
ఇది సినిమా కథలో మాదిరిగానే ఉంటుంది. పల్లెలో పొట్టకూటికోసం కష్టపడిన వ్యక్తి ...
సాక్షి, బెంగళూరు : ఇది సినిమా కథలో మాదిరిగానే ఉంటుంది. పల్లెలో పొట్టకూటికోసం కష్టపడిన వ్యక్తి నగరానికి చేరి అనతికాలంలోనే కోట్లకు అధిపతి అవుతుంటాడు. వేలాది కోట్ల ఐఎంఏ గ్రూప్ కుంభకోణం కేసులో అరెస్టయిన అయిన బీబీఎంపీ నామినేటెడ్ కార్పొరేటర్ ముజాహిదీన్ వెనుక ఆసక్తికరమైన చరిత్ర వెలుగులోకి వస్తోంది. ఈయన గతంలో పూట గడవడానికి భద్రావతిలో కర్చీఫ్‌లు అమ్ముకుని జీవించేవాడని ప్రత్యేక తనిఖీ బృందం (ఎస్‌ఐటీ) అధికారుల విచారణలో వెలుగుచూసింది. అలాంటి ముజాహిదీన్ 2001–02లో నగరానికి వచ్చి ఫ్రేజర్ టౌన్ వద్ద సెప్పింగ్ రోడ్డులో టీ దుకాణం ప్రారంభించాడు. దుకాణానికి వచ్చే రియల్ ఎస్టేట్ వ్యాపారుల పరిచయం చేసుకొని తానూ అందులో అడుగుపెట్టాడు. రియల్ ఎస్టేట్ లావాదేవీలు విస్తరించడంతో రాజకీయ నాయకుల పరిచయాలు పెంచుకొన్నాడు. అలా 2010 బీబీఎంపీ ఎన్నికల్లో జేడీఎస్ నుంచి పోటీచేసి కాంగ్రెస్ కార్పొరేటర్ షకీల్ అహమ్మద్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తరువాత ఐఎంఏ అధినేత మన్సూర్‌ఖాన్‌తో పరిచయాలను పెంచుకొన్నాడు. అతనికి పరిచయం ఉన్న పెద్ద పెద్ద నాయకులు, వ్యాపారుల ద్వారా ఐఎంఏలో పెద్దమొత్తాల్లో డిపాజిట్లు చేయించినట్లు సిట్ తనిఖీల్లో ద్వారా తెలిసింది.
భూకబ్జాలు, రౌడీషీట్
రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న సమయంలో మోసాలు, బలవంతపు వసూళ్లు, భూ కబ్జా కేసులు ఇతనిపై నమోదయ్యాయి. దీంతో పులకేశీనగర పోలీసు స్టేషన్‌లో ముజాహిదీన్‌పై రౌడీషీట్ తెరిచారు. పేదల భూములను కబ్జా చేసిన కేసులో బాణసవాడి, హెణ్ణూరు, భారతీనగర, శివాజీనగర, పులికేశీనగర పోలీసు స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. పోలీసు స్టేషన్‌లో తుపాకీ చూపించి పోలీసులను బెదరించి జైలుకు సైతం వెళ్లివచ్చాడు. ఆ తరువాత ఎలాగో కేసుల నుంచి బయటపడ్డాడు, ఇటీవల అతనిపై రౌడీషీట్‌ను కూడా తొలగించారు. ముజాహిదీన్ కోట్లాది రూపాయల ఆస్తులు సంపాదించాడని, 100 బ్యాంకుల ఖాతాలు కలిగిఉన్నట్లు బయటపడింది. మన్సూర్‌ఖాన్ పరారైన ముందు రోజు జూన్ 6 నుంచి 8 వరకు ఇతడు మన్సూర్‌తో పాటు ఇద్దరు మంత్రులతో 27 సార్లు ఫోన్‌లో మాట్లాడినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. ముజాహిదీన్ వ్యవహారాలపై సిట్ కూపీ లాగుతోంది.