ఫేస్‌బుక్‌ మోసగాడు అరెస్టు | Facebook Cheater Arrest | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌ మోసగాడు అరెస్టు

Mar 23 2018 1:40 PM | Updated on Aug 20 2018 4:27 PM

Facebook Cheater Arrest - Sakshi

స్వామిరెడ్డి శ్రీనివాసరావును అరెస్టు చేసి చూపిస్తున్న పోలీసు అధికారులు

కాకినాడ రూరల్‌: ఫేస్‌బుక్‌ ప్రేమ పేరుతో ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులను మోసగించి, బెదిరించి డబ్బులు, బంగారు, మోటార్‌సైకిళ్లు దోచుకుంటున్న యువకుడిని సర్పవరం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. గురువారం సర్పవరం స్టేషన్‌లో కాకినాడ డీఎస్పీ రవివర్మ, సర్పవరం సీఐ చైతన్యకృష్ణ ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆనేక ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. కాకినాడ రాజీవ్‌గాంధీ లా కళాశాలలో ఎల్‌ఎల్‌బీ చదువుతున్న ఉప్పాడ గ్రామానికి చెందిన స్వామిరెడ్డి శ్రీనివాసరావు (28) ఫేస్‌బుక్‌ ప్రేమపేరుతో మెడిసిన్, ఇంజినీరింగ్, అగ్రికల్చరల్‌ బీఎస్సీ చదువుతున్న అమ్మాయిలను, వివిధ కంపెనీల్లో పని చేస్తున్న ఉద్యోగులను బెదిరించి డబ్బులు, బంగారు ఆభరణాలను, మోటార్‌సైకిళ్లను దోచుకుంటున్నాడన్నారు. తన పేరు షాలినీ కుసిరెడ్డి అని రంగరాయ మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ చదువుతున్నట్టు ఫేస్‌బుక్‌లో పరిచయం చేసుకుని, బాగా పరిచయమైన తరువాత తన పేరు స్వామిరెడ్డి శ్రీనివాసరావు అని చెబుతున్నాడన్నారు. రూ.కోటి, రూ.రెండు కోట్లు పెట్టి హాస్పిటల్‌ కట్టిస్తానని తనను ప్రేమించమంటూ వేధిస్తున్నాడని పోలీసులు వివరించారు.

తనను పెళ్లి చేసుకోవాలని, లేదా శారీరకంగా కలవాలని లేకపోతే అధిక మొత్తంలో డబ్బులు, బంగారం ఇవ్వాలంటూ డిమాండ్‌ చేస్తున్నాడని డీఎస్పీ రవివర్మ వివరించారు. డబ్బులు, బంగారం ఇవ్వక పోతే ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో వారి ఫోటోలు డౌన్‌లోడ్‌ చేసుకుని మార్ఫింగ్‌ చేసి న్యూడ్‌ ఫొటోలుగా నెట్‌లో పెడతానని బెదిరించేవాడన్నారు. స్వామిరెడ్డి శ్రీనివాసరావు విశాఖపట్నం ఆంధ్రా మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ ఫైనలియర్‌ చదువుతున్న విద్యార్థినిని, అమలాపురం కిమ్స్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని వేధింపులకు గురి చేసి డబ్బులు డిమాండ్‌ చేసినట్టు డీఎస్పీ రవివర్మ, సీఐ చైతన్యకృష్ణ వివరించారు. కిమ్స్‌ కళాశాల విద్యార్థిని నుంచి రూ. 10వేలు, జేఎన్‌టీయూకే విద్యార్థినిని బెదిరించి రూ.80వేల నగదు, బంగారు బ్రాస్‌లెట్, ఉంగరం వసూలు చేశాడన్నారు. అదే విధంగా విశాఖపట్నానికి చెంది ఐఓసీఎల్‌లో పని చేస్తున్న ఒక ఆమెను బ్లాక్‌ మెయిల్‌ చేసి రూ.18 వేలు వసూలు చేశాడని, కాకినాడకు చెందిన విద్యార్థిని నుంచి హోండా యాక్టీవా మోటర్‌ సైకిల్, విశాఖపట్నానికి చెందిన ఆమెకు సంబంధించి టీవీఎస్‌ జ్యూపిటర్‌ మోటర్‌సైకిల్‌ను దొంగిలించాడన్నారు. ఇదే విధంగా విశాఖపట్నానికి చెందిన ఒక మైనరు బాలికను వంచించి న్యూడ్‌ వీడియో తీసి డబ్బుల కోసం డిమాండ్‌ చేస్తున్నాడన్నారు. ఇతడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్టు డీఎస్పీ రవివర్మ, సీఐ చైతన్యకృష్ణ
వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement