రుస్తుం.. రెండున్నరేళ్లు!

Main person in the fake currency rocket case was arrested - Sakshi

2015 నుంచి పరారీలో... ఎట్టకేలకు పట్టుకున్న ఎన్‌ఐఏ

నకిలీ కరెన్సీ రాకెట్‌ కేసులో కీలక సూత్రధారి 

అసోం కేంద్రంగా సాగిన ఇతడి కార్యకలాపాలు 

సాక్షి, హైదరాబాద్‌: అసోం కేంద్రంగా సాగిన నకిలీ కరెన్సీ రాకెట్‌లో కీలక సూత్రధారిగా ఉన్న పశ్చిమ బెంగాల్‌ వాసి రుస్తుం ఎట్టకేలకు పట్టుబడ్డాడు. ఈ ముఠా గుట్టును డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ) అధికారులు 2015లో రట్టు చేశారు. రూ.5 లక్షల కరెన్సీతో వెళ్తున్న సద్దాం హోసేన్‌ను విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో పట్టుకున్నారు. అప్పటి నుంచి రుస్తుం వాంటెడ్‌గా మారాడు. ఈ కేసు డీఆర్‌ఐ నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)కు వచ్చింది. రెండున్నరేళ్ల పాటు వేటాడిన ఎన్‌ఐఏ హైదరాబాద్‌ యూనిట్‌ ఎట్టకేలకు రుస్తుంను మంగళవారం పట్టుకుంది.  

అసోం నుంచి ఇతర ప్రాంతాలకు.. 
నోట్ల రద్దు ముందు వరకు బంగ్లాదేశ్‌ మీదుగా భారత్‌లోకి వచ్చిన నకిలీ కరెన్సీని పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా సహా అనేక జిల్లాలకు చెందిన ముఠాలు దేశవ్యాప్తంగా సరఫరా చేస్తుండేవి. ఇక్కడ నిఘా ముమ్మరం కావడంతో అంతర్జాతీయ ముఠాలు పంథా మార్చాయి. బంగ్లాదేశ్‌తో సరిహద్దు కలిగిన మరో రాష్ట్రం అసోం కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో డీఆర్‌ఐ నిఘా ముమ్మరం చేయడంతో సద్దాం హోసేన్‌ వ్యవహారంపై ఉప్పందింది. 2015 సెప్టెంబర్‌లో విశాఖలో అతడిని అరెస్టు చేశారు.  

కమీషన్‌ పేరిట వల.. 
అసోంలోని మణిక్‌పూర్‌కు చెందిన హోసేన్‌ పదో తరగతితో చదువుకు స్వస్తి చెప్పాడు. నిరుద్యోగిగా ఉన్న ఇతడికి పశ్చిమబెంగాల్‌లోని మాల్దా జిల్లాకు చెందిన రుస్తుంతో పరిచయమైంది. ఫోన్‌ ద్వారా హోసేన్‌తో సంప్రదింపులు జరిపిన రుస్తుం.. తాను అందించే ఓ ప్యాకెట్‌ను బెంగళూరుకు చేరిస్తే రూ.10 వేల కమీషన్‌ ఇస్తానని వల వేశాడు. డబ్బుకు ఆశపడిన హోసేన్‌కు న్యూఫరాఖా రైల్వేస్టేషన్‌లో అమ్రుల్‌ ద్వారా ఓ ప్యాకెట్‌ అందించాడు. అందులో నకిలీ కరెన్సీ ఉందని, గువాహటి–బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌లో బెంగళూరు వెళ్లాలని ఆదేశించాడు. కరెన్సీని బెంగళూరులో ఎవరికి అందించాలనే విషయాన్ని హోసేన్‌కు చెప్పని రస్తుం.. అక్కడికి చేరుకున్నాక తనకు ఫోన్‌ చేయాలని, అప్పుడు ఎక్కడ, ఎవరికి ఇవ్వాలనేది చెప్తానంటూ రెండు ఫోన్‌ నంబర్లు ఇచ్చాడు. దీంతో రైలులో బెంగళూరు బయలుదేరిన హోసేన్‌ విశాఖలో డీఆర్‌ఐ అధికారులకు చిక్కాడు. ఇతడి నుంచి రూ.5.01 లక్షల విలువైన 803 నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.

రుస్తుం అసోంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ, నిరక్షరాస్యులైన యువతకు ఎరవేసి భారీ ఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు డీఆర్‌ఐ ఆధారాలు సేకరించింది. కేసు ప్రాధాన్యత దృష్ట్యా కేంద్ర హోంశాఖ ఎన్‌ఐఏకు బదిలీ చేసింది. రంగంలోకి దిగిన హైదరాబాద్‌ యూనిట్‌ ముమ్మరంగా గాలింపు చేపట్టింది. నోట్ల రద్దు తర్వాత రుస్తుం పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఇటీవల మళ్లీ మాల్దాలో అతడి కదలికలు ఉన్నట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. వారం పాటు వలపన్నిన ప్రత్యేక బృందం మంగళవారం అతడిని పట్టుకుంది. నకిలీ కరెన్సీ నెట్‌వర్క్‌ వివరాలు సేకరించి దాన్ని ఛేదించాలని భావిస్తున్న ఎన్‌ఐఏ.. దీనికోసం రుస్తుంను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకోవడానికి సన్నాహాలు చేస్తోంది.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top