కిరాతకంగా నరికి చంపారు 

Man Brutally Murdered In Rangareddy - Sakshi

కొందుర్గు: వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన మంగళవారం కొందుర్గు మండలం తంగెళ్లలపల్లిలో వెలుగుచూసింది. పొలం వద్దకు వెళ్తున్న వ్యక్తిని దారికాసి గొడ్డలితో అతి కిరాతకంగా నరికి చంపారు. స్థానికులు, పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. తంగెళ్లపల్లి గ్రామానికి చెందిన మాధవాచారి(60) మంగళవారం రాత్రి 8:30 గంటల సమయంలో పొలం వద్దకు వెళ్లొస్తానని ఇంట్లో చెప్పి బయల్దేరాడు. గంటలు గడిచినా తిరిగి మాధవాచారి తిరిగిరాకపోవడంతో పొలం వద్దే పడుకొని ఉంటాడని భావించిన భార్య కిష్టమ్మ, కుమారుడు యాదగిరి నిద్రకు ఉపక్రమించారు. కాగా, ఆవు పాలు కోసం బుధవారం ఉదయం యాదగిరి పొలం వద్దకు వెళ్లాడు. పొలంలోని ఓ చెట్టు వద్ద తండ్రి మాధవాచారి పడి ఉండటాన్ని యాదగిరి గుర్తించాడు. దగ్గరకు వెళ్లి చూడగా.. తలపై గొడ్డలి గాట్లు, ముఖం, తల భాగం రక్తం మరకలతో మృతిచెంది ఉన్నాడు. గమనించిన యాదగిరి గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో స్థానికులు అక్కడికి చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు.

ఆధారాల సేకరణ 
హత్య జరిగిన విషయాన్ని తెలుసుకున్న కొందుర్గు ఎస్‌ఐ శ్రీనివాస్‌తో పాటు చౌదరిగూడ ఎస్‌ఐ లింగం సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి సమాచారం ఇవ్వడంతో ఏసీపీ సురేందర్, సీఐ రామకృష్ణ ఘటనా స్థలాన్ని పరిశీలించి, డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. ఘటనా స్థలం వద్ద పెన్ను, చార్జింగ్‌ లైట్‌ మాత్రమే లభించాయని, హత్య చేసిన నిందితుల వివరాలు తెలియరాలేదని పోలీçసులు తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులు అందించిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాస్‌ తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.

కన్నీరు మున్నీరైన కుటుంబం 
మృతుడు మాధవాచారి, రాములు, సత్యం అన్నదమ్ములు. వీరిలో రాములుకు మతిస్థిమితం సరి గ్గా లేకపోవడంతో ఎనిమిదేళ్ల క్రితం ఇంటినుంచి వెళ్లిపోయాడు. ఇప్పటికీ అతడి ఆచూకీ లభించలేదు. మరో సోదరుడు సత్యం, అతడి భార్య ఇద్దరు అనారోగ్యంతో కొన్నేళ్ల క్రితం మృతిచెందారు. మాధవాచారి, కిష్టమ్మ దంపతులకు ఆ నంద్‌చారి, యాదగిరిచారి ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్యపిల్లలతో ఆనంద్‌ షాద్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. తంగెళ్లపల్లిలో మాధవాచారి, చిన్నకుమారుడు, భార్య కిష్టమ్మ తంగెళ్లపల్లిలో నివాసం ఉంటున్నారు. మాధవాచారి హ త్య విషయం తెలియగానే కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top