బాధితులా.. నిందితులా..?

Fake Visa Gang Arrest In Hyderabad - Sakshi

ఆ మూడు కన్సల్టెన్సీల వద్ద ‘విద్యార్థుల’ చిట్టా

నాలుగున్నరేళ్లలో 650 మందికి బోగస్‌ సర్టిఫికెట్ల విక్రయం

వీరిలో దాదాపు 250 మంది ప్రస్తుతం విదేశాల్లో

వీరే ఏజెంట్లుగా మారిఇంకొదరినీ అదే బాటలో

న్యాయ సలహా కోరనున్న నగర పోలీసులు

సాక్షి, సిటీబ్యూరో: అన్ని అర్హతలు ఉన్న ఓ యువకుడు విదేశాల్లో ఉద్యోగం కోసం ఓ కన్సల్టెన్సీని ఆశ్రయించి, వారు ఆశించిన మొత్తం అందించి, అసలుది అనుకుని నకిలీ వీసా తీసుకుని... మోసపోతే అతడు బాధితుడు అవుతాడు. అర్హతలు లేని ఓ విద్యార్థి స్టడీ వీసా కోసం కన్సల్టెన్సీని సంప్రదించి, వారు డిమాండ్‌ చేసిన మొత్తం ఇవ్వడం ద్వారా నకిలీ సర్టిఫికెట్లు పొంది, వీటిని దాఖలు చేయడం ద్వారా విదేశాలకు వెళితే... కచ్చితంగా నిందితుడే. సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మంగళవారం పట్టుకున్న మూడు కన్సల్టెన్సీల నిర్వాహకుల నుంచి సర్టిఫికెట్లు కొన్న వారు రెండో కోవకే చెందుతారు. అయినప్పటికీ వీరిని బాధితులుగా భావించాలా? నిందితులుగా చేర్చాలా? అనే అంశంపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ అంశంపై స్పష్టత కోసం న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆయా కన్సల్టెన్సీలకు నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి ఇచ్చిన వ్యక్తికి ‘ట్రావెల్‌ వీడియో’ డ్రీమ్‌గా ఉంది. దానికి సన్నాహాలు చేస్తుండగానే గుట్టురట్టు కావడంతో జైలుకు వెళ్లాడు.

ఆ మూడు ఆరోపణలపై...
నగరంలోని బేగంపేట, ఎస్సార్‌నగర్‌ ప్రాంతాల్లో జస్ట్‌ వీసా కన్సల్టింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ఇండో–యూరోపియన్‌ ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్, రైజర్స్‌ ఆర్గనైజేషన్‌ కన్సల్టెన్సీలు దాదాపు నాలుగున్నరేళ్లుగా నకిలీ సర్టిఫికెట్లు తయారు చేయించి విక్రయిస్తున్నాయి. ఈ కాలంలో దాదాపు 650 మంది విద్యార్థులు, విదేశాలకు వెళ్లాలని భావించిన వారు వీటిని సంప్రదించి రూ.50  వేల నుంచి రూ.60 వేల వరకు వెచ్చించి సర్టిఫికెట్లు కొనుగోలు చేశారు. వీటినే ఆయా కాన్సులేట్స్, ఎంబస్సీల్లో దాఖలు చేయడం ద్వారా స్టడీ వీసాలు పొందిన వారు 250 మంది వరకు ఉన్నారు. వీరు తమకు తెలిసే నకిలీ సర్టిఫికెట్లు ఖరీదు చేసి వాటి ఆధారంగానే వీసాలు పొందారు. ఈ పనులన్నీ వారికి తెలిసే చేసిన నేపథ్యంలో మోసం చేయడం, ఫోర్జరీ, నకిలీ పత్రాలను అసలువిగా చూపించడం వంటి ఆరోపణల కింద వీరు నేరం చేసినట్లే. ఇందుకుగాను సర్టిఫికెట్లు ఖరీదు చేసిన వారందరినీ నిందితులుగా చేర్చే అవకాశం ఉందని కొందరు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం విదేశాలకు వెళ్లిన 250 మందినీ ఈ ఆరోపణలపై వెనక్కు రప్పించే ఆస్కారం ఉందని తెలిపారు.  

