పొంగి పొర్లింది!

Mahabubnagar Peoples Use To Alcohol  This Year - Sakshi

మహబూబ్‌నగర్‌ క్రైం : ఈ ఏడాది జిల్లాలో మద్యం ఏరులై పారింది. ఈ ఏడాది కాలానికి మద్యం దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులకు కాసుల పండింది. రెండేళ్ల కాలానికి వైన్స్‌ అనుమతులు ఇవ్వగా.. తాజాగా అసెంబ్లీ ఎన్నికలు జరగడంతో గతంలో ఎన్నడూ లేని విధం గా మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. దీంతో అటు ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూర గా.. వైన్స్‌ యాజమానులకు కూడా కాసుల పంట పండింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌  చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అమ్మకాలు జరగడం విశేషం. ఈ మేరకు ప్రస్తుత ఏడాదిలో మద్యం అమ్మ కాలు, ఎక్సైజ్‌ శాఖ పనితీరుపై ప్రత్యేక కథనం.

గత ఏడాది అక్టోబర్‌ నుంచి.. 
వైన్స్‌ల అనుమతులు గత ఏడాది అక్టోబరు 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ అనుమతులు 2019 సెప్టెంబర్‌ 30వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ క్రమంలో గత సెప్టెంబర్‌ నుంచి అసెంబ్లీ ఎన్నికల వాతావరణం మొదలు కావడంతో ‘ఆనవాయితీ’ ప్రకారం మద్యం పంపిణీ కోసం నేతలు కొనుగోళ్లలో నిమగ్నమయ్యారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తే ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన నాయకులు ముందుగానే మద్యం డంప్‌లు దించేశారు.

అటు వైన్స్‌ యాజమాన్యాలు కూడా ముందస్తుగా భారీగా మద్యం నిల్వలు దిగుమతి చేసుకున్నారు. ఇక ఎన్నికల వేళ అమ్మకాలు జోరుగా సాగాయి. ఈ మేరకు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలో రూ.1,100.10 కోట్ల విలువైన మద్యం విక్రయించారు. ఇక త్వరలోనే పంచాయతీ ఎన్నికలు, పార్లమెంట్‌ ఎన్నికలు రానుండడంతో కొత్త ఏడాదిలో కూడా మద్యం అమ్మకాలు భారీగా సాగే అవకాశముంది. 2019లో కూడా మద్యం అమ్మకాలు ఇదే స్థాయిలో కొనసాగితే అమ్మకాలు ఉంటే దీని విలువ ఉమ్మడి జిల్లా నుంచి 2018, 2019 ఏళ్లకు గాను రూ.2,300 కోట్లకు చేరే అవకాశముంది.

దుకాణాదారులకు కాసుల పంట 
ఈ దఫా లైసెన్స్‌ పొందిన వైన్స్‌ యజమానులకు అదృష్టం కలిసొచ్చినట్లే చెప్పాలి. ఏడాదికి రూ.45లక్షల లైసెన్స్‌ ఫీజుగా నిర్దేశించగా రెండేళ్ల కాలపరిమితికి రూ.90లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. లైసెన్స్‌ చెల్లించేందుకు కావాల్సిన నగదును యజమానులు కేవలం ఈ ఒక్క నవంబర్‌ నెలలో సంపాదించినట్లు చెబుతున్నారు. ఇక వచ్చే అక్టోబర్‌ 1వ వరకు ప్రస్తుత లైసెన్సుల కాలపరిమితి ఉంది. ఈ మేరకు త్వరలోనే పంచాయతీ ఎన్నికలు, పార్లమెంట్‌ ఎన్నికలు, ప్రాథమిక సహకార సంఘాలు(పీఏసీఎస్‌) ఎన్నికలే కాకుండా జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపాలిటీల ఎన్నికలు ఉండడంతో మద్యం అమ్మకాలు జోరుగా సాగడం.. వైన్స్‌ యాజమాన్యాలకు కాసుల వర్షం కురవడం ఖాయమని తెలుస్తోంది.

ఈ ఏడాది రికార్డులో ఆదాయం 
గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈ ఏడాది మద్యం అమ్మకాల ద్వారా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా రికార్డు స్థాయిలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. గతంలో జిల్లాలో రూ.800కోట్ల నుంచి రూ.900కోట్ల వరకు అమ్మకాలు సాగేవి. కానీ ఈ ఏడాది ఏకంగా రూ.1,100.10 కోట్ల మేర అమ్మకాలు జరిగాయి. 2015 అక్టోబర్‌ నుంచి 2016 సెప్టెంబర్‌ వరకు ఉమ్మడి జిల్లాలో రూ.872.93 కోట్ల విలువైన అమ్మకాలు సాగగా, 2016 అక్టోబర్‌ నుంచి 2017 అక్టోబర్‌ వరకు రూ.959.16 కోట్ల అమ్మకాలు జరిగాయి. జిల్లాలో 2016 కంటే 2017 ఏడాదిలో అమ్మకాలు పెరగగా.. ఈ ఏడాది ఇది మరింత పెరగడం గమనార్హం. 

ఉన్నతాధికారుల మన్ననలు 
2018లో జిల్లాలో ఎక్సైజ్, ప్రొహిబిషన్‌ శాఖ ఉద్యోగుల పనితీరు ఉన్నతాధికారుల మన్ననలు అందుకుంది. ఈ ఏడాది ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన 100రోజుల యాక్షన్‌ ప్లాన్‌ను జిల్లా అధికారు విజయవంతంగా అమలు చేశారు. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఆబ్కారీ శాఖకు అవసరమైన సిబ్బంది లేకపోయినా.. ఎక్కడ కూడా సమస్య తలెత్తకుండా విధులు నిర్వర్తించారు. పక్కా ప్రణాళికతో విధులు నిర్వర్తించడం ద్వారా అక్రమ మద్యం సరఫరాను అడ్డుకోవడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా నిల్వ చేసిన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

స్వాధీనం చేసుకున్న మద్యంతో ఎక్సైజ్‌ పోలీసులు (ఫైల్‌)  

ఏడాది మొత్తం కష్టపడ్డాం 
ఈ ఏడాది కాలంలో మొత్తం ఎన్నడూ లేని విధంగా కష్టపడ్డాం. ఇదే ఏడాదిలో వంద రోజుల ప్రణాళిక, అసెంబ్లీ ఎన్నికలు రావడం వల్ల ప్రణాళికాయుతంగా విధులు నిర్వర్తించాం. దీంతో మంచి ఫలితాలు వచ్చాయి. మా పనితీరును కమిషనర్‌ అభినందించారు. ఎన్నికల సందర్భంగా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం రాకుండా అడ్డుకున్నాం.  24గంటల పాటు మా శాఖ ఉద్యోగులు ప్రతి ఒక్కరు సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు. – జయసేనారెడ్డి, డీసీ, ఉమ్మడి మహబూబ్‌నగర్‌  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top