మోస్ట్‌వాంటెడ్‌ టెర్రరిస్ట్‌ ఖురేషీ అరెస్ట్‌

most wanted terrorist IM terrorist arrested by Delhi police - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బాంబుల తయారీలో దిట్ట, ఇండియన్‌ ముజాహిద్దీన్‌ ఉగ్రసంస్థ వ్యవస్థాపకుల్లో ఒకడైన అబ్దుల్‌ సుభాన్‌ ఖురేషీ అలియాస్‌ తౌఖీర్‌ ఎట్టకేలకు పోలీసుల చేతికిచిక్కాడు. 2008 గుజరాత్‌ వరుస పేలుళ్లతోపాటు పలు రాష్ట్రాల్లో ఉగ్రకార్యకలాపాలకు పాల్పడినట్లు ఖురేషీపై కేసులున్నాయి. ఇంటర్‌పోల్‌ జారీచేసిన మోస్ట్‌వాంటెడ్‌ టెర్రరిస్టుల్లో ఒకడైన ఖురేషీపై రూ.4లక్షల రివార్డు కూడా ఉంది.

కాల్పుల కలకలం : 2008 గుజరాత్‌ పేలుళ్ల తర్వాత కనిపించకుండాపోయిన ఖురేషీ కోసం పలు రాష్ట్రాల పోలీసులు గాలిస్తున్నరు. కాగా, ఢిల్లీలోని ఓ ప్రాంతంలో అతను తలదాచుకున్నట్లు సమాచారం అందడంతో ఆదివారం రాత్రి ఢిల్లీ ప్రత్యేక పోలీసు రంగంలోకిదిగారు. సోమవారం ఉదయం ఆపరేషన్‌ ముగిసిందని, ఖురేషీ అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. ఉగ్రవాదిని అదుపులోకి తీసుకునే క్రమంలో కాల్పులు, ఎదురుకాల్పులు చోటుచేసుకున్నట్లు తెలిసింది. ఈ వార్తకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సిఉంది.

నిమిషాల వ్యవధిలో 21 బాంబులు పేల్చి.. : దేశంలో ఉగ్రచర్యలకు సంబంధించి ‘అహ్మదాబాద్‌ వరుస పేలుళ్ల’ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. బెంగళూరు పేలుళ్లు జరిగిన మరుసటిరోజే అంటే, 2008, జులై 26న అహ్మదాబాద్‌ పట్టణంలోని పలు ప్రాంతాల్లో వరుస పేలుళ్లు సంభవించాయి. కేవలం 70 నిమిషాల వ్యవధిలోనే 21 బాంబులు పేలాయి. మొత్తం 56 మంది ప్రాణాలు కోల్పోగా, 200 మందికి గాయాలయ్యాయి. ఆ పలుళ్లు జరిపింది తామేనని ఇండియన్‌ ముజాహిద్దీన్‌ సంస్థ ప్రకటించుకుంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఎనిమిదిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top