మృతదేహాన్ని ముసిరిన ఈగలు, చీమలు

The New Born Baby Died At Tirupati Ruya Hospital - Sakshi

మృతి చెందిన పురిటిబిడ్డను పడేశారు

రుయా వద్ద వెలుగులోకి.. తల్లిదండ్రులను పిలిపించి అప్పగింత

సాక్షి, తిరుపతి తుడా : చికిత్స పొందుతూ పురిటిబిడ్డ మృతి చెందాడని కాలువ పక్కన పడేసి వెళ్లిన ఘటన తిరుపతి రుయా ఆసుపత్రిలో సోమవారం వెలుగు చూసింది. వివరాలు..గంగవరం మండలం మారేడుపల్లెకు చెందిన మనోహర్, సరిత దంపతులకు ఇటీవల మగబిడ్డ జన్మించాడు. అయితే పుట్టుకతోనే  మెనింగో మైలో సీల్‌ అనే జన్యుపరమైన వ్యాధితో జన్మించాడు. పురిటిబిడ్డకు చికిత్స చేయించేందుకు  తిరుపతి రుయాలోని చిన్నపిల్లల ఆస్పత్రిలో 28న చేర్పించారు. ఆ బిడ్డ 29వ తేదీన అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో మృతి చెందినట్టు వైద్యులు నిర్థారించారు. బిడ్డ మృతి చెందడంతో తెల్లవారుజామున చిన్న పిల్లల ఆసుపత్రి సమీపంలో కాలువ పక్కన ఖాళీ స్థలంలో ఆ పురిటి బిడ్డ మృతదేహాన్ని పడేసి వెళ్లారు. దీంతో చీమలు, ఈగలు ముసురుకుని ఉన్న ఆ పసికందు మృతదేహాన్ని ఉదయాన చూసిన స్థానికులు చలించిపోయారు.

సమాచారమివ్వడంతో రుయా అధికారులు అక్కడకు చేరుకుని పరిశీలించారు.  పోలీసులకు తెలియజేయడంతో వారు దర్యాప్తు చేశారు. బిడ్డ ఆధారంగా తల్లిదండ్రులను గుర్తించి వారిని పిలిపించారు. విచారణ చేశారు. తమ బిడ్డ మృతి చెందడంతో ఇంటికి తీసుకెళ్లలేక ఇక్కడే పాతిపెట్టాలని ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులతో మాట్లాడి వారికి డబ్బులిచ్చి వెళ్లిపోయామని, వారు ఇలా పడేస్తారని అనుకోలేదని పేర్కొన్నారు. అనంతరం బిడ్డ మృతదేహాన్ని వారికి అప్పగించారు. ఆ తర్వాత పసికందు మృతదేహాన్ని తిరుపతిలోనే ఖననం చేసి తల్లిదండ్రులు తిరిగి వెళ్లిపోయారు. కుక్కల బారిన పసికందు మృతదేహం పడి ఉంటే పరిస్థితి భయానకంగా ఉండేదని కొందరు వ్యాఖ్యానించారు. ఇదలా ఉంచితే, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, పోలీసు అవుట్‌ పోస్టులను బలోపేతం చేస్తే ఇలాంటి సంఘటనలు జరిగేందుకు ఆస్కారం ఉండదని నివేదికలు చెబుతున్నా ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలొస్తున్నాయి. ఇకనైనా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుం డా అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top