వడ్డీలేని రుణాల పేరిట బురిడీ

Merchant Stolen Thousand kg gold In Chennai - Sakshi

తాకట్టుపెట్టిన వెయ్యికిలోల బంగారునగలతో వ్యాపారి మాయం

పోలీసుల వద్ద లబోదిబో మంటున్న బాధితులు

తమిళనాడు రాజధాని చెన్నైలో ఘటన  

సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘నేను దయార్ద్రహృదయుడిని, రుణాలపై వడ్డీ తీసుకోకూడదని నేను నమ్మిన దైవం చెప్పింది. అందుకే బంగారు నగలపై వడ్డీ లేకుండా రుణాలు ఇస్తున్నాను’అంటూ ప్రజల్ని నమ్మించిన ఓ వ్యక్తి కుదువబెట్టిన సుమారు రూ. 300 కోట్ల విలువైన బంగారు నగలతో ఉడాయించాడు. చెన్నై పోలీసు కమిషనర్‌ కార్యాలయం, మద్రాసు హైకోర్టు వద్ద బాధితులు బారులుతీరడంతో ఈ మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బాధితులు, పోలీసుల కథనం మేరకు .. చెన్నై టీనగర్‌ వెస్ట్‌ మాంబళంలో రూబీ బ్యాంకర్స్‌ అనే పేరుతో బంగారునగల దుకాణం ఉంది. ఈ దుకాణాన్ని రెహమాన్, అతని కుమారులు అనీస్, సయ్యద్‌ 15 ఏళ్లకు పైగా నడుపుతున్నారు. బంగారు నగలను కుదువ పెట్టేవారికి వడ్డీలేని రుణాలు ఇస్తామని, రుణం చెల్లించగానే కుదువపెట్టిన నగలను తిరిగి ఇచ్చేలా స్కీము నిర్వహించారు.

రుణాలపై వడ్డీ తీసుకోరాదని పవిత్ర ఖురాన్‌లో పొందుపరిచిన మాటల ప్రకారం ఈ సేవలు చేస్తున్నట్లు ఖాతాదారులను నమ్మించాడు. బంగారం విలువలో మూడోవంతు మొత్తాన్ని 3 నెలలు, 6 నెలలు, ఏడాది కాలంలో చెల్లించేలా రుణాలు ఇచ్చారు. వడ్డీ లేని రుణాలపై ముస్లింలు అధికంగా నివసించే ప్రాంతాల్లో కరపత్రాలతో ప్రచారం కూడా చేశారు. ఈ ప్రచారాన్ని నమ్మిన ముస్లింలు సుమారు వెయ్యి కిలోల బంగారు నగలను తాకట్టు పెట్టి రుణాలు పొందారు.

ఈ నగలను రూబీ బ్యాంకర్స్‌ యజమానులు ప్రయివేటు ఫైనాన్స్‌ కంపెనీల్లో అనేక కోట్ల రూపాయలకు తాకట్టుపెట్టినట్లు, ఆ డబ్బుతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసినట్లు సమాచారం. పొందిన రుణాలను తిరిగి చెల్లించి నగలు తీసుకోవాలనుకునే వారికి జాప్యం చేయసాగారు. బాధితుడు ఒకరు మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ వేయడంతో రూబీ బ్యాంకర్స్‌కు కోర్టు సీలువేసింది.

ఇదే సమయంలో తన వ్యాపారం దివాలా తీసినట్లుగా యజమాని పేరున పసుపుపచ్చని నోటీసు మూసిఉన్న షోరూంపై అతికించి ఉండటంతో అది చూసిన ఖాతాదారులు కంగుతిన్నారు. ఈనెల 2న నగలు కచ్చితంగా వెనక్కి ఇస్తామని నమ్మబలికిన యజమానులు రూబీ బ్యాంకర్స్‌ను మూసివేసి రాత్రికి రాత్రే పారిపోయినట్లు సమాచారం. దీంతో బాధితులంతా మూకుమ్మడిగా తరలివెళ్లి పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదులు చేశారు.

సుమారు వందకు పైగా ఫిర్యాదులు అందడంతో కేసును ఆర్థికనేరాల విభాగానికి అప్పగించారు. అలాగే తొలుత పిటిషన్‌ వేసిన బాధితునితో కలిసి వందల సంఖ్యలో బాధితులు సోమవారం మద్రాసు హైకోర్టుకు వెళ్లి న్యాయం చేయాల్సిందిగా మొరపెట్టుకున్నారు. ఇప్పటివరకు అందిన ఫిర్యాదుల మేరకు సుమారు రూ.300 కోట్ల విలువైన వెయ్యి కిలోల కుదువనగలతో యజమానులు పరారైనట్లు పోలీసులు భావిస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top