షాడో ఎమ్మెల్యే!

MLA  Follower Harassing To Electric workers - Sakshi

‘‘ఏయ్‌..ఉండాలని లేదా... నాకు నచ్చని వాళ్లు ఇక్కడ ఉండొద్దు. నాకు నచ్చినట్లు పని చేస్తే.. నా నియోజకవర్గంలో ఉండండి.. లేదంటే ఎలా పంపించాలో అలాగే పంపిస్తా..’’- విద్యుత్‌ కార్మికులకు 

హెచ్చరిక‘‘వాడు నాకు నచ్చలేదు. వెంటనే విధుల్లోంచి తీసేసి, మావాడిని (సిఫారసు చేసిన వ్యక్తి పేరు) పనిలో పెట్టుకునేలా చర్యలు తీసుకోండి.. లేదంటే నేను ఎంతదూరమైనా వెళ్తా...’’- విద్యుత్‌ అధికారులపై హుకుం...

ఇలా పెత్తనం చెల్లాయిస్తున్నది ఏదో నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే కానే కాదు. అంతకుమించి...షాడో ఎమ్మెల్యే..! ఈయన శ్రీకాకుâళం రూరల్‌ మండలానికి చెందిన ఓ ఎంపీటీసీ. స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవికి అతి సన్నిహితుడు కావడంతో దాదాపుగా అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ జోక్యం చేసుకుంటూ తనదైన శైలిలో రెచ్చిపోతున్నాడు.

తాజాగా విద్యుత్‌ శాఖలో తన దురుసుతనం చూపించడంతో, ఏకంగా ఆశాఖ కాంట్రాక్టర్లు, కార్మికుల సమ్మె వరకు దారితీసింది. ఈ వ్యవహారం జిల్లా కేంద్రంలో చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే...

అరసవల్లి శ్రీకాకుళం : స్థానిక నియోజకవర్గంలో విద్యుత్‌ పనుల్లో భాగంగా కొత్త విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌పార్మర్లు, హెచ్‌టీ లైన్లు, పలు మీటర్ల ఏర్పాటు పనుల్లో కూడా తనదైన శైలిలో సదరు ఎంపీటీసీ అతిజోక్యం చేసుకోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తాను చెప్పిన ప్రదేశంలో స్తంభాలు, విద్యుత్‌ తీగలు వేయాలంటూ ఆదేశాలిస్తూ హడావుడి చేస్తున్నారు. దీంతో కొన్నిసార్లు వాదనలు, ప్రతివాదనలతో తాత్కాలికంగా పరిస్థితులు సద్దుమణిగినా, అది కొద్ది రోజులకే పరిమితమైంది.

తన నియోజకవర్గంలో తనకు నచ్చిన వారు, తన సిఫారసుతో ఉన్నవారితోనే విద్యుత్‌ కాంట్రాక్టు పనులు చేయించాలని ఈ షాడో ఎంపీటీసీ విద్యుత్‌ అధికారులకు, కాంట్రాక్టర్లకు మౌఖిక ఆదేశాలు ఇవ్వడంతో మళ్లీ వివాదం రోడ్డెక్కింది. దీంతో రాజకీయంగా ఈ వివాదం సంచలనంగా మారింది.

అయితే విద్యుత్‌ సంబంధించిన ఏ పనికైనా కొన్ని నియమ నిబంధనలు, ప్రతిపాదనలు, ఆమోదాలు ఉంటాయని, వీటి ఆధారంగానే తాము పనిచేస్తామని కొందరు సిబ్బంది చెబుతున్నారు. వీటిని వినిపించుకోకుండా తాను చెప్పినట్లు చేస్తే నియోజకవర్గంలో ఉంటారని, లేదంటే ఉండే అవకాశాలు లేవని హెచ్చరికలు జారీ అవుతున్నాయి. దీంతో చేసేదేమీ లేక సమ్మెకు దిగేందుకు కాంట్రాక్టర్లు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం.

చర్చలు విఫలమై..

స్థానిక నియోజకవర్గంలో విద్యుత్‌ అధికారులు, కార్మికులపై పెత్తనం చెలాయిస్తున్న నేతలతో ఇక వేగేది లేదని కార్మికులు, కాంట్రాక్టర్లు తేల్చిచెప్పార ని విశ్వసనీయంగా తెలుస్తోంది. అంతకుముందు సదరు షాడో ఎమ్మెల్యేకు, స్థానిక రాజకీయ పెద్దల సమక్షంలో పలుమార్లు చర్చలకు దిగినా, ఏ మాత్రం మెట్టు దిగని సదరు వ్యక్తి తీరు.. విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికుల సమ్మెకు దారితీసినట్లు తెలు స్తోంది.

తనకు నచ్చని వారు పనుల్లో ఉండకూడద ని చెప్పడంపై కార్మికులు భగ్గుమంటున్నారు. ఈ మేరకు జిల్లాలో శ్రీకాకుళం, పాలకొండ, టెక్కలి విద్యుత్‌ డివిజన్‌లోని కాంట్రాక్టు సిబ్బందితో కూడా చర్చలు మొదలుపెట్టి, సమ్మెకు దిగనున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు విద్యుత్‌ అధికారుల వద్ద కూడా సమ్మె విషయం సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అధికారికంగా అధికారులు విముఖత చూపిస్తున్నారు.

ఇదిలావుంటే గురువారం రాత్రి నుంచి కాంట్రాక్టర్లు తమ నిరసనను తెలియజేస్తూ వస్తున్నారని, అందుకే కొంత సేపు విద్యుత్‌ సరఫరా నిలిపివేసారనే ప్రచారం స్థానిక విద్యుత్‌ సర్కిల్‌ కార్యాలయంలో షికారు చేసింది. ఏదేమైనా షాడో ఎమ్మెల్యే ఆగడాలను తట్టుకోలేక పోతున్నామని, ఎలాగైనా తమ నిరసనను తెలియజేస్తామనే రీతిలో కాంట్రాక్టర్లు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. 
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top