ఏం జరిగింది...?

ontimitta dead bodies reached rims - Sakshi

ఒకేసారి ఐదుగురు మృతిచెందడంపై అనుమానాలు

పోలీసులు అన్వేషిస్తున్నారనే చెరువులోకి దూకారా?

రిమ్స్‌కు చేరిన మృతదేహాలు

సాక్షి కడప/రాజంపేట/ఒంటిమిట్ట : కడప–రేణిగుంట జాతీయ రహదారిలోని ఒంటిమిట్ట చెరువులో ఏం జరిగింది.. ఐదుగురు ఒకేసారి చనిపోవడం వెనుక కారణాలు ఏమిటి.. చనిపోయిన వారంతా తమిళ కూలీలేనా.. ఎవరిని కదిపినా ఇదే చర్చ సాగుతోంది.. చూసిన వారందరూ తమిళ కూలీలేనన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శేషాచలం అడవులు సమీప ప్రాంతాల్లోనే ఉండడంతో.. రైళ్లలో వచ్చి నేరుగా అడవుల్లోకి వెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే కూలీల సమాచారం పసిగట్టి వెంబడించడంతోనే కొందరు నీళ్లలోకి దూకి ఉంటారని ప్రజా సంఘాల నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఘటనను బట్టి చూస్తే రెండు, మూడు రోజుల కిందటే చెరువులో పడినట్లు తెలుస్తోంది. చెరువులో ఎలా పడ్డారు....వారిని ఎవరైనా వెంబడించారా...లేకపోతే హత్య చేసి పడేశారా అన్నది తెలియలేదు.  పోలీసులు కూడా అనుమానాస్పదం కిందనే కేసు నమోదు చేశారు.  ఒంటిమిట్ట చెరువులో ఒకేసారి ఐదు మృతదేహాలు కనిపించడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

శుక్రవారం రాత్రి ఒంటిమిట్ట ఫార్టెసు పరిధిలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేపట్టేందుకు తమిళ తంబీలు వచ్చినట్లుగా పోలీసులకు సమాచారం రావడంతో గాలింపు చర్యలు చేపట్టినట్లు ప్రచారం జరుగుతోంది. అదే రాత్రి చెర్లోపల్లె గ్రామంలో పలువురు గ్రామస్తులను విచారించారు.  గ్రామసమీపంలోని పొలాలకు దగ్గరలో ఉన్న చెరువు పెద్దకుంటలో మృతదేహాలు లభ్యంకావడంతో పోలీసుల గాలింపునకు ఆధారంగా నిలుస్తోంది. ఎర్రచందనం లారీ డ్రైవర్‌ పరారీ అయినట్లు, అందులోని 30 మంది తమిళతంబీలు పోలీసులను చూసి పారిపోయే  తరుణంలో ఐదుగురు చెరువు పెద్దకుంటలో పడి మృతిచెందినట్లు ప్రచారం జరుగుతోంది. పోలీసులు మాత్రం నిర్ధారించడంలేదు.

ప్రమాదవశాత్తా.. ఆత్మ‘హత్య’
చెరువు పెద్దకుంటలో లభ్యమైన ఐదు మంది తమిళ తంబీలు ప్రమాదవశాత్తు పడ్డారా? లేక ఎన్‌కౌంటర్‌ చేసి పడేశారా..పోలీసులకు చిక్కుతామనే ఆత్మహత్య చేసుకున్నారా.. ఇవి స్థానికుల్లో నెలకొన్ని    అనుమానాలు. పోలీసులకు తమిళతంబీలు ఎదురు తిరిగిన పరిస్ధితిలో ఈ సంఘటన జరిగిందా? అని కూడా పలువురు అనుమానిస్తున్నారు.  ఓ పోలీసు అధికారికి గాయాలు అయినట్లు  ఒంటిమిట్టలో చెప్పుకోవడం జరుగుతోంది.  సంఘటన స్ధలానికి చేరుకున్న ఓఎస్డీ నయూం అస్మీ మృతదేహాలను పరిశీలింంచారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మృతదేహాలను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెబుతూనే ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు కూంబింగ్‌ జరుగుతూనే ఉంటుందన్నారు. మృతిచెందిన వారు తమిళతంబీలని  ఇప్పుడు చెప్పలేమని, విచారణలో తేలాల్సి ఉందన్నారు. డీఎస్పీ లక్ష్మీనారాణ, ఆర్డీఓ వీరబ్రహ్మం, తహసీల్దారు శిరీష, సీఐ రవికుమార్, సబ్‌డివిజన్‌లోని పలువురు ఎస్‌ఐలు ఉన్నారు.ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి కూడా మృతదేహాలను పరిశీలించారు.

రిమ్స్‌కు చేరిన మృతదేహాలు
ఒంటిమిట్ట చెరువులో కనిపించిన గుర్తు తెలియని వ్యక్తుల మృతదేహాలను ఆదివారం సాయంత్రం రిమ్స్‌ మార్చురీకి తరలించారు. సోమవారం   పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఇప్పటికే టీవీల ద్వారా ప్రచారం జరగడం, పోలీసులు కూడా ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు సమాచారాన్ని అందించిన నేపథ్యంలో మిస్సింగ్‌ అయిన వారి బంధువులు కడపకు చేరుకునే అవకాశం ఉంది. ఒంటిమిట్ట చెరువులో చనిపోయిన వారికి సంబంధించి 174 సీఆర్‌పీసీ కింద కేసు నమోదు చేసినట్లు జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్స్‌) అద్నాన్‌ నయీం అస్మి తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top