అమ్మమ్మ ఇంటికి వెళ్తుండగా...

Girl Drowns  Pool Died In Warangal - Sakshi

యాదగిరిగుట్ట(ఆలేరు) : వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో అమ్మమ్మ ఇంటికి బయల్దేరిన ఓబాలిక మృత్యువు ఒడిలోకి వెళ్లింది. ఈ విషాద ఘటన యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం చొల్లేరు గ్రామంలో శుక్రవారం ఆలస్యం గా వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులు, పోలీసులు కథనం ప్రకారం... వరంగల్‌ జిల్లా కేంద్రానికి చెందిన కామిటికార్‌ మమత, నర్సోజీ దంపతుల కూతురు సోని(15) ఇటీవల పదోతరగతి పూర్తిచేసింది. శుక్రవారం మృగశిర, రెండో శనివారం, ఆదివారం వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో చొల్లేరులో ఉండే అమ్మమ్మ ఇంటికి వెళ్లేందుకు సిద్ధమైంది. మేనమామ ప్రకాశ్‌కు ఫోన్‌చేసి వస్తున్నానని చెప్పడంతో రమ్మన్నాడు.

దీంతో సోని గురువారం మధ్యాహ్నం వరంగల్‌ నుంచి వచ్చే పుష్‌పుల్‌ రైలు ఎక్కి వంగపల్లి రైల్వేస్టేషన్‌లో 4గంటలకు దిగింది. వెంటనే మేనమామకు తన సెల్‌ నుంచి కాల్‌ చేసినా లిఫ్ట్‌ చేయలేదు. దీంతో వంగపల్లి నుంచి మర్రిగూడెం వరకు ఆటోలో వెళ్లి, గ్రామానికి కాలినడకన బయల్దేరింది. గ్రామానికి వాగులో నుంచి పిల్లబాటలో నడుస్తోంది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులో నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో వాగులో సుమారు 10 ఫీట్ల లోతు ఉన్న గుంతలో సోని పడిపోయింది.

రాత్రంతా వెతుకులాట..

బాలిక రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో సోని అమ్మమ్మ రాధాబాయ్, తాత నర్సోజీ తన కొడుకు ప్రకాష్‌కు సమాచారం అందించారు. దీంతో ప్రకాష్‌ తన సెల్‌ఫోన్‌ నుంచి సోనికి పలుమార్లు ఫోన్‌చేశాడు. ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ అని వచ్చింది. దీంతో చొల్లేరు, మర్రిగూడెం, వంగపల్లి రైల్వేస్టేషన్‌ ప్రాంతాల్లో రాత్రంతా వెతికాదు. ఎక్కడా కనిపించకపోవడంతో సోని తల్లిదండ్రులకు ఫోన్‌చేశాడు. అక్కడ కూడా లేదని చెప్పడంతో పలు ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేదు.

రైతు చూడడంతో..

గ్రామానికి చెందిన రైతు గంధమల్ల గాలయ్య శుక్రవారం ఉదయం 11గంటల ప్రాంతంలో తన వ్యవసాయ బావి వద్దకు వాగు గుండా ఉన్న పిల్లబాటలో నుంచి వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే బాట పక్కనున్న గుంతలో బాలిక శవం తేలి కనిపించగా గ్రామస్తులకు తెలియజేశాడు. అక్కడికి వెళ్లిన ప్రకాష్‌ తన మేనకోడలే అని గుర్తించాడు. మేనమామ, మనమరాలిని చూసి అమ్మమ్మ, తాతయ్య కన్నీరు మున్నీరయ్యారు.

ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులతో పాటు యాదగిరిగుట్ట పోలీసులకు తెలియజేశారు. ఘటనా స్థలికి చేరుకున్న ఎస్సై–3 సాయినాథ్‌ వివరాలు సేకరించి, శవ పంచనామా చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. మృతదేహాన్ని పోస్టుమాస్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. 

సోని మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబసభ్యులు 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top