దొంగనోట్ల ముఠా అరెస్టు

fake currency gang arrest in nehru busstand - Sakshi

రూ.12లక్షల నోట్లు స్వాధీనం

విజయవాడ బస్టాండ్‌లో రూ.500 నోట్లు మార్చే యత్నం

ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు

విజయవాడ: నకిలీ కరెన్సీ నోట్లను తయారు చేసి, వాటిని మార్చేందుకు యత్నించిన ముగ్గురిని విజయవాడలోని కృష్ణలంక, సీసీఎస్‌ పోలీ సులు అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను సూర్యారావుపేట పోలీసు స్టేషన్‌లో ఏసీపీ కె.శ్రీనివాసరావు శుక్రవారం విలేకరులకు తెలి పారు. ఆయన కథనం మేరకు... విజయవాడ పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌లో కర్నూలు జిల్లాకు చెందిన పల్లె రాఘవరెడ్డి అలియాస్‌ రఘునాథరెడ్డి రూ.500 నకిలీ నోటు మారుస్తుండగా కృష్ణలంక పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. కృష్ణలంక పోలీసులు సీసీఎస్‌ సిబ్బంది సహకారంతో అతడిని విచారించారు. అప్పులపాలై ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న రాఘవరెడ్డికి ఒక వ్యక్తి నకిలీ నోట్లు మారిస్తే తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో సంపాదిం చొచ్చని సలహా ఇచ్చాడు. ఆ సలహా మేరకు తణుకులో నకిలీ నోట్లు తయారు చేసే బండి రాజు, అడబాల ఆంజనేయమూర్తిని పరిచయం చేసుకుని దొంగనోట్లు మార్పిడీకి చేతులు కలిపాడు.

రూ.లక్ష నకిలీ కరెన్సీనోట్లకు రూ.30వేలు అసలు నోట్లు ఇచ్చేలా ఒప్పొందం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో 8వ తేదీన తణుకు బస్టాండ్‌లో ఆంజనేయమూర్తి, బండి రాజుకు రూ.1.50 లక్షల ఒరిజినల్‌ నోట్లు ఇచ్చిన రాఘవరెడ్డి వారి నుంచి రూ.4.50 లక్షల నకిలీ కరెన్సీ తీసుకున్నాడు. అనంతరం రాఘవరెడ్డి అదే రోజు సాయంత్రం 4గంటలకు విజయవాడలో పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌కు చేరుకుని అక్కడ రూ.500 నోటు మార్చేందుకు యత్నించి పట్టుపడ్డాడు. రాఘవరెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు కృష్ణలంక, సీసీఎస్‌ పోలీసులు తణుకు వెళ్లి ఆంజనేయమూర్తి, బండిరాజు అరెస్టు చేశారు. బస్టాండ్‌లో రాఘవరెడ్డి వద్ద రూ.4,29,500, తణుకులో బండి రాజు ఇంట్లో రూ.7.74లక్షలు కలిపి రూ.12,03,500 విలువైన నకిలీ ఐదొందల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. వీరితో పాటు దొంగనోట్లు మార్చిన మరో వక్తికోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుల్లోని ఆంజనేయమూర్తి, బండి రాజుపై ఇప్పటికే 11 కేసులు ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం, పాలకొల్లు, నర్సాపురం, భీమవరం, ఒంగోలు, హైదరాబాద్, విజయవాడ కమిషనరేట్‌లో గన్నవరంతోపాటు కైకలూరులో చెక్‌బౌన్స్‌లు, నకిలీ నోట్లు చలామణీ కేసులు నమోదయ్యాయి. విలేకరుల సమావేశంలో సీసీఎస్‌ ఏసీపీ సుందరరాజు, కృష్ణలంక సీఐ చంద్రశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top