నిమ్మకాయలతో గుప్త నిధులట!

Lemon Gang Arrest in Chittoor - Sakshi

ముఠా రసం పిండిన పోలీసులు

ప్రజలను మోసగిస్తున్నట్టు దర్యాప్తులో వెల్లడి

రోడ్లల్లో ఎక్కడైనా కట్‌ చేసి, కుంకుమ పెట్టి పడేసిన నిమ్మకాయలను చూస్తే జనాలకు ఒకింత భయమే. తమకు కీడు జరుగుందనే భయంతో వాటిని దాటేందుకు కూడా సాహసించక, పక్కగుండా వెళ్లిపోతుంటారు. సరిగ్గా ఈ  పాయింటే పట్టుకుని ‘మంత్రించిన నిమ్మకాయలు..మహిమ గల నిమ్మకాయలు ’ పేరిట ప్రజల జేబులకు చిల్లు పెట్టారు. చివరకు పోలీసులు వారికి చెక్‌ పెట్టారు.

చిత్తూరు, శాంతిపురం: మహిమలు గల నిమ్మకాయల పేరిట అమాయక జనం రసం పిండిన అంతర్రాష్ట్ర ముఠాను రాళ్లబూదుగూరు పోలీసులు పట్టుకున్నారు. కుప్పం సీఐ కృష్ణమోహన్, రాళ్లబూదుగూరు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు  మీడియాకు తెలిపిన వివరాలు.. గురువారం తెల్లవారుజామున నంజంపేట శివార్లలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఏడుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారణ చేస్తే మహిమ గల నిమ్మకాయలంటూ ప్రజలకు అంటగట్టి, మోసగిస్తున్నట్టు తేలింది. ఈ నిమ్మకాయల్లోకి ఇనుప వస్తువులు గుచ్చితే అవి వంగిపోతాయని ప్రయోగపూర్వకంగా చూపి జనాన్ని ఆకర్షిస్తున్నట్టు ప్రాథమిక విచారణలో నిందితులు వెల్లడించారు. అంతేకాకుండా ఈ నిమ్మకాయను కలిగి ఉన్న వారికి గుప్తనిధులు దొరుకుతాయని ప్రచారం చేస్తూ జనాన్ని బోల్తా కొట్టించారు.

సిబ్బందికి రివార్డు అందజేస్తున్న సీఐ కృష్ణమోహన్‌
వీళ్ల మాయమాటలు నమ్మి నిమ్మకాయలు పుచ్చుకుని పలువురు డబ్బులు భారీ మొత్తంలో ఇచ్చి మోసపోయారు. అయితే, తీరా నిమ్మకాయల్లో రసం తప్పితే మహిమలేమీ లేవని జ్ఞానోదయమయ్యేసరికి ఇక  పరువు పోతుందని కిమ్మనకుండా ఉండిపోయారు. నిమ్మకాయల ముఠా సమాచారం పోలీసుల చెవిన పడడంతో ఎట్టకేలకు ఏడుగురిని పట్టుకున్నారు. ప్రాథమిక విచారణలో బెంగళూరుకు చెందిన బాషా, బంగారుపేట ప్రాంతానికి చెందిన రమేష్, మూర్తితో పాటు కుప్పం మండలానికి చెందిన మునిరత్నం, శాంతిపురం మండలానికి చెందిన జయరాం, హరీష్‌కుమార్, రవీంద్ర అని తేలింది. వారి నుంచి నిమ్మకాయలూ స్వాధీనం చేసుకున్నారు. వాళ్ల రసం పిండారు. ఈ కేసుకు సంబంధించి వీరిని శాంతిపురం తహసీల్దారు ఎదుట హాజరు పరచి బైండోవర్‌ చేశారు. నిమ్మకాయల ముఠా బాధితులు ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే విచారణ చేసి న్యాయం జరిగేలా చూస్తామని పోలీసు అధికారులు భరోసా ఇచ్చారు. నిమ్మకాయల ముఠా భరతం పట్టిన సిబ్బందికి రివార్డును అందజేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top