అతి వేగం.. మద్యం మత్తు

Over Speed Killed Three People In Hyderabad - Sakshi

హోటల్‌లోకి దూసుకెళ్లిన కారు

ఎయిర్‌బ్యాగ్‌ తెరుచుకోవడంతో తప్పిన ప్రమాదం

ముగ్గురు యువకుల పరారీ

కారు పల్టీ.. ముగ్గురి మృతి

కారులోనే ప్రాణాలు విడిచిన మిత్రులు 

కర్మన్‌ఘాట్‌ ప్రాంతంలో దుర్ఘటన

బంజారాహిల్స్‌:  బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 3లో ఆదివారం తెల్లవారుజామున అదుపుతప్పిన వేగంతో వచ్చిన ఓ కారు.. హోటల్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో హోటల్‌తో పాటు కారు ముందు భాగం దెబ్బతింది. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో టీఎస్‌10ఈపీ6331 నంబర్‌ గల కారు జూబ్లీహిల్స్‌ నుంచి సాగర్‌ సొసైటీ మీదుగా పంజగుట్ట వైపు మితిమీరిన వేగంతో దూసుకొచ్చింది. మసీదు ముందు రోడ్డు డౌన్‌లో మలుపు ఉండటంతో కారు అదుపుతప్పి రాయల్‌ టిఫిన్‌ సెంటర్‌ కాంపౌండ్‌లోకి దూసుకెళ్లింది.

ఆ సమయంలో టిఫిన్‌ సెంటర్‌లో రద్దీ తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదమే తప్పింది. కారులో ముగ్గురు యువకులు ఉన్నారని, ప్రమాదానికి గురికాగానే కారును వదిలేసి పరారైనట్లు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. కారులో ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోవడంతో అందులో ఉన్న వారు ప్రాణాలతో బయటపడ్డారు. బంజారాహిల్స్‌ ఎస్‌ఐ ఘటనా స్థలానికి చేరుకొన్నారు. యువకుల కోసం గాలిస్తున్నారు. మద్యం మత్తులో కారు నడిపినట్లుగా అనుమానిస్తున్నారు. కాగా, ఈ ప్రమాదపు స్పాట్‌ను.. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు నుంచి పంజగుట్ట వెళ్లే రోడ్డులో డేంజరస్‌ స్పాట్‌గా పోలీసులు గతంలోనే గుర్తించారు. ఆ స్థలంలోనే ప్రమాదం జరిగింది. 

చంపాపేట: సాగర్‌ రోడ్డు నుంచి చంపాపేటకు వెళుతున్న కారు కర్మన్‌ఘాట్‌ ప్రాంతంలో అతి వేగంతో అదుపుతప్పి పల్టీలు కొడుతూ.. పక్కనే ఉన్న ఫుడ్‌పాయింట్‌ గోడకు ఢీకొన్న ఘటనలో ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, ప్రైవేట్‌ ఉద్యోగి అక్కడికక్కడే మృతి చెందారు. ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరెడ్డి కథనం ప్రకారం.. సైదాబాద్‌లోని మాధవనగర్‌ ఎల్‌ఐసీ కాలనీకి చెందిన మాడపాటి వినాయక మల్లికార్జున్‌ (29), మారుతీనగర్‌కు చెందిన ధరావత్‌ శ్రీరాం నాయక్‌ (28), సైదాబాద్‌ సరస్వతీనగర్‌ కాలనీకి చెందిన పబ్బా సాయినాథ్, నాగోల్‌ మారుతీనగర్‌ కాలనీకి చెందిన కల్యాణ్‌ (27), సైదాబాద్‌ డిఫెన్స్‌ కాలనీకి చెందిన షేక్‌ గుల్జార్‌ అహ్మద్‌ (26), నాగోలు బండ్లగూడకు చెందిన బొట్ట యువమిత్ర (25) స్నేహితులు. శనివారం సాయంత్రం అందరూ కలిసి గుర్రంగూడలోని ఓ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో పార్టీ చేసుకుని మద్యం తాగారు. తిరిగి వచ్చే క్రమంలో సాయినాథ్‌కు చెందిన బైక్‌పై షేక్‌గుల్జార్‌ అహ్మద్, యువమిత్ర ఇంటికి బయల్దేరారు.

మల్లికార్జున్, సాయినాథ్, శ్రీరాంనాయక్, కల్యాణ్‌ కారులో బయల్దేరారు. కర్మన్‌ఘాట్‌ చౌరస్తా దాటాక కారు అదుపుతప్పింది. రోడ్డుకు ఎడమ వైపు ఉన్న చెట్టును ఢీకొని పల్టీలు కొడుతూ 15 అడుగుల దూరంలో ఉన్న లక్ష్మిశ్రీ మెస్‌ అండ్‌ ఫుడ్‌ కోర్టు ముందు ఉన్న ఎగ్జాస్ట్‌ గొట్టాన్ని ఢీకొంది. కారు నడుపుతున్న మల్లికార్జున్, కారులో ఉన్న శ్రీరాంనాయక్, సాయినాథ్‌ అక్కడికక్కడే మృతిచెందారు. వెనుక సీట్లో ఉన్న కల్యాణ్‌ సీట్‌ బెల్ట్‌ పెట్టుకోవడంతో స్వల్పగాయాలతో బయటపడ్డాడు. స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. కల్యాణ్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

ఈలోగా బైక్‌పై అక్కడికి చేరుకున్న గుల్జార్‌అహ్మద్, యువమిత్ర.. ప్రమాద సమాచారాన్ని కుటుంబసభ్యులకు తెలిపా రు. సరూర్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మద్యం మత్తులో కారు నడపడం, అతివేగమే ప్రమాదానికి కారణాలుగా భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం సమయంలో కారు వేగం 120–140 మధ్య ఉండవచ్చన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top