సెల్‌ఫోన్‌ వాడాడు.. దొరికిపోయాడు

Murder Case Reveals in PSR Nellore - Sakshi

చోరీ కేసును విచారించిన పోలీసులు

వెలుగులోకి వచ్చిన వృద్ధురాలి హత్యకేసు

నిందితుడి అరెస్ట్‌

రూ.3 లక్షల సొత్తు స్వాధీనం

నెల్లూరు(క్రైమ్‌): నేరం చేసిన వాడు ఎప్పటికైనా ఊచలు లెక్కించాల్సిందేనన్న నానుడి అక్షరాలా రుజువైంది. ఓ దుండగుడు వృద్ధురాలిని హత్యచేసి నగదు దోచుకెళ్లాడు.  పోలీసులు పట్టుకోలేరనుకున్నాడు. ఓ ఇంట్లో సెల్‌ఫోన్‌ను దొంగిలించి దానిని వినియోగించాడు. చివరకు అదే అతడిని పోలీసులకు పట్టించేలా చేసింది. విచారణలో వృద్ధురాలి హత్యతోపాటు పలునేరాలు చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. నెల్లూరులోని ఉమేష్‌చంద్ర మెమోరియల్‌ కాన్ఫరెన్స్‌హాలులో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి నిందితుడి వివరాలను వెల్లడి ంచారు. కొడవలూరు మండలం రాజుపాళెంకు చెందిన జి.విజయ్‌కుమార్‌ వ్యసనాలకు బానిసై దొంగగా మారాడు. పెద్దపుత్తేడులోని కోదండరామస్వామి దేవాలయంలో ఉన్న కలశం రూ.కోట్లు విలువ చేస్తుందని భావించిన అతను తన స్నేహితులతో కలిసి 2016లో దానిని దొంగిలించాడు. అప్పట్లో పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు.

హమాలీగా పనిచేస్తూనే...
జైలు నుంచి బయటకు వచ్చిన విజయ్‌కుమార్‌ ప్రస్తుతం నెల్లూరులోని వేదాయపాళెం జనశక్తినగర్‌లో ఉంటూ ఓజిలిలోని లిక్కర్‌ గోదాములో హమాలీగా పనిచేస్తున్నాడు. రాత్రిపూట నేరాలకు పాల్పడుతూ పోలీసుల కళ్లుగప్పి తిరగసాగాడు. ఇటీవల వేదాయపాళెం పోలీసు స్టేషన్‌ పరిధిలో ఓ ఇంట్లో ఎల్‌ఈడీ టీవీ, సెల్‌ఫోన్, గ్యాస్‌ సిలిండర్, తాళిబొట్టును అపహరించుకెళ్లాడు. బా«ధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీఎస్, వేదాయపాళెం పోలీసులు అపహరణకు గురైన సెల్‌ఫోన్‌ టవర్‌ లొకేషన్, కాల్‌ డీటైల్స్‌ ఆధారంగా దర్యాప్తును ప్రారంభించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నిందితుడు వేదాయపాళెం రైల్వే స్టేషన్‌లో ఉన్నాడని టవర్‌ లొకేషన్‌ ఆధారంగా పోలీసులు గుర్తించారు. సీసీఎస్, వేదాయపాళెం పోలీసు ఇన్‌స్పెక్టర్‌లు షేక్‌ బాజీజాన్‌సైదా, జి.నరసింహారావు, సీసీఎస్‌ ఎస్సై టి.మధుసూదన్‌రావు, వారి సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని విజయకుమార్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

బయటపడ్డ హత్యకేసు
నిందితుడిని విచారించే క్రమంలో నెల్లూరులోని బీవీనగర్‌ ఉప్పుకట్లవారివీధిలో ఈ ఏడాది ఏప్రిల్‌ 4వ తేదీ అర్ధరాత్రి దారుణ హత్యకు గురైన వృద్ధురాలు మహబూబ్‌జానీ (68) కేసు వెలుగులోకి వచ్చింది. ఒంటరిగా నిద్రిస్తున్న మహబూబ్‌జానీని హత్యచేసి ఆమె వద్దనున్న బంగారు ఆభరణాలను అపహరించుకువెళ్లినట్లు విజయకుమార్‌ విచారణలో వెల్లడించాడు. ఇంకా ఈ ఏడాది మే 21వ తేదీన కొడవలూరు పోలీసు స్టేషన్‌ పరిధిలో ఓ మహిళ మెడలోని 32 గ్రాముల బంగారు గొలుసును, అదే ప్రాంతంలో ఓ మహిళ మెడలోని 12 గ్రాముల బంగారు సరుడును తెంపుకెళ్లినట్లు చెప్పాడు. అక్టోబర్‌ 16వ తేదీన వేదాయపాళెం పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఓ ఇంట్లో ఎల్‌పీజీ స్టౌవ్, గ్యాస్‌ సిలిండర్, ఈనెల 15న వేదాయపాళెం పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఓ ఇంట్లో బంగారు ఆభరణాలు, మూడు సెల్‌ఫోన్లు, 19, 25 తేదీల్లో రెండు ఇళ్లలో ఎల్‌ఈడీ టీవీలను చోరీ చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్‌ చేసి రూ.3 లక్షలు విలువచేసే 86 గ్రాముల బంగారు ఆభరణాలు, 65 గ్రాముల వెండి ఆభరణాలు, 4 సిలిండర్లు, 2 ఎల్‌ఈడీ టీవీలు, నాలుగు సెల్‌ఫోన్లు, గ్యాస్‌స్టౌవ్‌ను స్వాధీనం చేసుకున్నారు.

సిబ్బందికి అభినందన
నిందితుడిని అరెస్ట్‌ చేసి చోరీ సొత్తు రాబట్టేందుకు కృషిచేసిన సీసీఎస్‌ డీఎస్పీ ఎం.బాలసుందరరావు, నగర డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ, సీసీఎస్, వేదాయపాళెం ఇన్‌స్పెక్టర్లు, సీసీఎస్‌ ఎస్సై, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. కేసును ఛేదించేందుకు కృషిచేసిన సీసీఎస్‌ సిబ్బంది పి.సుబ్రహ్మణ్యం, సతీష్‌కుమార్, వినోద్‌కుమార్‌లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి నగదు రివార్డులను అందజేశారు. సమావేశంలో ఏఎస్పీ పి.పరమేశ్వరరెడ్డి, క్రైమ్‌ ఏఎస్పీ ఆంజనేయులు, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top