ఆపరేషన్‌ దొంగనోట్లు

Fake Currency Gang Arrested By Police In Nellore - Sakshi

దొంగనోట్ల ముఠా అరెస్ట్‌

రూ.34.19 లక్షల విలువైన నోట్లు స్వాధీనం

నిందితులంతా పాత నేరస్తులే!

ఇప్పటికే రూ.9 లక్షలు చలామణి చేసిన వైనం

సాక్షి, నెల్లూరు: దొంగనోట్లు చలామణి చేస్తున్న ఓ ముఠా ఆటకట్టిచారు జిల్లా పోలీసులు. పశ్చిమ గోదావరి జిల్లా  ఏలూరు జంగారెడ్డిగూడెం రోడ్డు కేంద్రంగా  పలు జిల్లాలో మోసం చేస్తున్న వీరిని జిల్లా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అత్యంత చాకచక్యంగా వలపన్ని అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.34.19 లక్షల విలువైన దొంగనోట్లను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం నెల్లూరులోని ఉమేష్‌చంద్ర మెమోరియల్‌ కాన్ఫరెన్స్‌హాలులో  ఎస్పీ ఐశ్వర్యరస్తోగి ముఠా వివరాలను వెల్లడించారు. ప్రధాన నిందితుడైన పి.మురళి అలియాస్‌ మురళీకృష్ణ ప్రకాశం జిల్లా కనిగిరి మండలం రాజుపాళెం వాసి. అతను కొంతకాలంగా పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో నివాసం ఉంటున్నాడు.పాతనేరస్తుడు. కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉంది.

గతంలో దొంగనోట్లను తయారుచేసి చెలామణి చేస్తుండగా గుంటూరు జిల్లా రేపల్లె పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. నెలన్నర క్రితం బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఈక్రమంలో ఇదే తరహా నేరాలకు పాల్పడుతూ గతంలో పరిచయం ఉన్న కర్నూలు జిల్లాకు గోనెగండ్లకు చెందిన సంధ్యపోగు రాములు అలియాస్‌ ఆదాంను కలిశాడు. ఇద్దరూ కలిసి దొంగనోట్లను ముద్రించి చలామణి చేయాలని నిర్ణయించుకున్నారు. ఏలూరు పట్టణం శనివారంపేట జంగారెడ్డిగూడెం రోడ్డు వద్ద ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. కంప్యూటర్‌లు, ప్రింటర్లు, స్కానర్లు, ఆర్‌బీఐ మార్కు కలిగిన స్టిక్కర్లను ఏర్పాటు చేసుకున్నాడు. రూ.50, రూ.100, రూ.200, రూ.500, రూ.2,000 నోట్లను మొత్తం రూ.45 లక్షలకు ముద్రించారు.


స్వాధీనం చేసుకున్న కంప్యూటర్, ప్రింటర్లు 

ముఠాగా ఏర్పడి..
మురళీకృష్ణ, రాములు తమకు పరిచయం ఉన్న కావలి రూరల్‌ మండలం లక్ష్మీపురం గ్రామానికి చెంది ప్రస్తుతం నెల్లూరు వనంతోపు సెంటర్‌లో నివాసం ఉంటున్న కాకు శ్రీను అలియాస్‌ శ్రీనివాసులు, కావలి వెంగళ్‌రావ్‌నగర్‌కు చెందిన షేక్‌ మౌలాలీ, గుంటూరు జిల్లా తెనాలి పట్టణం రాధా టాకీస్‌ ప్రాంతానికి చెందిన కె.నరేంద్రకుమార్, తెనాలి మండలం పెదరావూరు గ్రామానికి చెందిన కె.రవికుమార్, చుండూరు మండలం మోదుకూరి గ్రామానికి చెందిన ఆర్‌.విద్యాకుమార్‌ అలియాస్‌ విద్యాసాగర్, ప్రకాశం జిల్లా చీరాల పట్టణం ఈపూరుపాళేనికి చెందిన సునీత, రాజస్తాన్‌ రాష్ట్రం బాదమూరు జిల్లా జనకలై గ్రామానికి చెందిన ప్రేమదాస్‌లతో ముఠాను ఏర్పరచుకున్నారు. వీరందరూ నేరచరిత్ర కలిగిన వారే. 

