కారు విడిభాగంలో బంగారం

Gold in the car spare part - Sakshi

షార్జా నుంచి తీసుకువచ్చిన హరియాణా వాసి

అనుమానంతో అదుపులోకి తీసుకున్న కస్టమ్స్‌ అధికారులు

స్మగ్లింగ్‌ చేస్తున్న 2.3 కేజీల బంగారం స్వాధీనం 

సాక్షి, హైదరాబాద్‌: షార్జాకు విహారయాత్రకు వెళ్లిన ఓ హరియాణా వాసి తనతోపాటు కారు ఇంజిన్‌ విడిభాగం తీసుకువస్తూ కస్టమ్స్‌ అధికారుల కళ్లలో పడ్డాడు. అతడిని అదుపులోకి తీసుకుని పూర్తిస్థాయిలో తనిఖీలు చేయగా రూ.80 లక్షల విలువైన 2.3 కేజీల బంగారం బయటపడింది. శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం ఈ స్మగ్లింగ్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.  

క్యామ్‌షాఫ్ట్‌లో కరిగించిన బంగారం 
హరియాణాకు చెందిన ఓ యువకుడు కొన్నాళ్లుగా ఢిల్లీలో పనిచేస్తున్నాడు. ఢిల్లీ కేంద్రంగా వ్యవస్థీకృ తంగా స్మగ్లింగ్‌ వ్యవహారాలు నడుపుతున్న ఓ గ్యాంగ్‌ ఇతడిని ట్రాప్‌ చేసింది. షార్జాకు రానుపోను టికెట్లు, కొంత కమీషన్‌ ఇస్తామంటూ ఆశ చూపి బంగారం అక్రమ రవాణా చేయడానికి క్యారియర్‌గా మార్చింది. దీనికి అంగీకరించిన అతడు 5 రోజుల క్రితం టూరిస్ట్‌ వీసాపై ఢిల్లీ నుంచి షార్జా వెళ్లాడు. అక్కడి వ్యక్తులు కారు ఇంజిన్‌లో ఉండే క్యామ్‌షాఫ్ట్‌ అనే విడిభాగంలో అమర్చి అందించిన బంగారాన్ని తీసుకువచ్చిహైదరాబాద్‌లో డెలివరీ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. ఉక్కుతో తయారై ఉండే క్యామ్‌షాఫ్ట్‌ లోపలి భాగం డొల్లగా ఉంటుంది. దీంతో దీన్ని ఓ చివర చాకచక్యంగా ఓపెన్‌ చేసిన సూత్రధారులు అందులో కరిగించిన 2.3 కేజీల బంగారం పోశారు. ఎవరికీ అనుమానం రాకుండా దీన్ని మళ్లీ సీల్‌ వేసిన ట్లు అతికించేశారు.

ఈ క్యామ్‌షాఫ్ట్‌ను చెకిన్‌ బ్యాగేజ్‌ లో వేసిన హరియాణావాసి ఆదివారం ఉదయం హైదరాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నాడు. విమానం దిగిన హరియాణా వాసి తన బ్యాగేజ్‌ కలెక్ట్‌ చేసుకుని బయటకు వచ్చేందుకు ప్రయత్నించాడు. అతడి లగేజ్‌ను స్కాన్‌ చేసిన కస్టమ్స్‌ అధికారులు అందులో ఉన్న క్యామ్‌ షాఫ్ట్‌ను గుర్తించారు. దాని విషయం ఆరాతీయగా తనకు హరియాణాలో ఓ కారు ఉందని, దాని మరమ్మతు నిమిత్తం ఈ విడిభాగం అవసరమైందని పేర్కొన్నాడు. అనుకోకుండా విహారయాత్రకు షార్జా వెళ్లిన తాను అక్కడి ఈ క్యామ్‌షాఫ్ట్‌ రేటు ఆరా తీశానని, ఇక్కడి కంటే దాదాపు రూ.8 వేలు తక్కువ ధర ఉండటంతో ఖరీదు చేసుకుని వచ్చానని చెప్పాడు. దీంతో దానికి సంబంధించిన బిల్లు చూపించాలంటూ కస్టమ్స్‌ అధికారులు ప్రశ్నించారు. విదేశాల్లోని దుకాణాలు కచ్చితంగా కంప్యూటర్‌ జనరేటెడ్‌ బిల్లు ఇస్తారు. అయితే ఇతగాడు మాత్రం చేతిరాతతో ఉన్న ఓ బిల్లు చూపించాడు. దీంతో అనుమానం బలపడిన కస్టమ్స్‌ అధికారులు వాహనం నంబర్‌ చెప్పాలని కోరారు.

అతడు చెప్పిన నంబర్‌ను హరియాణా రవాణా శాఖలో ఆరా తీయగా అది కారుది కాదని, ఓ ద్విచక్రవాహనానిదని తేలింది. దీంతో ఏదో మతలబు ఉందని అనుమానించిన కస్టమ్స్‌ అధికారులు క్యామ్‌షాఫ్ట్‌ను పగులకొట్టి చూడగా అందులో గడ్డ కట్టి ఉన్న బంగారం కనిపించింది. కరిగించి బయటకు తీయగా 2.3 కేజీల బరువుంది. హరియాణా వాసిని అదుపులోకి తీసుకున్న అధికారులు వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. ఈ స్మగ్లింగ్‌తో సంబంధం ఉన్న ఢిల్లీ, హైదరాబాద్‌ వాసుల కోసం ఆరా తీస్తున్నారు. ప్రాథమిక ఆధారాలను బట్టి ఇదో వ్యవస్థీకృత ముఠాగా కస్టమ్స్‌ అధికారులు భావిస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top