నల్లమలలో మావోయిస్టుల డంప్‌ స్వాధీనం

maoist technical dump catch in nallamala forest area - Sakshi

 డంప్‌లో పెద్దఎత్తున పేలుడు సామగ్రి  

38 ఖాళీ గ్రనేడ్‌లు, 1లైవ్‌ గ్రనేడ్, వీహెచ్‌ఎఫ్‌ సెట్, జిలిటెన్‌లు, వైర్‌ బండిల్‌

 ఆత్మకూరురూరల్‌: నల్లమల మరొక్కసారి ఉలిక్కి పడింది.  ఆత్మకూరు అటవీ డివిజన్‌లోని నాగలూటి చెంచు గూడెం, వీరభద్రాలయం మధ్యలో ఉన్న అటవీ ప్రాంతంలో మంగళవారం రాత్రి మావోయిస్టులకు చెందినదిగా భావిస్తున్న టెక్నికల్‌ డంప్‌ ఒకటి బయటపడింది. ఆత్మకూరు డీఎస్పీ మాధవరెడ్డి  తెలిపిన మేరకు  వివరాలు ఇలా ఉన్నాయి. నమ్మకమైన సమాచారం మేరకు డీఎస్పీ మాధవ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మకూరు సీఐ బత్తల క్రిష్ణయ్య, ఎస్‌ఐ వెంకట సుబ్బయ్య, స్పెషల్‌ పార్టీ పోలీసులు నాగలూటి చెంచు గూడెం ప్రాంతంలో గాలింపు చేపట్టారు.

నాగలూటి సమీపంలో భూమిలో పాతిపెట్టిన ప్లాస్టిక్‌ డ్రమ్‌ కనపడింది. దీన్ని వెలికి తీసి పరిశీలించగా అందులో పేలుడు సామర్థ్యం కలిగిన గ్రనేడ్‌ ఒకటి, 38 ఖాళీ గ్రనేడ్‌లు, గ్రనేడ్‌లలో ఉపయోగించే స్ప్రింగ్‌లు, బోల్టులు, కొన్ని జిలిటెన్‌ స్టిక్‌లు, ఒక వైర్‌ బండిల్, సమాచారం కోసం వినియోగించే వీహెచ్‌ఎఫ్‌ సెట్‌ ఒకటి కనిపించాయి. పోలీసులు స్వాధీనం చేసుకున్న డంప్‌ను విలేకరుల ఎదుట ప్రదర్శించారు.   కాగా మంగళవారం రాత్రి డీఎస్పీ మాధవరెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నల్లమల అడవుల్లో మావోయిస్టుల ఉనికి లేదని వివరించారు. 

నిరుపయోగమైన డంప్‌!
2006 తరువాత నల్లమలలో మావోయిస్టుల ఉనికి లేదు. 2005లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వంతో మావోయిస్టుల చర్చలు విఫలం కావడంతో నల్లమల నుంచి మావోయిస్టులు పూర్తిగా రిట్రీట్‌ అయ్యి దండకారణ్యం, ఆంధ్రా ఒడిశా బోర్డర్‌కు  తరలివెళ్లారు. ఇన్నేళ్ల అనంతరం ఒక ఆయుధ డంప్‌ బయటపడడం కొంత ఆందోళన కలిగించే అంశమే. అయితే.. ఆరేళ్ల కిందట బైర్లూటీ రేంజ్‌లోని తిరుమల దేవుని కొండ సమీపంలో కూడా ఇలాంటి ఆయుధ డంపు ఒకటి బయటపడింది. అందులో కూడా నిరుపయోగమైన ఆయుధ సామగ్రి మాత్రమే పోలీసులకు లభించింది. దీన్ని బట్టి చూస్తే  మావోయిస్టులు నల్లమలను ఖాళీ చేసినపుడు తమకు ఉపయోగం లేని వస్తువులను డంపుల్లో వదలివెళ్ళినట్లు తెలుస్తోంది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top