నకిలీ నోట్ల ముఠా అరెస్టు       

Fake currency seized - Sakshi

ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

ప్రధాన నిందితుడు ఒడిశాలోని గయిబ వాసి

మరో ఇద్దరు విజయనగరం జిల్లాకు చెందినవారు

శ్రీకాకుళం డీఎస్పీ వి.భీమారావు వెల్లడి

బూర్జ : మండలంలో సంచలనం సృష్టించిన నకిలీ నోట్ల కేసును పోలీసులు ఛేదించారు. ఇందుకు సంబంధించి ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. ప్రధాన సూత్రధారి ఒడిశాకు చెందిన వ్యక్తి కాగా, మరో ఇద్దరు విజయనగరానికి జిల్లా వాసులు! స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శ్రీకాకుళం డీఎస్పీ వి.భీమారావు శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించి ఈ విషయాలను వెల్లడించారు.

ఈ నెల 12న తోటవాడ గ్రామంలో హోమియో ఆస్పత్రి అటెండర్‌ ఆరిక అప్పారావు రూ.3.50లక్షలను పోస్టాఫీస్‌లో డిపాజిట్‌ చేశారు. ఆ నగదును బ్రాంచ్‌ పోస్టుమాస్టర్‌ తిరుపతిరావు ఉపాధి వేతనదారులకు చెల్లించారు. కొంతమందికి ఇచ్చిన నోట్లలో నకిలీవి ఉన్నట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆమదాలవలస సీఐ ఆదాం, ఎస్‌ఐ జనార్దనరావు, బూర్జ పోలీసులు 10 రోజులుగా దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నారని భీమారావు తెలిపారు.

ఒడిశా గజపతి జిల్లాలోని గయిబ గ్రామానికి చెందిన స్పరిగ నాయక్‌ ప్రధాన నిందితుడని వెల్లడించారు. అతడికి సీతంపేట మండలానికి చెందిన సవర చిన్నారావు, సవర చోడంగి, లచ్చన్న, ఎస్‌.చిన్నారావుతో పాటు విజయనగరం జిల్లా గుర్ల మండలం జమ్ము గ్రామానికి చెందిన జమ్ము రాజు, గరివిడి సమీపంలోని కోడూరు గ్రామానికి చెందిన కసుమంచి శ్రీనివాసరావుతో పరిచయం ఏర్పడిందన్నారు. వీరంతా ముఠాగా ఏర్పడి కలర్‌ ప్రింటర్, కట్టర్, కంప్యూటర్, ఏ4 ఎగ్జిక్యూటివ్‌ బాండ్‌ పేపర్ల సాయంతో నకిలీ రూ.100 నోట్లు తయారు చేస్తుంటారని వివరించారు.

వీటిని శ్రీకాకుళం, విజయనగరం సంతల్లో, బ్యాంకుల వద్ద నిరక్షరాస్యులకు ఇచ్చి మోసగిస్తుంటారని పేర్కొన్నారు. పెద్ద నోట్లు ప్రింట్‌ చేస్తే అనుమానం వస్తుందనే నకిలీ రూ.100 నోట్లను తయారు చేస్తున్నారని తెలిపారు. సీతంపేటకు చెందిన సవర లచ్చన్న.. అదే గ్రామానికి చెందిన అటెండర్‌ ఆరిక అప్పారావు వద్ద ఇల్లును రూ.5.10 లక్షలకు కొనుగోలు చేసేందుకు నిర్ణయించుకున్నాడని తెలిపారు.

లచ్చన్న తన సహచరుల వద్ద ఉన్న 840 నకిలీ వంద నోట్లలో 152 నోట్లు అప్పారావుకి ఇచ్చిన నగదులో జత చేశారన్నారు. ఆ నగదులో కొంత పోస్టాఫీసులో డిపాజిట్‌ చేశాడన్నారు. పోస్టుమాస్టర్‌ తిరుపతిరావు, అటెండర్‌ అప్పారావు నిర్ధోషులుగా గుర్తించామని డీఎస్పీ స్పష్టం చేశారు. వీరిని అరెస్టు చేసి శ్రీకాకుళం అంపోలు సబ్‌ జైలుకు తరలించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top