రిమ్స్‌లో ఉద్రిక్తత

Girl Died By Snake Bite  - Sakshi

పాముకాటుకు గురైన బాలికకు వైద్యం అందక మృతి

డ్యూటీ వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బాధితుల ఆరోపణ

ఆస్పత్రి వద్ద ఆందోళన ∙వైద్యులతో వాగ్వాదం

సంఘటనపై సీఎస్‌ఆర్‌ఎంవోకు, పోలీసులకు ఫిర్యాదు

శ్రీకాకుళం సిటీ : పాముకాటుకు గురైన చిన్నారికి సకాలంలో వైద్యం అందించడంలో వైఫల్యం కారణంగా ఆ చిన్నారి మృతిచెందడం సంచలనం కలిగించింది. ఈ సంఘటన శ్రీకాకుళం రిమ్స్‌లో చోటుచేసుకుంది. తమ కుమార్తె మరణానికి రిమ్స్‌ వైద్యులే బాధ్యత వహించాలని బాధితులు ఆందోళనకు దిగారు. వైద్య సిబ్బంది తీరుకు నిరసనగా చిన్నపిల్లల విభాగం వద్ద ఆందోళన చేశారు.

చిన్నపిల్లల విభాగంలో డ్యూటీ వైద్యుడు రిమ్స్‌కు రావాలని పట్టుబట్టారు. అక్కడే బైఠాయించారు. రాత్రి 9 గంటల వరకు బాధితుల ఆందోళన రిమ్స్‌ వద్ద కొనసాగింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు...

గార మండలంలో సాలిహుండంకు చెందిన దుబ్బక రమణ, రోషిణీలకు జోషిక, తనీష్‌ íఅనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. రమణ కేబుల్‌టీవీ పనులు చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. సోమవారం ఉదయం 10.30 గంటల సమయంలో రమణ ఇంట్లోకి గోధుమరంగు నాగుపాము ప్రవేశించింది.

ఇంట్లో ఆడుకుంటున్న మూడున్నరేళ్ల జోషిక ఎడమకాలికి కరిచింది. పాము కరిచిన విషయాన్ని జోషిక కుటుంబసభ్యులకు చెప్పింది. దీంతో జోషికకు గారలో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు మెరుగైన వైద్యసేవల కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తీసుకెళ్లాలని సూచించారు. అయితే 108కు ఫోన్‌ చేయగా స్పందించకపోవడంతో ఆటో సహాయంతో చిన్నారిని రిమ్స్‌కు తీసుకువచ్చారు. 

రిమ్స్‌లో ఏమి జరిగిందంటే...

రిమ్స్‌ ఆస్పత్రికి మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో జోషికను తీసుకువచ్చారు. అక్కడ చిన్నారిని పరీక్షించిన వైద్యులు చిన్నపిల్లల విభాగంలో డ్యూటీ వైద్యులకు సమాచారం అందించారు. చిన్నారిని చిన్నపిల్లల విభాగంలో ఐసీయూ యూనిట్‌లో చేర్పించాల్సిందిగా అత్యవసర విభాగం వైద్యులు సూచించారు.

అయితే డ్యూటీలో ఉండాల్సిన వైద్యులు సకాలంలో వైద్యసేవలు అందించడంలో వైఫల్యం వల్లే తమ కుమార్తె జోషిక మృతిచెందిందని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. జూనియర్‌ వైద్యులు ప్రాథమికంగా వైద్యసేవలు అందిచినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.

వైద్యులకు చిన్నారి పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఫోన్‌ చేస్తున్నప్పటికీ 35 ఎకరాల్లో రిమ్స్‌ ఆస్పత్రి ఉందని, మీరొక్కరే ఆస్పత్రికి పేషెంటుకాదని, చూస్తాంలే.. అంటూ నిర్లక్ష్యధోరణి సమాధానం వైద్యసిబ్బంది చెప్పారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా మధ్యాహ్నం 1.30 గంటలకు రిమ్స్‌కు చిన్నారిని తీసుకువచ్చినప్పటీ ఓపీ షీట్‌ తీసుకోమని, కేషీట్‌ తీసుకోమని, పలు వార్డులకు వెళ్లమని ఉచిత సలహాలతో అత్యవసర సమయాన్ని వృథాచేశారని వాపోయారు. 

రాత్రి వరకు కొనసాగిన ఆందోళన 

చిన్నారి మృతికి చిన్నపిల్లల డ్యూటీ వైద్యులు ఎస్‌.సోమశేఖరే బాధ్యత వహించాలని బాధితులు డిమాండ్‌ చేశారు. చిన్నపిల్లల విభాగం వద్ద వారంతా ఆందోళనకు దిగారు. కొందరు వైద్యులతో వాగ్వాదానికి దిగారు. విధులను అడ్డుకొనేయత్నం చేశారు. డ్యూటీ వైద్యులు వచ్చి చిన్నారి మృతికి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

తమకు జరిగిన అన్యాయం మరెవ్వరికి జరగకూడదని పేర్కొన్నారు. రిమ్స్‌ సీఎస్‌ ఆర్‌ఎంవో డాక్టర్‌ బీసీహెచ్‌ అప్పలనాయుడు, పలు విభాగాల వైద్యులు రోష్‌మల్లికార్జున్, మూల వెంకట్రావు, హెచ్‌.రమేష్, నర్సింహమూర్తి, రమేష్‌ బాధితులతో రాత్రి 9 గంటల వరకు జరిపిన చర్చలు ఒక కొలిక్కి రాలేదు. దీనిపై విచారణ జరిపిస్తామని బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సీఎస్‌ ఆర్‌ఎంవో సూచించినా... డ్యూటీ వైద్యుడు రిమ్స్‌కు వచ్చి తమకు జరిగిన నష్టంపై సమాధానం చెప్పాల్సిందేనని బాధితులు పట్టుబట్టారు.

సమాచారం అందుకున్న రెండో పట్టణ ఎస్‌ఐ వై.రవికుమార్, సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చారు. ఎట్టకేలకు రిమ్స్‌ సీఎస్‌ ఆర్‌ఎంవోకు, రెండో పట్టణ పోలీసులకు బాధితులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవ్వడంతో సమస్య సద్దుమణిగింది.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top