ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

Lovers Suicide Attempt In Suryapet - Sakshi

పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో పురుగుల మందు తాగిన ప్రేమికులు

పేట ఏరియా ఆస్పత్రికి తరలింపు

సాక్షి, సూర్యాపేట: వారిద్దరిదీ ఒక్కటే ఊరు.. ఇద్దరి మనస్సులు కలిశాయి. మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వివాహం చేసుకుందామంటే కులాలు వేరు కావడంతో పెద్దలు ఒప్పకోలేదు. ప్రియురాలి తల్లిదండ్రులు వేరే యువకుడితో ఆమెకు వివాహం చేశారు. అయినా ప్రియుడు మాత్రం ఆమెనే పెళ్లి చేసుకుంటానని తరుచూ ఫోన్‌ చేయసాగాడు. ప్రియురాలికి ఫోన్‌ అందుబాటులో లేకుండా చేసినా ఆమె భర్తకే ఫోన్‌ చేశాడు. తామిద్దరం ప్రేమించుకుంటున్నామని చెప్పాడు. వారిద్దరు కలిసి తిరిగిన ఫొటోలు సైతం పంపించాడు. దీంతో భర్త ఆమెను తల్లిదండ్రుల వద్దకు పంపించాడు.

పెద్ద మనుషుల సమక్షంలో సోమవారం వివాహం చేసుకునేందుకు ప్రియుడు, ప్రియురాలు ఒప్పకున్నారు. వివాహనికి అంతా సిద్ధమైంది. మరికొద్ది సమయంలో పెళ్లి జరుగుతుందనుకున్న తరుణంలో ప్రియుడి తల్లిదండ్రులు వారి వివాహానికి ఒప్పుకోలేదు. దీంతో ప్రేమికులిద్దరూ కలిసి పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించారు. ఈ సంఘటన సోమవారం సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. టేకుమట్ల గ్రామానికి చెందిన వెలిజర్ల సైదులు సావిత్రమ్మ కుమారుడు సతీష్, దామెర్ల ముత్తయ్య మరియమ్మ కూతురు సరిత మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు.

వెలిజర్ల సతీష్‌ కుమ్మరి సామాజిక తరగతికి చెందిన యువకుడు. సరిత దళిత కుటుంబానికి చెందిన యువతి. సరితను పెళ్లి చేసుకుంటానని ఒప్పించి సతీష్‌ శారీరకంగా లోబర్చుకున్నాడు. తనను పెళ్లి చేసుకోమని సరిత జనవరి నెలలో సతీష్‌ను నిలదీసింది. ‘మా అమ్మ ఒప్పుకోవడం లేదని నిన్ను పెళ్లి చేసుకుంటే చనిపోతానంటోంది’ అని సతీష్‌ పెళ్లికి నిరాకరించాడు. ఈ క్రమంలో సరితకు మార్చి 31న చివ్వెంల మండలం బీబీగూడేనికి చెందిన పడిదల కిరణ్‌కుమార్‌తో వివాహం జరిపించారు. పెళ్లి కూతురును చేసే రోజే తానే వివాహం చేసుకుంటానంటూ సరిత ఇంటి వద్దకు వెళ్లి అతడు ఆందోళన చేశాడు. పెళ్లిని అడ్డుకుంటే తగిన పరిణామాలు తప్పవని సరిత బంధువులు హెచ్చరించడంతో వెనక్కితగ్గాడు.

వివాహం జరిగాక ఫోన్‌లో వేధింపులు..
సరిత వివాహం జరిగాక సతీష్‌ తరుచూ ఆమెకు ఫోన్‌ చేసి వేధిస్తుండేవాడు. తాను పెళ్లి చేసుకుంటానని టేకుమట్ల గ్రామానికి రమ్మని చెబుతూ ఫోన్‌ చేసేవాడు. ఈ క్రమంలో సరిత బంధువులు విషయం తెలుసుకుని ఆమెకు ఫోన్‌ అందుబాటులో లేకుండా చేశారు. దీంతో సరిత భర్త కిరణ్‌కుమార్‌కు ఫోన్‌ చేసి చెల్లెకు ఫోన్‌ ఇవ్వమని చెప్పగా సరితకు ఫోన్‌ ఇవ్వగానే గ్రామానికి రమ్మని ఫోన్‌లో మాట్లాడేవాడు. లేకపోతే ఇద్దరం కలిసి ఉన్న ఫొటోలు నీ భర్తకు పంపుతానని భయపెడుతూ ఉండేవాడు.

విడాకులు ఇప్పించి పెళ్లికి సిద్ధమైన సతీష్‌..
ఇటీవల కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు సూర్యాపేట తహసీల్దార్‌ కార్యాలయానికి సరిత తన భర్త కిరణ్‌కుమార్‌తో కలిసి రాగా విషయం తెలుసుకున్న సతీష్‌ అక్కడికి చేరుకున్నాడు. చెల్లెను ఇంటికి తీసుకెళ్తానని చెప్పి బైక్‌ మీద తీసుకెళ్లాడు. గ్రామంలోకి వెళ్లాక సరితతో తాను దిగిన ఫొటోలు ఆమె భర్తకు వాట్సాప్‌ చేశాడు. ఫొటోలు చూసిన సరిత భర్త కిరణ్‌కుమార్‌ తనకు సరిత వద్దని చెప్పడంతో పెద్ద మనుషుల సమక్షంలో విడాకులు అయ్యాయి. ఆ తర్వాత సరితను పెళ్లి చేసుకుంటానని సతీష్‌ ఒప్పుకున్నాడు.

పెళ్లికి సిద్ధమైన రోజునే..
టేకుమట్లలోని గీతా భవనంలో సోమవారం పెళ్లి చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. ఆదివారం నూతన వస్త్రాలు తెచ్చుకుని పెళ్లికి సంబంధించిన సామగ్రి సిద్ధం చేసుకున్నారు. సోమవారం ఉదయం సతీష్‌ తన తల్లిని పెళ్లికి రావాలని చెప్పాడు. పెళ్లికి రానని, పెళ్లి అయ్యాక ఇంట్లోకి కూడా రావద్దని తల్లి చెప్పింది. దీంతో అప్పటికే తెచ్చుకున్న పురుగుల మందును సతీష్, సరిత తాగారు. గమనించిన స్థానికులు, బంధువులు ఇద్దరిని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరు చికిత్స పొందుతున్నారు.

వాంగ్మూలం సేకరించిన జడ్జి..
ప్రేమికులు ఇద్దరు పురుగుమందు తాగిన విషయాన్ని తెలుసుకున్న ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీకాంత్‌బాబు సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి చేరుకొని సతీష్, సరిత నుంచి వాంగ్మూలం తీసుకున్నట్లు సూర్యాపేటరూరల్‌ ఎస్‌ఐ శ్రీనివాస్‌ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top