‘కస్టమర్లు’గా వచ్చి ఏజెంట్లుగా మారి...
ఈ కన్సల్టెన్సీల వద్దకు ఓసారి కస్టమర్‌గా వచ్చి సర్టిఫికెట్లు ఖరీదు చేసుకున్న వారే కొన్ని రోజులకే వారికి ఏజెంట్లుగా మారిపోతున్నారు. సంగారెడ్డి జిల్లా బొంతుపల్లికి చెందిన అఖిల్‌ మంథి గతంలో వీరి నుంచే ధ్రువీకరణ పత్రాలు ఖరీదు చేసి విదేశాల్లో ఎంఎస్‌ చేసి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత పలువురు స్టడీ వీసా పొందటంపై ఇతడి సలహాలు కోరారు. వారందరికీ ఆ మూడు కన్సల్టెన్సీలకు ‘మార్గదర్శకుడి’గా మారిపోయిన అఖిల్‌ ఏజెంట్‌గా వ్యవహరించాడు. ఒక్కో విద్యార్థిని కన్సల్టెన్సీకి తీసుకువచ్చినందుకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు నిర్వాహకుల నుంచి కమీషన్‌గా తీసుకునేవాడు. ఇలానే మరికొందరూ ఈ కన్సల్టెన్సీలకు ఏజెంట్లగా మారిపోయి ‘వ్యాపారాభివృద్ధి’కి సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ గ్యాంగ్‌ విక్రయించే సర్టిఫికెట్స్‌లో టెన్త్‌ నుంచి పీజీ వరకు... డిగ్రీ నుంచి మెడిసిన్‌ వరకు వివిధ రకాలైన కోర్సులకు చెందినవి, 19 విద్యా సంస్థలు, యూనివర్శిటీలవి ఉంటున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థల పేర్లనూ వీరు ‘వాడేశారు’. ఈ మూడు కన్సల్టెన్సీలు ఇప్పటి వరకు విక్రయించిన సర్టిఫికెట్ల జాబితా, ఖరీదు చేసిన వారి వివరాలతో కూడిన చిట్టాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  

వీడియో డ్రీమ్‌ తీరకుండానే...
ఈ మూడు కన్సల్టెన్సీలకూ ఇమ్రాన్‌ షేక్‌ అనే వ్యక్తి నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి ఇచ్చాడు. కడపకు చెందిన ఇతను 16 ఏళ్ల క్రితం నగరానికి వలసవచ్చి టోలిచౌకిలో స్థిరపడ్డాడు. కొన్నాళ్ల పాటు చిన్న చిన్న ఉద్యోగాలు చేసినా ఆ జీతంతో సంతృప్తి చెందలేదు. కంప్యూటర్, సాఫ్ట్‌వేర్స్‌పై పట్టు సాధించిన అతను 2015 నుంచి నకిలీ సర్టిఫికెట్ల తయారీ ప్రారంభించాడు. కొన్నాళ్ల పాటు ఓ ప్రైవేట్‌ ఛానల్‌లో వీడియో ఎడిటర్‌గా పని చేసిన ఇమ్రాన్‌కు ఓ డ్రీమ్‌ ప్రాజెక్టు కూడా ఉంది. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌పై హైదరాబాద్‌ నుంచి టిబెట్‌ వరకు వెళ్ళాలని, మార్గ మధ్యంలో తన అనుభవాలతో ట్రావెల్‌ వీడియో రూపొందించాలని భావించాడు. దీనికోసం ఎన్‌ఫీల్డ్‌ను కొనుగోలు చేసుకుని ప్రయాణానికి సిద్ధమయ్యాడు. అయితే అది కార్యరూపంలోకి రాకుండానే పోలీసులకు చిక్కి కటకటాల్లోకి చేరాడు. ఇతడు తయారు చేసిన సర్టిఫికెట్లలో సిటీ, కాకినాడల్లోని జేఎన్‌టీయూ, ఉస్మానియా వర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్‌ మద్రాస్, గోకరాజు రంగరాజు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, హేమ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ స్టడీస్‌ (ఆస్ట్రేలియా), ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ (విజయవాడ), కేఆర్‌ఎం యూనివర్శిటీ తదితరాలకు చెందినవి ఉన్నాయి.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top