కమీషన్‌ లెక్కన..
మురళీకృష్ణ, రాములు ముద్రించిన నోట్లను ముఠా సభ్యులకు ఒక్కొక్కరికి రూ.లక్ష, గుంటూరుకు చెందిన కాశీ అనే వ్యక్తికి రూ.3 లక్షలు  ఇచ్చారు. అవి మార్చుకుని వస్తే రూ.లక్షకు రూ.25 వేలు కమీషన్‌ ఇస్తానని నమ్మబలికారు. దీంతో వారు దొంగనోట్లను మార్చేందుకు పలు జిల్లాలకు వెళ్లారు. నెల్లూరు జిల్లాలోని తీర ప్రాంతాల్లో ఆక్వా వ్యాపారం జోరుగా సాగుతుందని వారివద్ద మార్చివేయచ్చని నిర్ధారించుకున్న మురళీకృష్ణ, రాములు, శ్రీను, మౌలాలీలు ఈనెల 5వ తేదీన ఇందుకూరుపేట మండలానికి వచ్చారు. ఈ విషయమై జిల్లా పోలీసు బాస్‌కు సమాచారం అందింది. ఆయన ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్సు ఇన్‌స్పెక్టర్‌ ఐ.శ్రీనివాసన్, నెల్లూరు రూరల్‌ సీఐ కె.రామకృష్ణలు తమ సిబ్బందితో కలిసి నిఘా ఉంచారు.

5వ తేదీ నిందితులు ఇందుకూరుపేట యార్లగడ్డ సెంటర్‌ వద్ద దొంగనోట్లను మార్చేందుకు యత్నించసాగారు. టాస్క్‌ఫోర్స్‌ సీఐ నేతృత్వంలో పోలీసులు అక్కడికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిచ్చిన సమాచారం మేరకు శుక్రవారం ఏలూరులో దొంగనోట్లు ముద్రించే పరికరాలతోపాటు ముఠాలోని నరేంద్రకుమార్, రవికుమార్, విద్యాసాగర్, సునీత, ప్రేమదాస్‌లను అరెస్ట్‌ చేశారు. నిందితులు సుమారు నెలరోజుల వ్యవధిలో రూ.9 లక్షల దొంగనోట్లను చలామణి చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. సూరత్‌ నుంచి ఓ వ్యాపారి రూ.200 దొంగనోట్లు రూ.4 లక్షలు కావాలని నిందితులను కోరినట్లుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఇదిలా ఉండగా దొంగల ముఠాలో ఏ2గా ఉన్న సంధ్యపోగు రాములు అలియాస్‌ ఆదాంపై గుంటూరు, కర్నూలు, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో 10 కేసులకు పైగా ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. 

స్వాధీనం చేసుకున్నవి
పోలీసులు నిందితుల నుంచి రూ.3,99,800 దొంగనోట్లు స్వాధీనం చేసుకున్నారు. వారిచ్చిన సమాచారం మేరకు ఏలూరులో దొంగనోట్లను ముద్రించేందుకు ఉపయోగించిన కంప్యూటర్‌ ఇతర సామగ్రిని, వస్తువులను, రూ.25 లక్షల దొంగనోట్లు, తెనాలిలో రూ.3 లక్షలు, చీరాలలోని ఈపూరుపాళెంలో రూ.2 లక్షల దొంగనోట్లను ఇలా మొత్తంగా రూ.34,19,200 స్వాధీనం చేసుకున్నారు. 

సిబ్బందికి రివార్డులు 
కేవలం రోజుల వ్యవధిలోనే దొంగనోట్ల ముఠా గుట్టురట్టు చేసి నిందితులను అరెస్ట్‌ చేసేందుకు కృషిచేసిన టాస్క్‌ఫోర్సు ఇన్‌స్పెక్టర్‌ ఐ.శ్రీనివాసన్, నెల్లూరు రూరల్‌ సీఐ కె.రామకృష్ణ, ఎస్సైలు నరేష్, ఎస్సై సుబ్రహ్మణ్యం, శివరామకృష్ణ, హెడ్‌కానిస్టేబుల్స్‌ ఎస్‌కే అమీన్, ఐ.ఇస్మాయిల్, పీసీలు ఎం.రమేష్, డి.వెంకటేశ్వర్లు, దేవకిరణ్, శివనారాయణ, ఇంతియాజ్‌లను ఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు.

ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసన్‌కు నగదు రివార్డు అందిస్తున్న ఎస్పీ రస్తోగి

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top