నకిలీ బాబా అరెస్ట్‌.. టీవీ చానళ్లకు నోటీసులు | Fake Baba Arrest In Gachibowli Hyderabad | Sakshi
Sakshi News home page

నకిలీ బాబా అరెస్ట్‌

Jul 14 2018 10:49 AM | Updated on Sep 4 2018 5:44 PM

Fake Baba Arrest In Gachibowli Hyderabad - Sakshi

స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలు , నిందితుడు శివోహం రామ శివానుజం

గచ్చిబౌలి: ఆరోగ్య, ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారు శక్తి యాగం చేస్తే ఇట్టే సమస్యలు తొలగిపోతాయని మాయ మాటలు చెప్పి తులాల కొద్ది బంగారం దోచుకున్న నకిలీ బాబాను అరెస్ట్‌ చేసినట్లు సైబరాబాద్‌ కమిషనర్‌ వి.సి.సజ్జనార్‌ తెలిపారు. శుక్రవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ కమిషనరేట్‌లో వివరాలు వెల్లడించారు. కలది కేరళకు చెందిన శివోహం రామ శివానుజం అలియాస్‌ రామ శివ చైతన్య స్వామి, కేరళలోని శివోహం జ్ఞాన గురుపీఠంలో పెరిగారు. వివిధ ప్రాంతాల్లో తిరిగిన అతను హైదరాబాద్‌ చేరుకుని 2009లో తేజస్విని వివాహం చేసుకున్నారు.  యూసూఫ్‌గూడలో తత్వపీఠం పేరిట అధ్యాత్మిక కేంద్రాన్ని ఏర్పాటు చేసిన అతను 2018లో ఎర్రగడ్డకు మకాం మార్చారు. శక్తి యాగం చేస్తే ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయని ప్రచారం చేసుకునేవాడు.

అవసరమైన వారు కోరితే ఆశ్రమంలో గాని, లేదా వారి ఇంట్లో  పూజలు, యజ్ఞాలు చేస్తానని నమ్మబలికే వాడు. పూజలు చేసే క్రమంలో కలశంలో బంగారాన్ని వేయించి దానిపైన గుడ్డతో కట్టి ఉంచేవారు. 60 రోజుల తరువాత తానే దానిని తెరువాలని, మీరు తెరిస్తే బియ్యం, రాళ్లు వస్తాయని భయపెట్టేవాడు. అదును చూసుకొని బంగారం ఉన్న కలశాన్ని తీసుకొని బియ్యం రాళ్ల కలశాన్ని అక్కడ ఉంచే వాడు.  ఒకవేళ భక్తులు బంగారం లేదని చెబితే నగదు తీసుకొని తానే బంగారాన్ని కొని కలశంలో వేసేవాడు. ఈ బంగారాన్ని తేజస్విని మణపురం, ముత్తూట్‌ ఫైనాన్స్‌లో కుదువబెట్టి సొమ్ము చేసుకునేది. వీరిపై బోయినపల్లి పీఎస్‌ పరిధిలో మూడు, ఎస్‌ఆర్‌నగర్‌ పీఎస్‌ పరిధిలో రెండు, వనస్థలిపురం, జీడిమెట్ల, రాజేంద్రనగర్, మైలార్‌దేవర్‌పల్లి పీఎస్‌ , పచ్చిమ గోదావరిలోని  బొమ్మూరు, కృష్ణా జిల్లాలోని కంచికిచెర్ల పీఎస్‌ పరిధిలో ఒక్కో కేసు నమోదయ్యాయి. కలశంలో 62 తులాలు(వడ్డాణంతో సహా), 25 తులాలు, 24 తులాలు వేసిన వారు ఉన్నారు. ఓ రిటైర్డ్‌ పోలీస్‌ అధికారి భార్య సైతం ఇతని చేతిలో మోసపోయినట్లు తెలిపారు. మధ్యవర్తిగా ఉంటూ భక్తులను మోసగించిన మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.  నిందితుడి నుంచి 1163 గ్రాముల బంగారు ఆభరణాలు, 760 గ్రాముల బంగారం, ఎక్స్‌యూవీ కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. 

టీవీ చానళ్లకు నోటీసులు
శివోహం రామ శివానుజం అలియాస్‌ రామ శివ చైతన్య స్వామి జెమినీ, భక్తి టీవీ, మహాన్యూస్, సీవీఆర్, ఓం టీవీల్లో పెయిడ్‌ ఆర్టికిల్స్‌ ప్రసారం చేయడంతో అమాయకులు నమ్మి మోసపోయారని సీపీ తెలిపారు. ఆయా  చానళ్లకు నోటీసులు జారీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement