షేక్‌పేట తహసీల్దార్‌ భర్త బలవన్మరణం

MRO Sujatha Husband Committed Lifeless Chikkadpally - Sakshi

ఐదో అంతస్తు పైనుంచి దూకి ప్రొఫెసర్‌ అజయ్‌ ఆత్మహత్య

ఏసీబీ అధికారుల వేధింపులే కారణం అని ఆరోపణలు

కండీషనల్‌ బెయిల్‌పై విడుదలైన భార్య సుజాత

కొడుకుని పట్టుకొని విలపించిన తహసీల్దార్‌ 

సాక్షి, హైదరాబాద్‌/ముషీరాబాద్‌: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న షేక్‌పేట తహసీల్దార్‌ సుజాత భర్త ప్రొఫెసర్‌ అజయ్‌కుమార్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారు. చిక్కడపల్లిలో లలిత మాన్‌షెన్‌లోని తన రెండో అక్క రేఖ ఇంట్లో తన కుమారుడితో అజయ్‌ ఉంటున్నారు. బుధవారం ఉదయం 7.30 గంటలకు అజయ్‌కు ఓ ఫోన్‌ కాల్‌ రాగా మొదటి అంతస్తు నుంచి ఐదో అంతస్తుపైకి వెళ్లి మాట్లాడుతూ.. అపార్ట్‌మెంట్‌ పైనుంచి కిందకు దూకారు. తీవ్రంగా గాయపడిన అజయ్‌కుమార్‌ను కుటుంబ సభ్యులు హుటాహుటిన సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

ఆరోపణలు భరించలేకే..
చిన్నప్పట్నుంచే సున్నిత మనస్కుడైన అజయ్‌ తన భార్యపై వచ్చిన అవినీతి ఆరోపణలను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలుస్తోంది. ఉన్నత కుటుంబం, భార్యాభర్తలిద్దరికీ మంచి ఉద్యోగాలు.. నల్లేరుపై నడకలా సాగుతున్న వారి జీవితం ఒక్కసారిగా చిన్నాభిన్నమైంది. అవి నీతి ఆరోపణలు ఎదుర్కొని ఒకరు జైలుపాలు కాగా.. మరొకరు క్షణికావేశంలో ప్రాణాలు తీసుకున్నారు. ఇక అజయ్‌కుమార్‌ది విద్యావంతుల కుటుంబం. గత 15 ఏళ్లుగా ఆయన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. మొదట్లో సివిల్స్‌ కోసం శిక్షణ పొంది ఇంటర్వూ్య వరకు వెళ్లారు. తొలుత మహబూబ్‌నగర్‌ పీజీ కళాశాలలో, నిజాం కళాశాలలో, కోఠి ఉమెన్స్‌ కళాశాలలో పనిచేసి ప్రస్తుతం ఉస్మానియా ఆర్ట్స్‌ కళాశాలలో పొలిటికల్‌ సైన్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. పీహెచ్‌డీ పూర్తిచేసిన అజయ్‌ తన థీసిస్‌ సబ్‌మిషన్‌ దశలో ఉన్నారు.

అంతకుముందు ఓ జూనియర్‌ కళాశాలలో పనిచేస్తుండగా తన కొలీగ్స్‌ ద్వారా పరిచయమైన ఖమ్మం జిల్లా, మధిరకు చెందిన సుజాతను పెళ్లి చేసుకున్నారు. ఇక అజయ్‌ బాబాయ్‌లు, పెద్దనాన్నలు కూడా ఉన్నత విద్యావంతులే. పెదనాన్న గోకా రామలింగం ఉమ్మడి వరంగల్‌ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. అలాగే తన రెండో పెదనాన్న రామస్వామి అప్పటి చెన్నారెడ్డి ప్రభుత్వంలో మత్స్యశాఖ మంత్రిగా పనిచేశారు. ఇక తండ్రి ఆంజనేయులు డీఎస్పీగా పనిచేసి రిటైరయ్యారు. తన బాబాయ్‌లు మోహన్‌ కాకతీయ మెడికల్‌ కాలేజీలో ప్రొఫెసర్‌గా, మరో బాబాయ్‌ గోకా మురళీ డాక్టర్‌గా ఉన్నతస్థాయిల్లో పనిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ కోసం జరిగిన ఉద్యమంలో అజయ్‌ చురుగ్గా పాల్గొన్నారు. ఇక సుజాత కూడా గ్రూప్‌–2 ఆఫీసర్‌గా ఎంపికై మొదట మెదక్‌ జిల్లాలో, తర్వాత నగరంలోని ముషీరాబాద్, హిమాయత్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో తహశీల్దార్‌గా పనిచేశారు.

కావాలనే టార్గెట్‌ చేశారా?
షేక్‌పేట తహసీల్దార్‌ సుజాతను ఆమె కుటుంబాన్ని కొందరు రెవెన్యూ అధికారులతో పాటు ఏసీబీ అధికారులు కావాలానే టార్గెట్‌ చేశారని ఫిర్యాదులు వస్తున్నాయి. సుజాతను ఇప్పటికే అరెస్ట్‌ చేయగా, ఆమె భర్త ప్రొఫెసర్‌ అజయ్‌ను సైతం అరెస్ట్‌ చేస్తామన్న సంకేతాల నేపథ్యంలోనే బుధవారం ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. వాస్తవానికి బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 14 సర్వే నెంబర్‌ 403/పీలో 4,865 గజాల భూవివాదంలో తనను ఎస్‌ఐ రవీందర్‌నాయక్‌ వేధిస్తున్నాడని అబ్దుల్‌కాలీద్‌ అనే వ్యక్తి ఏసీబీకి ఫిర్యాదు చేయగా.. ఏసీబీ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ (ఆర్‌ఐ) నాగార్జునరెడ్డిని వలపన్ని పట్టుకుంది. ఆపై కాలీద్‌ను పోలీస్‌లు విచారించిన సమయంలో అతను తహశీల్దార్‌ సుజాత ప్రస్తావనే తీసుకురాలేదని సమాచారం.

అయినా కేసును ముందుకు తీసుకెళ్లే దిశగా ఆమె నివాసంలో సోదాలు చేయటం రూ.30 లక్షల నగదుకు సరైన లెక్కలు చూపని కారణంగా ఆమెను అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. అనంతరం భర్త అజయ్‌కు ఏసీబీ నుంచి తరచూ ఫోన్లు రావటం, తాము అడిగిన వివరాలు చెప్పకపోతే అరెస్ట్‌ తప్పదన్న సంకేతాలివ్వటం వల్లే అజయ్‌ ఆత్మహత్యకు ఒడిగట్టారని సమీప బంధువులతో పాటు రెవెన్యూ సంఘాలు ఆరోపించాయి. అయితే సుజాతను ఏసీబీ వివాదంలో ఇరికించేందుకు నగర రెవెన్యూశాఖలోని ఒకరిద్దరు అధికారులు సైతం ఏసీబీకి తప్పుడు సమాచారం ఇచ్చారన్న అంశం తెరమీదకు వచ్చింది.

రెండు మార్లే ఫోన్‌ చేశాం..: ఏసీబీ డీఎస్పీ
అజయ్‌ ఆత్మహత్య నేపథ్యంలో ఈ కేసును విచారిస్తున్న ఏసీబీ డీఎస్పీ అచ్చేశ్వర్‌రావును ‘సాక్షి’ప్రశ్నించగా.. కేసు విచారణలో భాగంగానే తహశీల్దార్‌ సుజాతను అరెస్ట్‌ చేసిన విషయాన్ని ఆమె భర్త అజయ్‌కు ఫోన్‌లో ధ్రువీకరించామని, ఆపై హన్మకొండ సమీపంలో తమకు ఆరెకరాల వ్యవసాయ భూమి ఉందని సుజాత తమకు చెప్పగా, అదే విషయాన్ని ధ్రువీకరించుకునేందుకు తాము అజయ్‌ను అడిగితే ఒకే ఎకరం ఉందని చెప్పారని ఈ రెండు సమయాల్లో తప్పితే తాము మరే కాల్‌ చేయలేదని చెప్పారు.


తహసీల్దార్‌ సుజాత, ఆమె కుమారుడు భరత్‌ను ఓదారుస్తున్న బంధువులు, స్నేహితులు 

కన్నీరు మున్నీరైన సుజాత..
సుందరయ్య విజ్ఞానకేంద్రం: భర్త అజయ్‌కుమార్‌ ఆత్మహత్య నేపథ్యంలో చర్లపల్లి జైలు నుంచి కండీషనల్‌ బెయిల్‌పై తహశీల్దార్‌ సుజాత విడుదలయ్యారు. సాయంత్రం చిక్కడపల్లిలోని తన ఆడపడుచు ఇంటికి చేరుకొని ఒక్కగానొక్క కొడుకు భరత్‌ను చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఇటు ఏసీబీ అధికారుల వేధింపుల వల్లే తన సోదరుడు ఆత్మహత్య చేసుకున్నట్లు అజయ్‌ అక్కలు ఆరోపించారు. సుజాత అరెస్టైనప్పటి నుంచి అజయ్‌ డిప్రెషన్‌లోకి వెళ్లారని, చేయని తప్పుకు తన భార్య అరెస్టు కావడాన్ని జీర్ణించుకోలేకపోయాడన్నారు. ఏసీబీ అధికారి వేధింపులు తట్టుకోలేక తాను చనిపోతున్నట్లుగా తన తమ్ముడు ఆ అధికారికి మెసేజ్‌ కూడా పెట్టాడని అక్క మంగళ తెలిపారు. 

సుజాత కుటుంబానికి అండగా ఉంటాం..
ఈ నేపథ్యంలోనే సుజాతను పలువురు రెవెన్యూ అధికారులు పరామర్శించారు. తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వంగా రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.గౌతమ్‌కుమార్, ఉపాధ్యక్షుడు రామకృష్ణ, రాజేంద్రనగర్‌ ఆర్డీవో చంద్రకళ, సికింద్రాబాద్‌ ఆర్డీవో వసంతకుమారి, డిప్యూటీ కలెక్టర్లు సంగీత, అశోక్‌కుమార్, రాధిక రమణి, తహశీల్దార్‌ లలిత సుజాతను ఓదార్చారు. ‘తహశీల్దార్‌ సుజాత కుటుంబానికి అండగా ఉంటాం. షేక్‌పేట్‌ ఆర్‌ఐ నాగార్జునరెడ్డి డబ్బులు తీసుకున్న కేసుకు సుజాతకు ఎలాంటి సంబంధం లేదు. సుజాతకు రెవెన్యూశాఖలో ఎలాంటి చెడ్డపేరు లేదు. మంచి అధికారిగా గుర్తింపు తెచ్చుకుంది. ఒకవేళ సుజాత నేరస్తురాలైతే కోర్టులో తేలుతుంది. సుజాత విషయంలో ఏసీబీ అధికారులు ఆమె భర్తకు ఫోన్‌ చేసి వేధించడం సరైంది కాదు..’అని గౌతమ్‌కుమార్‌ అన్నారు.

అజయ్‌ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి..
అఫ్జల్‌గంజ్‌: ఉస్మానియా ఆసుపత్రిలో ప్రొఫెసర్‌ అజయ్‌ మృతదేహానికి ఫొరెన్సిక్‌ నిపుణులు డాక్టర్‌ ఝాన్సీ నేతృత్వంలోని వైద్యుల బృందం పోస్టుమార్టం పూర్తి చేసింది. కాగా మృతదేహాన్ని తీసుకువెళ్లడానికి కుటుంబ సభ్యులెవరూ రాకపోవడంతో మార్చురీలో భద్రపరిచారు. గురువారం అజయ్‌ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top