
రామిరెడ్డి (ఫైల్ )
అద్దంకి: బైకు అదుపు తప్పి కింద పడటంతో ఆర్టీసీ కండక్టరు మృతి చెందిన ఘటన మండలంలోని కలవకూరు రహదారిలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. బంధువులు తెలిపిన సమాచారం మేరకు వెల్లంపల్లి గ్రామానికి చెందిన ఉదయరామిరెడ్డి (42) ఆర్టీసీలో కండక్టరుగా పనిచేస్తున్నాడు. అద్దంకి మండలంలోని కలవకూరు గ్రామానికి చెందిన జయంతిని వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం అద్దంకి ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్నాడు. బుధవారం సింగరకొండ క్షేత్రంలో తన బంధువుల వివాహానికి హాజరయ్యాడు. అనంతరం అత్తగారి గ్రామమైన కలవకూరులో ఉన్న తన భార్యను తీసుకుని రావడానికి రాత్రి సమయంలో బైకుపై బయలు దేరాడు. ఈ నేపథ్యంలో బైకు సింగరకొండపాలెం నుంచి కలవకూరు గ్రామ మధ్యలోని మలుపులో అదుపుతప్పి బోల్తా కొట్టడంతో కిందపడిపోయాడు. రాత్రి సమయం కావడంతో ఎవరూ గమనించలేదు.
ఎన్నోసార్లు ఫోన్ చేసిన భార్య..
భర్త వచ్చి తనను బైకుపై అద్దంకి తీసుకెళ్తానని చెప్పిన తరువాత, ఎంతసేపటకీ రాకపోవడంతో, ఎన్నోసార్లు ఫోన్ చేసింది. ఎంతకీ ఫోన్ బదులు రాకపోవడంతో అనుమానించింది. వెంటనే బంధువులు, పెళ్లివారిని విచారించగా, రాత్రి సమయంలోనే బయలుదేరి వెళ్లాడని చెప్పారు. దీంతో వారు దారి వెంట వెతుకుతూ ఫోన్ చేయసాగారు. రోడ్డు మలుపులో ఆయన ఫోన్ రింగ్ కావడంతో అక్కడ చూడగా, గుంతలో పడిపోయిన బైకు, దూరంగా మృతిచెంది ఉన్న రామిరెడ్డి కనిపించారు. ఈ దృశ్యం చూసిన భార్య, బంధువులు భోరున విలపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతునికి ఇరువురు కుమారులున్నారు.