కన్నతండ్రే కాలాంతకుడు

Man killed four members - Sakshi

భువనేశ్వర్‌ : డబ్బు కోసం కన్న కూతుర్ని, ఆమె పిల్లల్ని హతమార్చాడో కిరాతకుడు. ఈ విషాద సంఘటన పూర్వాపరాలిలా ఉన్నాయి. ఈ నెల 10వ తేదీన జగత్‌సింగ్‌పూర్‌ జిల్లా కుజంగ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని  జగన్నాథ్‌పూర్‌ గ్రామం మహానది తీరంలో తల్లీబిడ్డల శవాలు తేలిన సంఘటన రాష్ట్ర ప్రజల హృదయాల్ని కలిచివేసింది. భర్త అకాల మరణంతో చేతికి ముట్టిన మృత్యుపరిహారం నగదు కోసం కన్న కూతురితో పాటు ఆమె బిడ్డల్ని సైతం హతమార్చిన కసాయి కన్నతండ్రి ఈ సంఘటనలో నిందితుడు.

జగన్నాథ్‌పూర్‌ గ్రామస్తుడు అక్షయ శెట్టి కన్న కూతురితో పాటు ఆమె బిడ్డల్ని హతమార్చిన హంతకుడని పోలీసులు నిర్ధారించారు. ఈ సంఘటనలో కన్నతల్లితో పాటు ఆమె ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుని మృతదేహాలు మహానదిలో కనిపించాయి. వీరిని  దివంగత విశ్వంబర శెట్టి  కుటుంబీకులుగా గుర్తించారు. విశ్వంబర్‌ శెట్టి గత నెల 4వ తేదీన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఆయన మృతికి పరిహారంగా రూ.3లక్షలు అందింది.

ఈ సొమ్ము మీద మృతుని మామ కన్నువేసి కాజేసేందుకు వ్యూహం పన్నాడు. వ్యూహం మేరకు తొలుత మనుమడు, మనుమరాళ్ల అడ్డు తొలగించాడు. బిడ్డల కోసం ఆరాటపడి తండ్రి చెంతకు చేరిన కన్నకూతుర్ని చివరగా నీటిలో తోసి ఖతం చేశాడు. ముందస్తు ప్రణాళిక ప్రకారం నిందితుడు అక్షయ శెట్టి మనుమడు మున్నా, ఇద్దరు మనుమరాళ్లు బొర్షా, దిశాలకు బిస్కెట్లు ఇచ్చి మురిపించి మహానది ఒడ్డుకు తీసుకువెళ్లి అక్కడ పిల్లల్ని అకస్మాత్తుగా నదిలోకి నెట్టేసి చల్లగా జారుకున్నాడు.

ముగ్గురు బిడ్డలు ఒక్కసారిగా కనుమరుగు కావడంతో తల్లడిల్లిన తల్లి మమినా శెట్టి కన్నతండ్రి చెంతకు చేరి బిడ్డల కోసం ఆరా తీసింది. తల్లడిల్లుతున్న కన్న తల్లి ఆవేదనను ఆసరాగా తీసుకున్న అక్షయ శెట్టి  కన్నకూతురన్న మమకారం కూడా లేకుండా బిడ్డల కోసం గాలించే నెపంతో ఆమెను కూడా మహానది ఒడ్డుకు తీసుకువెళ్లాడు. పసి బిడ్డల తరహాలో ఆమెను కూడా నదిలోకి అకస్మాత్తుగా నెట్టేశాడు.

తెల్లారేసరికి కన్నతల్లితో పాటు ముగ్గురు బిడ్డల మృతదేహాలు నదిలో తేలాయి. ఈ విషయాన్ని గుర్తించిన గ్రామస్తులు ఒడిశా విపత్తు స్పందన దళం(ఒడ్రాఫ్‌), అగ్నిమాపక దళం, స్థానిక పోలీసుల సహకారంతో నదిలో తేలిన శవాల్ని బయటకు తీశారు. అనంతరం మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని  అనుబంధ పరీక్షల్ని నిర్వహించారు. తరువాత సంఘటనపై కేసు నమోదు చేసి, నిర్వహించిన దర్యాప్తులో కథ వెనుక ఖల్‌నాయక్‌ మమినా శెట్టి కన్న తండ్రి అక్షయ శెట్టిగా దర్యాప్తు బృందం ఖరారు చేసిందని జగత్‌సింగ్‌పూర్‌ జిల్లా అదనపు సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ మంగళవారం ప్రకటించారు.    

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top