స్నేహితురాలే కాజేసింది...

Jewellery Stolen Friend home   - Sakshi

అపహరణకు గురైన బంగారపు వస్తువులు స్వాధీనం

గుడివాడటౌన్‌: ఇంట్లోని బంగారు ఆభరణాలు స్నేహితురాలే కాజేసిన సంఘటన పట్టణంలో జరిగింది. స్థానిక బేతవోలుకు చెందిన సమ్మెట మాధవరావు ఇంట్లో గత నెల 11వ తేదీ గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో ప్రవేశించి బంగారు నగలు అపహరించుకుపోయిన విషయం విదితమే. మాయమైన నగలు మాధవరావు భార్య నాగ లీలావతి స్నేహితురాలు బండి నాగ త్రివేణి అపహరించినట్లు శుక్రవారం పోలీసులు తెలిపారు. స్థానిక వన్‌ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సమక్షంలో నిందితురాలిని చూపారు. ఎస్పీ త్రిపాఠి మాట్లాడుతూ నాగ త్రివేణి, నాగ లీలావతికి మంచి స్నేహితురాలు. దూరపు బంధువు కూడా. త్రివేణి భర్త నాగరాజుతో కలసి హైదరాబాద్‌ చింతల్‌లో నివాసం ఉంటుంది. గత నెల 10వ తేదీన నాగ లీలావతిని పరామర్శించేందుకు బేతవోలులోని ఆమె ఇంటికి వచ్చింది. ఆ సమయంలో తాను కొనుగోలు చేసిన బంగారు ఆభరణాలు త్రివేణికి చూపింది.

అక్కడే ఉన్న ఇంటి తాళాలను స్నేహితురాలికి అనుమానం రాకుండా తీసి బయటకు వెళ్లి అలాంటిదే మరో తాళం చేయించుకుని తిరిగి వాటిని యథాస్థితిలో పెట్టేసింది. 11వ తేదీ మాధవరావు దంపతులు విజయవాడలో చదువుచున్న తన కుమారుని వద్దకు వెళుతున్నట్లు చెప్పారు. మాధవరావు కుటుంబసభ్యులు విజయవాడ వెళ్లారని నిర్ధారించుకుని గత నెల 11వ తేదీన దొంగ తాళంతో ఇంట్లోకి వెళ్లి బీరువా తెరచి అందులోని రూ 20లక్షలు విలువగల 24 రకాల ఆభరణాలను అపహరించింది. అనంతరం కుటుంబ అవసరాల నిమిత్తం బంగారం కుదువపెట్టేందుకు మాధవరావు బీరువా తెరువగా అందులో నగలు కనిపించలేదు. దీనిపై మాధవరావు వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వన్‌టౌన్‌ సీఐ డీవీ రమణ బృందం దర్యాప్తు చేపట్టింది. ఈనెల 8వ తేదీ సాయంత్రం గుడివాడలోని ఓ బంగారు నగల దుకాణంలో దొంగిలించిన వస్తువులు అమ్మడానికి త్రివేణి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని స్వాధీనపర్చుకున్నారు. మొత్తం బంగారం 448.88 గ్రాములుగా గుర్తించినట్లు ఎస్పీ త్రిపాఠి వివరించారు. కార్యక్రమంలో డీఎస్పీ మహేష్, స్టేషన్‌ ఆఫీసర్‌ డి.వి.రమణ, ఏఎస్సై స్వామిదాసు, సిబ్బంది శ్రీనివాసరావు, షణ్ముఖబాబు, నాయక్, జయకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top