చాకుతో కోసి.. ఆపై గొంతును..!

Lady Pharmacist murdered in few days ago in Bhubaneswar - Sakshi

మహిళా ఫార్మసిస్టుది హత్యే

గొంతుకోసిన బాయ్‌ఫ్రెండ్‌

స్పష్టం చేసిన పోలీసు కమిషనర్‌

నిందితుడి అరెస్ట్‌

భువనేశ్వర్‌: మహిళా ఫార్మసిస్టు అనుమానాస్పద మృతి కేసును హత్య కేసుగా పోలీసులు నిర్ధారించారు. ఈ సంఘటనలో ప్రమేయమున్న ప్రధాన నిందితుని పోలీసులు అరెస్టు చేశారు. సుమారు వారం రోజుల కిందట ఓ మహిళా ఫార్మసిస్టు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంగతి తెలిసిందే. స్థానిక ఇన్‌ఫో సిటీ పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.  

దర్యాప్తు అనంతరం అనుమానాస్పద మృతిని హత్యగా జంట నగరాల పోలీసు కమిషనర్‌ బహిరంగపరిచారు. పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కేసులో ప్రద్యుమ్న ఫరిడా (36)అనే వ్యక్తిని ప్రధాన నిందితునిగా పేర్కొన్నారు. నిందితుని మొబైల్‌ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుని కోర్టుకు తరలించినట్లు పోలీసు కమిషనర్‌ వై.బి. ఖురానియా తెలిపారు.

ప్రేమ వ్యవహారమే హత్యకు కారణం
మహిళా ఫార్మసిస్టు హసీనా దాస్‌(19), ప్రద్యుమ్న ఫరిడా మధ్య ప్రేమ వ్యవహారం సాగింది.  లోగడ స్థానిక కళింగ ఆస్పత్రిలో సిబ్బందిగా పని చేస్తున్నప్పుడు వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. హసీనా దాస్‌ జగత్‌సింగ్‌పూర్‌ జిల్లా ఎరసమా నుంచి వచ్చింది. ప్రద్యుమ్న మయూర్‌భంజ్‌ జిల్లా వాసి. నెల రోజుల కిందట హసీనా దాస్‌ కళింగ ఆస్పత్రిలో ఉద్యోగం వీడి స్థానిక అపోలో డయాగ్నొగ్నస్టిక్‌ సెంటర్‌లో చేరింది.

ప్రద్యుమ్న ఫరిడా కూడా ఇక్కడ ఉద్యోగం వీడి కటక్‌లోని ఓ నర్సింగ్‌ హోమ్‌లో చేరాడు. ఇంతలో ప్రద్యుమ్న ఫరిడాకు వివాహమైందని హసీనాకు తెలిసింది. దీంతో ఆయనతో సంబంధాలకు తెరదించేందుకు ఆమె నిర్ణయించుకుని   ఫోన్‌ చేస్తే మాట్లాడకుండా హసీనా నిరాకరించింది. ఈ వ్యవహారంతో తన ప్రియురాలు  వేరొకరితో సంబంధాల్ని బలపరచుకుని తనను నిర్లక్ష్యం చేస్తోందనే అనుమానంతో  ప్రద్యుమ్న దాడికి సిద్ధమయ్యాడు.

చాకుతో కోసి.. గొంతు అదిమి
నగరంలో ఆమె ఉంటున్న కానన్‌ విహార్‌లోని ఇంటికి గత నెల 25వ తేదీన వెళ్లాడు. దసరా సెలవులు కావడంతో ఇరుగు పొరుగు వారంతా వేరే ప్రాంతాలకు వెళ్లడం, హసీనా దాస్‌తో ఉంటున్న మిత్రురాలు కూడా ఊరికి వెళ్లడం ప్రద్యుమ్నకు కలిసివచ్చింది. ఏకాంతంలో హసీనాతో జరిగిన వాగ్యుద్ధం తీవ్ర పరిణామాలకు దారితీసింది. అదుపుతప్పిన ప్రద్యుమ్న వంట గదిలో ఉన్న చాకు తీసుకుని హసీనా గొంతు కోశాడు. ఆమె గిలగిలా కొట్టుకుంటూ కేకలు వేసే తరుణంలో నోరు మెదపకుండా  తలగడతో గొంతు అదిమి  ప్రాణాల్ని బలిగొన్నాడు. హసీనా మృతదేహానికి పోస్ట్‌మార్టం అనంతరం నివేదిక ఆధారంగా ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నివేదికలో గొంతు కోత, అదిమివేత ఛాయల్ని గుర్తించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top