తప్పెవరిది..?

Mother And Child Died In Gosha Hospital In Vizianagaram - Sakshi

ఘోషాస్పత్రిలో తల్లి బిడ్డ మృతి 

వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువుల ఆరోపణ

ఊపిరితిత్తుల్లో ఉమ్మినీరు చేరడమే కారణమంటున్న వైద్యులు

విజయనగరం ఫోర్ట్‌ : కవల పిల్లలు పుడతారని వైద్యులు చెప్పగానే రామలక్ష్మణులే పుడతారన్న సంతోష పడ్డారామె. వారిని పెంచి పెద్ద చేసేందుకు లెక్కకు మిక్కిలి కలలు కన్నారు. జీవితాంతం పిల్లలతో ఆనందంగా గడపాలనుకున్నారు. ఇంతలోనే విధి మృత్యువు రూపంలో కాటేసింది. ఈ హృదయ విదారక ఘటన జిల్లా కేంద్రంలోని ఘోషాస్పత్రిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పూసపాటిరేగ మండలం చింతపల్లి గ్రామానికి చెందిన కొమర అప్పయ్యమ్మ (23) అనే గర్భిణికి పురిటి నొప్పులు వచ్చాయి.

ఆది వారం సాయంత్రం బంధువులు ఆమెను ఘోషాస్పత్రిలో చేర్పించారు. అంతకు ముందు నిర్వహించిన ఆల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌లో గర్భంలో కవలలు ఉన్నట్లు గుర్తించారు. సోమవారం ఉదయం అప్పయ్యమ్మకు సాధారణ ప్రసవమైంది. మగ శిశువు జన్మించాడు. కానీ కవల పిల్లలు అని ముందే తెలిసిన వైద్యులు రెండో బిడ్డ కోసం ఆపరేషన్‌ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ పరిస్థితిలో ఆమె మృతి చెందారు. గర్భంలోని ఆడశిశువు కూడా మృతి చెందింది.

పట్టించుకోలేదు..
మా చెల్లిని ఆదివారం ఘోషాస్పత్రిలో చేర్పించాం. ముందు సాధారణ ప్రసవమైంది. మగ బిడ్డ పుట్టాడని చెప్పారు. ఆ తర్వాత సుమారు గంట వరకు వైద్యులు ఆమెను పట్టించుకోలేదు. ఏం జరుగుతుందో తెలియలేదు. గంట తర్వాత ఆపరేషన్‌ చేయాలి, సీరియస్‌గా ఉందని చెప్పారు. అలా చెప్పిన కొద్ది సేపటికే మీ చెల్లి చనిపోయిందన్నారు. వారు సకాలంలో పట్టించుకుని ఉంటే మా చెల్లి బతికేది.
– బర్రి అప్పన్న, మృతురాలి అన్నయ్య. 

వైద్యుల నిర్లక్ష్యం లేదు.. 
అప్పయ్యమ్మ మృతి విషయంలో వైద్యుల నిర్లక్ష్యం లేదు. తొలుత సాధారణ ప్రసవమైంది. మగబిడ్డ జన్మించాడు. రెండో బిడ్డను తీసేందుకు సిజేరియన్‌ చేసేందుకు వైద్యులు ఏర్పాటు చేశారు. ఈ లోగా ఆమె ఊపిరితిత్తుల్లోకి ఉమ్మినీరు వెళ్లిపోవడంతో శ్వాస ఇబ్బందిగా మారి మరణించింది. ఆమెను బతికించడానికి  వైద్యులు శతవిధాలా ప్రయత్నించారు. లక్ష మందిలో ఒకరికి ఇలా జరుగుతుంది.  
–జి.ఉషశ్రీ,జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయాధికారి.

ఇది బంధువుల వాదన..  వైద్యుల నిర్లక్ష్యం వల్లే తల్లి,బిడ్డ చనిపోయారని మృతిరాలి బంధువులు ఆరోపిస్తున్నారు. సాధారణ ప్రసవమైన తర్వాత అప్పయ్యమ్మను పట్టించుకోకుం డా వదిలేశారని వారు చెబుతున్నారు. సకా లంలో సిజేరియన్‌ చేసి ఉంటే తల్లి, బిడ్డ ఇద్దరు బతికేవారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వైద్యులను సంప్రదిస్తే అలాంటిదేమి లేదని పేర్కొంటున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top