సాక్స్‌లో మొబైల్‌ ఫోన్‌ పెట్టుకొని సచివాలయం పరీక్షకు..

Man Arrested For Fraud In Village Secretariat Exam Anantapur - Sakshi

తనిఖీల్లో పట్టుబడకుండా జాగ్రత్త

గూగుల్‌ సెర్చ్‌లో సమాధానాలు

మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన అభ్యర్థిపై క్రిమినల్‌ కేసు 

పరీక్షల నిర్వహణ కమిటీ కన్వీనర్‌ గిరిజా శంకర్‌ ఆదేశం 

సాక్షి, అనంతపురం : కణేకల్లు మోడల్‌ స్కూల్‌ పరీక్షా కేంద్రంలోకి మొబైల్‌ ఫోనుతో వచ్చి మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడిన అభ్యర్ధిని డీబార్‌ చేయడంతో పాటు అతడిపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని పరీక్షల నిర్వహణ కమిటీ కన్వీనర్, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గిరిజా శంకర్‌  కలెక్టర్‌ సత్యనారాయణను ఆదేశించారు. రాయదుర్గానికి చెందిన బి.నౌషాద్‌కు సచివాలయ ఉద్యోగ రాత పరీక్ష కేంద్రం కణేకల్లు మోడల్‌ స్కూల్‌ పడింది. సెప్టెంబరు ఒకటో తేదీన ఉదయం సాక్స్‌లో సెల్‌ఫోన్‌ దాచుకుని పరీక్ష కేంద్రంలోకి వచ్చాడు. అయితే సిబ్బంది తనిఖీల్లో సెల్‌ఫోన్‌ను గుర్తించలేకపోయారు. పరీక్ష ముగియడానికి అరగంట ముందు మొబైల్‌ బయటకు తీసి గూగూల్‌లో సెర్చ్‌ చేసి ఐదు ప్రశ్నలకు సమాధానాలు రాశాడు. చివరకు ఇన్విజిలేటర్‌ గుర్తించాడు.

విషయం తెలుసుకున్న కలెక్టర్‌ పోలీస్‌ విచారణకు ఆదేశించడంతో నౌషాద్‌ తాను మొబైల్‌ తీసుకొచ్చినట్లు ఒప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో అభ్యర్థిని డీబార్‌ చేయడంతో పాటు క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని పరీక్షల నిర్వహణ కమిటీ కన్వీనర్, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గిరిజా శంకర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఆదేశాల మేరకు కలెక్టర్‌ సత్యనారాయణ  అభ్యర్థిని డీబార్‌ చేయడంతో పాటు క్రిమినల్‌ కేసు నమోదుకు ఉత్తర్వులు జారీ చేశారు. సరైన పర్యవేక్షణ చేయనందుకు సంబంధిత ఇన్విజిలేటర్లు, హాల్‌ సూపరింటెండెంట్, చీఫ్‌ సూపరింటెండెంట్, సెక్యూరిటీ స్టాఫ్‌పైనా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్‌ ఆదేశించారు.     

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top