విరాళాల సేకరణ పేరుతో.. | Man Arrest in Money Collecting For Trust | Sakshi
Sakshi News home page

విరాళాల సేకరణ పేరుతో ఇంట్లోకి జొరబడ్డ యువకులు

Apr 5 2018 10:59 AM | Updated on Apr 5 2018 10:59 AM

Man Arrest in Money Collecting For Trust - Sakshi

పోలీసుల అదుపులో రాంబాబు

రాజంపేట టౌన్‌: అమ్మ ఆదరణ సేవా సంస్థ పేరుతో విరాళాలు సేకరిస్తూ ఓ ఇంటిలోకి చొరబడ్డ ముగ్గురు యువకుల్లో ఒకరిని పట్టుకొని దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పజెప్పిన సంఘటన బుధవారం సాయంత్రం రాజంపేట పట్టణం సరస్వతీపురంవీధిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడలోని అమ్మ ఆదరణ సేవా సంస్థ ప్రతినిధులమంటూ ముగ్గురు యువకులు సరస్వతీపురం వీధిలో ఇంటింటికి వెళ్లి విరాళాలు సేకరించారు. అనాథ పిల్లల కోసం తమ సంస్థ ద్వారా విరాళాలు సేకరిస్తున్నామని, ప్రతి ఒక్కరు రూ.500కు తక్కువ కాకుండా ఇవ్వాలని అడిగారు. తమకు విరాళాలు ఇచ్చిన వారి పేర్లను, తాము చేసే సేవా కార్యక్రమాల ఫొటోలను కూడా చూపించడంతో ఆ ప్రాంతంలోని ప్రతి ఒక్కరూ తమకు తోచినంత  విరాళాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఓ వృద్ధురాలి ఇంటిలోకి ముగ్గురు యువకులు నేరుగా వెళ్లారు.

దీంతో ఆ వృద్ధురాలు గట్టిగా కేకలు వేయడంతో వారు పరుగు తీశారు. స్థానికులు వెంటపడగా ఇద్దరు పారిపోయారు. రాంబాబు అనే యువకుడు దొరికిపోయాడు. తాను కడప మున్సిపల్‌ హైస్కూల్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నట్లు ఒకసారి,  తమది విజయవాడలోని కృష్ణలంక అంటూ మరోసారి ఇలా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అక్కడి ప్రజలకు అనుమానం వచ్చి దేహశుద్ధి చేశారు. పారిపోయిన మిగతా ఇద్దరికి రాంబాబు  సెల్‌ నుంచి ఫోన్‌ చేయించగా వారు ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదు. దీంతో పట్టణ ఎస్‌ఐ రాజగోపాల్‌కు సమాచారం ఇవ్వగా పోలీసులు ఆ యువకుడిని స్టేషన్‌కు తీసుకెళ్లారు. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా విరాళాల పేరుతో ఇళ్ల వద్దకు వస్తే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఐ రాజగోపాల్‌ ప్రజలకు సూచించారు. కాగా, రాంబాబు అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న విషయం తెలుసుకున్న స్థానికులు తామిచ్చిన విరాళాన్ని అతని వద్ద నుంచి తిరిగి లాక్కోవడం కొసమెరుపు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement