భూ వివాదం.. దళిత రైతు సజీవ దహనం

Dalit Farmer Burned Alive In Bhopal Over Land Disputes - Sakshi

భోపాల్‌ : పంట భూమి కోసం జరిగిన గొడవలో ఓ దళిత రైతుపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు ప్రత్యర్థులు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. భోపాల్‌ జిల్లా పరోసియా ఘట్‌ఖేదికి చెందిన కిషోరీలాల్‌ జాదవ్‌(55)కు 2000 సంవత్సరంలో ప్రభుత్వం మూడెకరాల భూమిని ఇచ్చింది. ఆ భూమిని ఆనుకొని అదే గ్రామానికి చెందిన తిరణ్‌ యాదవ్‌ భూమి ఉంది. ప్రతి సంవత్సరం జాదవ్‌ భూమిలోని కొంత భాగాన్ని దున్ని తిరణ్‌ పంట వేసుకునేవాడు. కొన్ని నెలల ముందు జాదవ్‌ ల్యాండ్‌ సర్వే చేయించగా ఆక్రమణ విషయం బయటపడింది. అయితే తిరణ్‌ ఆక్రమించిన భూమిని వెనక్కి ఇవ్వటానికి అంగీకరించలేదు.

గురువారం ఉదయం యథాప్రకారం ఆక్రమించిన భూమిని దున్నటం మొదలుపెట్టాడు. విషయం తెలుసుకున్న జాదవ్‌ భార్యతో కలిసి పంట భూమి దగ్గరకు వెళ్లి అలా చేయవద్దని వారించాడు. దీంతో ఆగ్రహించిన తిరణ్‌ అతని బంధువులు అతనిపై దాడిచేసి వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ మీద పోసి నిప్పంటించి అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్ర గాయాలపాలైన జాదవ్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. జాదవ్‌ కొడుకు కైలాష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top