ఆన్‌లైన్‌ మట్కా గుట్టురట్టు | Matka Gang Arrest in Anantapur | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ మట్కా గుట్టురట్టు

Sep 13 2018 12:03 PM | Updated on Oct 16 2018 2:30 PM

Matka Gang Arrest in Anantapur - Sakshi

స్వాధీనం చేసుకున్న నగదును పరిశీలిస్తున్న ఎస్పీ

అనంతపురం సెంట్రల్‌: రాయలసీమలో ఆన్‌లైన్‌ ద్వారా గుట్టుగా సాగుతున్న మట్కా రాకెట్‌ను అనంతపురం పోలీసులు గుట్టురట్టు చేశారు. 20 మంది నిర్వాహకులను అరెస్ట్‌ చేశారు. బుధవారం పోలీసుకాన్ఫరెన్స్‌ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్‌ వెల్లడించారు. అరెస్ట్‌ అయిన వారిలో అచ్చుకట్ట సాధిక్‌ (తాడిపత్రి పట్టణం పడమటవీధి), హబీబ్‌ఖాన్‌ (గుత్తి) మట్కా ప్రధాన నిర్వాహకులు. మిగిలిన వారిలో దూదేకుల లాల్‌బాషా, షేక్‌ సిరాజుద్దీన్‌దౌలా, దూదేకుల ఇబ్రహీం, షేక్‌ ముల్లా జాఫర్‌ (కర్నూలు జిల్లా డోన్‌), అచ్చుకట్ల అబ్దుల్లా, అచ్చుకట్ల మహమ్మద్‌ఖాసీం, మాదిగ నారాయణ (తాడిపత్రి), కోవెలకుంట్ల జాఫర్, కోవెలకుంట్ల జలీల్, కార్మురి ఇంద్రశేఖర్, చౌడం సుబ్బరాయుడు (జమ్మలమడుగు), గోనుగుంట్ల రామయ్య (వైఎస్సార్‌ జిల్లా ఎర్రముక్కపల్లి), పన్నపు జయచంద్రారెడ్డి, పన్నపు రామచంద్రారెడ్డి (పెద్ద ముడియం మండలం గుళ్లకుంట), రెడ్డి బోయ విజయ్‌కుమార్, ఎల్లావుల గోపాల్‌ (గుత్తి) ఉన్నారు. వీరి నుంచి రూ. 47.12 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రూ. 7లక్షలు కంపెనీ బ్యాంక్‌ ఖాతాలో సీజ్‌ చేశారు. వీటితో పాటు ఒక కారు, రెండు ల్యాప్‌టాప్‌లు, 32 సెల్‌ఫోన్లు, ఒక ట్యాబ్, మట్కా పట్టీలు తదితర సామగ్రితో పాటు 3 కేజీల గంజాయిని పట్టుకున్నారు. 

మిలాన్‌ మట్కా కంపెనీ పేరుతోప్రత్యేక వెబ్‌సైట్‌
సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి మాట్కాను నిర్వాహకులు కొత్తపుంతలు తొక్కిస్తున్నారు. మిలాన్‌ డే, మిలాన్‌ నైట్‌ పేర్లతో ప్రత్యేక వెబ్‌సైట్‌ రూపొందించారు. రూ. 100కు రూ.8000 చెల్లిస్తామంటూ సామాన్య, పేద వర్గాల బతుకులను ఛిద్రం చేస్తున్నారు. ప్రధాన నిందితులైన అచ్చుకట్ల సాదిక్‌వలి బెంగుళూరు కేంద్రంగా చేసుకొని అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలో మట్కా కార్యకలాపాలు సాగిస్తున్నాడు. రోజు వారి టర్నోవర్‌ మొత్తాలను కర్ణాటకలోని హుబ్లీ, మహారాష్ట్రలోని ముంబయి మట్కా కంపెనీలకు గుట్టు చప్పుడు కాకుండా పంపుతున్నాడు. కొన్నేళ్లుగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నాడు.  

రెండవ ముఖ్యుడైన గుత్తి హబీబ్‌ఖాన్‌ కూడా బెంగుళూరు కేంద్రంగా చేసుకొని తాడిపత్రి, గుత్తి, గుంతకల్, బత్తలపల్లి, కదిరి ప్రాంతాలతోపాటు కడప, కర్నూలు జిల్లాల్లో మట్కా నిర్వహిస్తున్నాడు. నిందితుల్లో ఆరుగురు అచ్చుకట్ల సాదిక్‌వలికి సమీప బంధువులే. మిగతా 12 మంది వివిధ ప్రాంతాల్లో బీటర్లుగా మట్కా పట్టీలు రాస్తూ కంపెనీలకు చేరవేస్తూ ఉంటారు. రాయలసీమ జిల్లాలో యువతను లక్ష్యంగా చేసుకొని మట్కాతో పాటు గంజాయి కూడా సరఫరా చేస్తూ రూ.లక్షల్లో సంపాదిస్తున్నారని తెలుసుకొని ప్రత్యేక నిఘా ఉంచి నిందుతులను పట్టుకున్నామన్నారు. జిల్లాలో మట్కాను శాశ్వతంగా నిర్మూలించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. మట్కా నిర్వాహకుల ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే కాకుండా అవసరమైన వారిపై జిల్లా బహిష్కరణ కూడా చేస్తామని హెచ్చరించారు.  

ప్రశంస
మట్కా నిర్వాహకులను పట్టుకోవడంతో పాటు భారీగా నగదు, మట్కా నిర్వహణకు ఉపయోగించే సామగ్రిని స్వాధీనం చేసుకోవడంలో కృషి చేసిన డీఎస్పీ వెంకట్రావ్, సీఐలు విజయభాస్కర్‌గౌడ్, హమీద్‌ఖాన్, శ్రీరామ్, ఏఎస్‌ఐ రాజశేఖర్, వెంకటకృష్ణ, హెడ్‌కానిస్టేబుల్లు రమేష్, అమర్, వెంకటేష్, శ్రీధర్, కానిస్టేబుళ్లు చంద్రశేఖర్, జయరాం, శివ, ఆనంద్, గిరి, చంద్ర, రామకృష్ణ, నాగరాజు, విజయ్‌ హోంగార్డు కుళ్లాయప్పలను ఎస్పీ అభినందించి రివార్డులతో సత్కరించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement