవకు దిగాడు. తాను డబ్బులిచ్చేది లేదని, ఏం చేసుకుంటారో చేసుకోవాలని హెచ్చరించి పంపేశాడు. చేసేదిలేక వారు ఎస్టేటుకు చేరుకుని చంద్రానాయక్‌ ట్రాక్టర్‌లో ఇసుకను మదనపల్లెకు తరలిస్తుండగా నిలదీశారు. దీంతో ఆగ్రహించిన చంద్రానాయక్‌  ద్విచక్రవాహనంపై వెళుతున్న ఇద్దరినీ వెనుకవైపు నుంచి ట్రాక్టర్‌తో ఢీకొన్నాడు. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. కుటుంబ పోషణకు ఆధారంగా ఉన్న బిడ్డల మృతితో మొలకలదిన్నెలో రెండు పేద కుటుంబాల్లో విషాదం అలుముకుంది. అన్నదమ్ముల మృతితో ఆ కుటుంబాలు వీధినపడ్డాయి.

బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ
ట్రాక్టర్‌ యజమాని దాష్టీకంతో ప్రాణాలు కోల్పోయిన కూలీల కుటుంబాలను ఎమ్మెల్యే నవాజ్‌ బాషా పరామర్శించారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీ గదిలోని కూలీల మృతదేహాలను సందర్శించి కుటుంబసభ్యులకు సంతాపం తెలియజేశారు. సంఘటనకు బాధ్యులైన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement