
ముంబై: యువతి ఎదుట లైంగికంగా అసభ్య చర్యలకు పాల్పడిన ఓ ఆటోడ్రైవర్‌ను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన నిందితుడిని వెస్ట్ మలాద్‌లోని మల్వానీకి చెందిన మహమ్మద్ షకీల్ మెమన్‌గా గుర్తించారు. గతంలోనూ మహిళలను వేధించిన కేసులు అతనిపైన నమోదయ్యాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 1వ తేదీ రాత్రి 11.30 గంటల సమయంలో ఓ యువతి మల్వానీలోని బస్టాప్‌లో బస్సు కోసం ఎదురుచూస్తోంది. ఆ సమయంలో ఆమెకు అత్యంత సమీపంగా ఆటో ఆపిన మెమన్.. తన ఆటోలో కూర్చోవాలని యువతిని అడిగాడు. ఆమె పట్టించుకోలేదు. దీంతో ఆటోలో కూర్చొని ఆమె వైపు తిరిగి.. మెమన్ లైంగికంగా అసభ్య చర్యలకు దిగాడు. ప్యాంటు జిప్పు విప్పి.. తన ప్రైవేటు అంగాలను చూపిస్తూ.. అతను స్వయం సంతృప్తి చర్యలకు పాల్పడ్డాడు. దీంతో షాక్ తిన్న యువతి వెంటనే తల్లిని పిలిచింది. ఇద్దరు కలిసి కేకలు వేయడంతో ఆటోను అక్కడే వదిలేసి.. మెమన్ పారిపోయాడు. ఈ ఘటనపై బాంగూరు పోలీసు స్టేషన్‌లో యువతి, ఆమె తల్లి కలిసి ఫిర్యాదు చేశారు. సమీప ప్రాంతంలోని పలు సీసీ టీవీ దృశ్యాలను పరిశీలించిన పోలీసులు నిందితుడిని గుర్తించి బుధవారం అరెస్టు చేశారు.