కలకలం రేపిన ఆత్మహత్య

Man Commits Suicide Infront of Police Station Proddatur - Sakshi

పోలీస్‌స్టేషన్‌ ముందు ఉరివేసుకున్న నంద్యాల వాసి

అనుమానంతో అర్ధరాత్రి స్టేషన్‌కు తీసుకొచ్చిన బ్లూకోల్ట్స్‌ పోలీసులు

ప్రొద్దుటూరు క్రైం : పోలీస్‌స్టేషన్‌ ముందు ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం ప్రొద్దుటూరులో కలకలం రేపింది. నంద్యాలకు చెందిన గౌస్‌ఖాన్‌ (50) మంగళవారం వేకువజామున పట్టణంలోని టూ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదురుగా ఉరివేసుకున్నాడు. స్లాబ్‌కు అమర్చిన కొక్కికి తాడు కట్టుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బైపాస్‌రోడ్డులోని హోసింగ్‌బోర్డు ఖాళీ స్థలంలో కారు పార్కింగ్‌ చేసి ఉంది. కారు డోర్లన్నీ తెరచి ఉండటంతో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అదే దారిన వెళ్తున్న బ్లూకోల్ట్స్‌ పోలీసులు కారును చూశారు. అందులో ఎవరూ లేరు. చుట్టుపక్కల చూడగా ఒక వ్యక్తి మద్యం మత్తులో కూర్చొని ఉన్నాడు. పోలీసులు పశ్నించినా సరైన సమాధానం లేదు. కారు రికార్డులు చూపించలేదు. మాట తీరులో స్పష్టత లేకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు కారుతో పాటు గౌస్‌ఖాన్‌ను టూ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొని వెళ్లారు. సీఐ మల్లికార్జున గుప్త విచారించగా తన పేరు గౌస్‌ఖాన్‌ అని, డ్రైవర్‌గా పని చేస్తున్నానని, స్థానికంగా పెళ్లికి వచ్చినట్లు చెప్పాడు. కారు ఒరిజనల్‌ రికార్డులతో పాటు ఓనర్‌ను పిలుచుకొని ఉదయం రమ్మని పంపించారు. 

ఉరికి వేలాడుతున్న గౌస్‌ఖాన్‌ :మంగళవారం ఉదయాన్నే టూ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదురుగా ఉన్న దుకాణం ముందు గౌస్‌ఖాన్‌ ఉరేసుకున్నట్లు స్థానికులు గుర్తించారు.  డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ మల్లికార్జునగుప్త సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గౌస్‌ఖాన్‌ నాలుగేళ్లుగా డ్రైవర్‌గా వస్తున్నాడని కారు యజమాని చెప్పాడు. బైపాస్‌రోడ్డులోని శ్రీదేవి ఫంక్షన్‌హాల్‌లో బంధువుల పెళ్లి ఉండటంతో కారులో వచ్చామని తెలిపారు. కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. మృతుని కుమారులను సీఐ విచారించారు. కుటుంబ కలహాలు లేవని వారు చెప్పారు. సీసీ కెమెరాల్లో పరిశీలించగా స్టేషన్‌ ఎదురుగా ఉన్న దుకాణం ముందు ఉదయం 2.45 గంటల వరకు పడుకొని ఉన్నట్లు దృశ్యాలు కనిపించాయి. తర్వాత అదే దుకాణం ముందు ఉరి వేసుకున్నాడు. సీసీ కెమెరాకు మెట్లు అడ్డంగా ఉండటంతో అతను ఉరి వేసుకుంటున్న దృశ్యాలు కనిపించలేదు.  

మా తండ్రికి ఎలాంటి సమస్యలు లేవు :నంద్యాలోని చాంద్‌వాడలో ఉంటున్నామని, తండ్రి డ్రైవర్‌గా పని చేసేవాడని గౌస్‌ఖాన్‌ కుమారులు తెలిపారు. 8 ఏళ్ల క్రితం సౌదీకి వెళ్లివచ్చాడని పేర్కొన్నారు. మృతునికి నలుగురు కుమారులున్నారు. మద్యం తాగే అలవాటు ఉందని, తాగొద్దని చెప్పినా వినిపించుకునేవాడు కాదని తెలిసింది. చనిపోయేంత సమస్యలు లేవని, సంపాదన కూడా ఇంట్లో ఇచ్చేవాడు కాదని, తామే అప్పుడప్పుడు డబ్బు ఇస్తుంటామని కుమారులు తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top