లాక్‌డౌన్‌.. ఆన్‌లైన్‌లో మద్యం..లక్ష మోసం

Mumbai Man Dials For Home Delivery Of Liquor Loses RS 1 Lakh - Sakshi

ముంబై : కరోనావైరస్ ప్రపంచమంతా పంజా విసురుతోంది. ఈ మహమ్మారి వల్ల దేశదేశాలే స్తంభించిపోయాయి. భారత్‌లో కూడా కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో భారత్‌ లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో రవాణా మొత్తం బంద్‌ అయింది. నిత్యావ‌స‌ర వ‌స్తువులు త‌ప్ప ఏవి ప్రజలకు అందుబాటులో లేకుండాపోయాయి. ఈ కరోనా ఎఫెక్ట్‌ మందుబాబులపై కూడా పడింది. లాక్‌డౌన్‌ వల్ల మద్యం షాపులన్నీ బంద్‌ చేశారు. దీంతో తాగడానికి మందులేక లిక్కర్‌ బాబులు గిలగిల కొట్టుకుంటున్నారు.

ఇక లిక్కర్‌ షాపులన్నీ బంద్ కావడంతో మద్యం ప్రియులు ఆన్ లైన్ అమ్మకాలపై దృష్టి పెట్టారు. ఇదే అదునుగా భావించి.. సైబర్‌ క్రైమ్‌ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. మద్యం సరఫరా చేస్తామని చెబుతూ రూ.లక్షల్లో దోచుకుంటున్నారు. ఇలా ఆన్‌లైన్‌లో మద్యం ఆర్డర్‌ చేసి లక్ష రూపాయలు పొగొట్టుకుంది ఓ జంట. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... ముంబైలోని చెంబూర్‌కు చెందిన ఓ దంపతులు మార్చి 24వ తేదీన ఆన్‌లైన్‌లో మద్యం కోనుగోలు చేయాలనుకున్నారు. దాని కోసం ఆన్‌లైన్‌లో సెర్చ్‌ చేసి ఓ ఫోన్‌ నెంబర్‌ను తెలుసుకున్నారు.

వెంటనే కాల్ చేయగా.. ఆన్‌లైన్ కొనుగోలు కోసం రూ.3,000 చెల్లించాలని ఓ వ్యక్తి వారిని కోరాడు. దీని కోసం ఓ ఓటీపీ వస్తోందని, అది చెప్పమని అడిగాడు. ఆ వ‍్యక్తి మాటలను నమ్మిన దంపతులు.. ఓటీపీని వారికి చెప్పారు. దీంతో వెంటనే బాధితుడి ఖాతా నుండి రూ.30,000 కట్ చేసుకున్నాడు. బాధితుడు వెంటనే ఆ వ్యక్తికి ఫోన్ చేయగా.. ఆ మొత్తం పొరపాటున కట్ అయ్యాయని.. వెంటనే వాపసు చేస్తామని చెప్పాడు. అలా.. సుమారు ఆరుసార్లు ఓటీపీ కోరుతూ రూ. 1.03 లక్షలు దోపిడి చేశారు. ఆ తర్వాత బాధితుడు కాల్ చేయగా తమకు డబ్బు జమ కాలేదని సరుకుని డెలివరీ చేయలేమని.. మరొక కార్డు ఉపయోగించి చెల్లింపులు జరపాలని తెలిపాడు. దీంతో కంగుతిన్న ఆ దంపతులు మోసం చేశారని భావించి తిలక్ నగర్ పోలీసులకు మార్చి 27వ తేదీన ఫిర్యాదు చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top